Begin typing your search above and press return to search.

అదే త‌ర్జ‌న‌ భర్జన.. ప‌వ‌న్‌ది తిక‌మ‌కేనా..!

By:  Tupaki Desk   |   15 March 2023 9:41 AM GMT
అదే త‌ర్జ‌న‌ భర్జన.. ప‌వ‌న్‌ది తిక‌మ‌కేనా..!
X
``ఏమీ తేల‌లేదు.. ఏ కుండ‌లూ బ‌ద్ద‌లు కాలేదు. ఏ విష‌యంపైనా క్లారిటీ రాలేదు. మొత్తానికి తేలింద‌ల్లా.. ఎదురు చూపులు.. అర్ధం ద‌క్క‌ని ప‌ర‌మార్థం``. తాజాగా జ‌న‌సేన ఆవిర్భావ స‌భ విష‌యంపై మేధావులు చేస్తున్న కామెంట్లు ఇవి. నిజానికి ప‌వ‌న్ స‌భ‌పై కొన్ని వారాలుగా.. ఆశ‌లు అంచ‌నాలు దాటాయి. ముఖ్యంగా..యువ‌త‌కు ప్రాధాన్యం.. మ‌హిళ‌కు రిజ‌ర్వేష‌న్ స‌హా.. కీల‌క‌మైన వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుస‌రించ‌బోయే వ్యూహం వంటివి కూడా తేలిపోతాయని అంద‌రూ అనుకున్నారు.

ఇక‌, గ‌త రెండురోజులుగా మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన స‌ద‌స్సులు.. స‌మావేశాల్లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. కాపుల విష‌యాన్ని కూడా తేలుస్తార‌ని.. అంద‌రూ అనుకున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన‌లో ఎద‌గాలి.. అనుకున్న‌వారు మ‌రిన్ని ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా వీరి ఆశ‌లేవీ ఫ‌లించ‌లేదు. ఏ విష‌యంలోనూ ప‌వ‌న్ క్లారిటీ ఇవ్వ‌లేదు. క‌ల‌క‌మైన ప‌దో ఆవిర్భావ స‌ద‌స్సులో పార్టీ ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌కు ప‌వ‌న్ చేసిన ప్ర‌యోగం ఏమీ క‌నిపించ‌లేదు. కేవ‌లం కొంద‌రు రైతుల‌కు రూ.ల‌క్ష చొప్పున పంపిణీ చేసి.. య‌థాత‌థంగా.. ప్రసంగించి.. ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు.

నిజానికి ఏ పార్టీకైనా ఆవిర్భావ స‌ద‌స్సు అంటే.. అదొక అత్యంత కీల‌క‌మైన స‌ద‌స్సు. అదేదో.. కేవ‌లం నాలుగు వ్యాఖ్య‌లు.. ప‌ది విమ‌ర్శ‌లు చేసి త‌ప్పుకొనే స‌భ కాదు. కానీ, ప‌వ‌న్ ఇదే చేశారు. గ‌తం గురించిన ప్ర‌స్తావన లేదు. భ‌విష్య‌త్తుపై నిర్దేశం కూడా క‌నిపించ‌లేదు. ఇత‌మిత్థంగా ఎక్క‌డా ఈ నిర్ణ‌యం తీసుకుంటాను.. అని చెప్పే ప్ర‌య‌త్నంకూడా చేయ‌లేదు. క‌ప్ప‌ల‌తక్కెడ కామెంట్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. నివేదిక‌ల ఆదారంగా పొత్తుల‌పై నిర్ణ‌యాలు తీసుకుంటానన్నారు.

ఇక‌, నివేదిక‌లు త‌న‌కు అనుకూలంగా ఉంటే.. ఒంట‌రిపోర‌న్నారు. ఇలా చేసి.. కేడ‌ర్‌ను ఏం చేయ‌నున్నార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రోవైపు బీజేపీతో పొత్తు విష‌యంలోనూ అసంబ‌ద్ధ వ్యాఖ్య‌ల‌కే ప‌వ‌న్ ప‌రిమితం అయ్యారు. ‘నేను బీజేపీతో పొత్తులో ఉంటే ముస్లింలు నాకు దూరం అవుతారని కొందరు అంటున్నారు. వారికి ఇష్టం లేకపోతే నేను బీజేపీ దూరంగా జరుగుతాను. పొత్తులో ఉంటే మాత్రం.. ఎక్కడైనా మైనార్టీలపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోను.

వెంటనే పొత్తు నుంచి బయటకువస్తానని మాట ఇస్తున్నా. మళ్లీ చెబుతున్నా ముస్లింలపై ఎవరు దాడులు చేసినా సరే ఊరుకునేది లేదు.. తాట తీస్తాను' అని పవన్ అన్నారు. మ‌రి దీనిలో లాజిక్ ఏంటో ఎవ‌రికైనా అర్ధ‌మైందా? అని త‌ట్టి చూసుకోవాలి. మొత్తంగా.. ప‌వ‌న్ పార్టీ ప‌దో వార్షిక స‌భ `అదే భ‌ర్జ‌న‌-అదే త‌ర్జ‌న‌.. ప‌వ‌న్‌ది తిక‌మ‌కేనా?!` అన్న కామెంట్ల‌నే మిగిల్చింది.