Begin typing your search above and press return to search.

పవన్ స్పీచ్ లో ఆ రెండింటి మీదనే ఫోకస్...!

By:  Tupaki Desk   |   15 March 2023 7:46 AM GMT
పవన్ స్పీచ్ లో ఆ రెండింటి మీదనే ఫోకస్...!
X
జనసేనకు పదవ ఆవిర్భావ సభ. ఒక విధంగా పార్టీకి మైలు రాయి లాంటి మీటింగ్. పవన్ ఈ మీటింగులో ఏమి చెబుతారో అన్న ఆసక్తి సర్వత్రా ఉంది. అయితే పవన్ స్పీచ్ లో అనుకున్నంత వాడి వేడి కనిపించలేదన్న కామెంట్స్ అయితే వచ్చాయి. పవన్ మచిలీపట్నం సభకు రావడమే మూడు గంటలు ఆలస్యంగా వచ్చారు. ఇక ఆవిర్భావ సభకు జనం పోటెత్తారు అనే చెప్పాలి.

అయితే పవన్ యూత్ ని టార్గెట్ చేస్తూ స్పీచ్ ని మొత్తం కొనసాగించారు. ఈసారి పొలిటికల్ పంచులు తక్కువగానే ఉన్నాయి. అదే సమయంలో పవన్ కులం అంటూ ఎక్కువగా దాని మీదనే ఫోకస్ చేస్తూ మాట్లాడారు. ఆయన మాటలు అన్నీ కూడా కులం వద్దు అభివృద్ధి ముఖ్యం. సమాజంలో అన్ని కులాలు సమానమే అంటూ సాగింది.

మీరు కులం రొచ్చులో ఇరుక్కోవద్దు అని కూడా పవన్ సూచించారు. ఇక పవన్ కళ్యాణ్ కులాల కుంపట్ల వల్లనే సమాజం నాశనం అవుతోందని అన్నారు. కులం ఎవరికీ చాయిస్ గా రాదని పుట్టుకతో వస్తుందని, కానీ కులాల హద్దులను దాటి ముందుకు సాగితే మాత్రం అభివృద్ధిని సాధించగలమని అన్నారు. ఇక అగ్ర కులంలో పేదలు ఉన్నారని, వారు ఎంత బాగా చదువుకున్నా సరైన అవకాశాలు రావడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దేశంలో రిజర్వేషన్లు అణగారిన వారికి ఉన్నాయని, వాటిని ఎవరూ తీసివేయలేరని, అవి వారి ఉన్నతి కోసం రాజ్యాంగంలో పొందుపరచినది అని గుర్తించాలని అన్నారు. అదే సమయంలో అగ్ర కులాల వారిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని పవన్ హామీ ఇచ్చారు.

తాను అన్ని కులాలకు సమాన అవకాశాలు ఇస్తానని, తన చుట్టూ విశాలమైన భావజాలం కలిగిన వారే ఉంటారు తప్ప సంకుచితమైన వారు ఉండరని అన్నారు. తాను ఎవరి పల్లకీ మోయను అని డబ్బుకు ఆశపడే వ్యక్తిత్వం తనకు లేదని అన్నారు. తనకు తెలంగాణ సీఎం కేసీయార్ వేయి కోట్లు ఇచ్చారని అనడం కంటే హాస్యాస్పదం ఉండదని అన్నారు. వేయి కోట్లు బదులు పది వేల కోట్లు అంటే బాగుండేదని ఆయన సెటైర్లు వేశారు.

తాను బలమైన భావజాలంతో పార్టీని నిర్మించానని, ఇంతటి అభిమానం తనకు దక్కడం వెనక అదే ఉందని , డబ్బుతో ఎవరూ ప్రజల ప్రేమను కొనలేరని అన్నారు. ఇక మతం గురించి చెబుతూ పాకిస్థాన్ మత ప్రాతిపదినక విడిపోయినని కానీ లౌకిక ధర్మాన్ని భారత్ అనుసరిస్తోందని, ఈ దేశంలో అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయని పవన్ అన్నారు. మతం అన్నది సున్నితమైన భావన అని దాన్ని ఎవరూ రెచ్చగొట్టాలని చూడరాని, వేరే విధంగా వాడుకోరాదని అన్నారు.

తాను అన్ని మతాలను గౌరవిస్తాను అని తనకు అందరూ సమానమే అని పవన్ అన్నారు. తాను జాతీయ వాదాన్ని మానవత్వాన్ని నమ్ముతానని మైనారిటీ సోదరులు తనను నమ్మి తమ పార్టీ వైపు చూడాలని ఆయన కోరుకున్నారు. మొత్తానికి పవన్ స్పీచ్ అంతా కులం మతం చుట్టూ ఈసారి తిరగడం విశేషం. మరి ఈ స్పీచ్ ద్వారా పవన్ ఏపీలో జనసేన అధికారంలోకి వస్తే సమ సమాజన్ని నిర్మిస్తామని చాటి చెప్పారు.