Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌ను: ప‌వ‌న్ ట్వీట్.. రాజ‌కీయ ప‌ల‌క‌రింపులు

By:  Tupaki Desk   |   4 March 2023 8:00 AM GMT
జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌ను:  ప‌వ‌న్ ట్వీట్.. రాజ‌కీయ ప‌ల‌క‌రింపులు
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఏపీ గురించి ఎప్పుడు మాట్లాడినా..ఇక్క‌డి స‌మ‌స్య‌లు, వైసీపీ పాల‌న‌లోని లోపాలు వంటివాటి నే ప్ర‌స్తావిస్తారు. ముఖ్యంగా వైసీపీ మంత్రులు అవ‌లంభిస్తున్న తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌డుతుంటారు. ప్ర‌జ‌ల‌కు స‌రైన పాల‌న అందించ‌డం లేద‌ని, విప‌క్షాల గొంతు నులిమేస్తున్నాయ‌ని.. క‌నీస మౌలిక‌సౌక‌ర్యాలుకూడా క‌ల్పించ‌లేక‌పోతున్నార‌ని కూడా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఉంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని కూక‌టి వేళ్ల‌తో పెక‌లించి వేయాల‌ని కూడా పిలుపుని చ్చారు.

అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ప‌వ‌న్ చేసిన ట్వీట్‌.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి కార‌ణం.. ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌క‌పోవ‌డం.. పైగా రెండు రోజుల పాటు విమ‌ర్శించ‌న‌ని ఒట్టు పెట్టుకోవ‌డం. వంటివి ఇప్పుడు ఆస‌క్తిగా మారాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు ఏం జ‌రిగిందనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం ఏపీలో పెట్టుబ‌డుల స‌ద‌స్సు జ‌రుగుతోంది. దీనిని ఉద్దేశించి ప‌వ‌న్ ట్వీట్ చేశారు. ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించాల‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు యువ‌త‌కు సూచించారు.

రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించాల‌న్నారు. ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయ‌కుండా.. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించాల‌న్నారు. అంతేకాదు.. రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదని.. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయమని స్పష్టం చేశారు.

అయితే.. ఇది ప‌వ‌న్ ఏదో త‌మ‌ను పొగిడేందుకు చేసిన ట్వీటేన‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. దీనికి వారు సానుకూలంగా స్పందిస్తున్నారు.కానీ, ఇక్క‌డ ప‌వ‌న్ ఉద్దేశం వేరుగా ఉంది. ప్ర‌పంచ దేశాలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చిన స‌మ‌యంలో మ‌న‌లోమ‌నం కొట్టుకుంటే వారికిచుల‌క‌న అవుతామ‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే..దీనిపై కొన్ని రాజ‌కీయ ప‌ల‌క‌రింపులు వ‌చ్చినా.. ప‌వ‌న్ ఏమీ లైన్ మార్చుకోలేద‌నే విష‌యాన్ని గుర్తించాల‌ని అంటున్నారు.