Begin typing your search above and press return to search.

పవన్ నోట మరోసారి ‘చెప్పు’ మాట.. ఈసారి ఎవరికి?

By:  Tupaki Desk   |   15 March 2023 12:08 PM GMT
పవన్ నోట మరోసారి ‘చెప్పు’ మాట.. ఈసారి ఎవరికి?
X
జనసేన పదో ఆవిర్భావ సభలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడటం తెలిసిందే. అనుకున్న దాని కంటే ఆలస్యంగా సభాస్థలికి చేరిన ఆయన.. సభకు విచ్చేసిన వేలాది మందిని ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. పలు అంశాల మీద క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో తన మీద వచ్చే ఆరోపణలపైనా.. తనను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలకు బదులిచ్చారు. ఈ క్రమంలో.. పవన్ నోటి నుంచి మరోసారి చెప్పుదెబ్బ మాట వచ్చింది. అయితే.. ఈసారి మరింత ఘాటుగా ఆయన రియాక్టు అయ్యారు. గతంలో తనను వ్యక్తిగతంగా దెబ్బ కొట్టేందుకు వీలుగా వైసీపీ నేతలు చేసే వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్.. చెప్పుతో కొడతానని వ్యాఖ్యానించటం తెలిసిందే.

తాజా ఆవిర్భావ సభలోనూ పవన్ నోటి నుంచి మరోసారి చెప్పుదెబ్బ మాట వచ్చింది. మరి.. ఈసారి ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పవన్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు రూ.వెయ్యికోట్లు ఆఫర్ చేశారంట. ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నా. నేను మిమ్మల్ని డబ్బు పెట్టి కొనుగలనా? సిద్ధాంతంతోనే మీకు దగ్గర కాగలను. గతంలోనూ ఇలానే ప్యాకేజీ ఇచ్చారంటే చెప్పు చూపాను. తెనాలికి చెందిన వెంకటేశ్వరరావు చేసిన చెప్పుల్నే నేను వేసుకుంటా. పిచ్చి పిచ్చిగా వాగితే వాటితో కొడితే గట్టి దెబ్బ పడుతుంది. డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదు. అవసరమైతే ఇచ్చేవాడినే’’ అంటూ ఫైర్ అయ్యారు.

ఇంతకీ పవన్ అన్న తాజా చెప్పు దెబ్బ ఎవరికి అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే కాస్తంత వెనక్కి వెళ్లాలి. కొద్ది వారాల క్రితం ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన అధినేత తన కాలమ్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పవన్ కల్యాణ్ కు రూ.వెయ్యి కోట్లు ఫండ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన మంతనాల కోసం ఆయన కొందరిని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కు ఆ భారీ మొత్తం ఇవ్వటం ద్వారా ఎన్నికల్లో ఖర్చుకు అవసర పడుతుందని.. ఆ మొత్తంతో కలిసి కాకుండా ఒంటరిగా బరిలోకి దిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ ఈ ప్లాన్ అంతా.. పవన్ మీద ప్రేమ కంటే కూడా.. ఏపీలో పవన్ ఒంటరిగా పోటీ చేస్తే.. జగన్ ప్రభుత్వం కొలువు తీరుతుందని.. తెలంగాణ డెవలప్ మెంట్ కు వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

అయితే.. ఈ వ్యాసంలోని అంశాలు పాజిటివ్ గా కాకుండా.. నెగిటివ్ గా వెళ్లటం.. ఈ వ్యాఖ్యల మీద యూట్యూబుల్లో ప్రత్యేక కథనాల్నిభారీగా ప్రచారం చేయటం.. ఈ సందర్భంగా పవన్ ను దెబ్బ తీసేందుకు సదరు మీడియా సంస్థ అలాంటి ప్రచారం మొదలుపెట్టిందన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. సదరు మీడియా అధినేత తన అక్షరాలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను అన్నదేమిటి? అందుకు భిన్నంగా ప్రచారం జరుగుతున్నదేమిటో వివరించే ప్రయత్నం చేశారు. తన మీద విరుచుకుపడే వారికి ఆయన సమాధానం ఇచ్చారు.

ఆ సందర్భంలోనూ పవన్ కు వెయ్యి కోట్లు ఆఫర్ చేసినట్లుగా చెప్పలేదని.. అలాంటి డీల్ దిశగా అడుగులు పడుతున్నాయి.. పవన్ ను వాడుకోవాలన్నదే కేసీఆర్ ఆలోచన అన్నదే తన అక్షరాల అర్థంగా ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. తాజాగా పవన్ మాటల్ని చూస్తే.. ఆయన అక్షరాల్ని అర్థం కంటే అపార్థమే చేసుకున్నారని చెప్పాలి. అందుకే వెయ్యి కోట్ల పై మాట్లాడితే చెప్పు దెబ్బ గట్టిగా పడుతుందన్న పవన్ వ్యాఖ్య.. తనకు ప్యాకేజీ ఇస్తారనే మాట చెప్పే ప్రతి ఒక్కరికి అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి.