Begin typing your search above and press return to search.

ఆవేశం ప్లస్ దూకుడు ఈజ్ ఈక్వెల్ టూ...?

By:  Tupaki Desk   |   7 Nov 2022 12:30 AM GMT
ఆవేశం ప్లస్ దూకుడు ఈజ్ ఈక్వెల్ టూ...?
X
రాజకీయాల్లో ఆవేశం ఉండాలి. అది భౌతికంగా కాదు, కోట్ల మెదళ్ళను ఆలోచింపచేసేదిగా ఆవేశం ఉండాలి. చాలా మంద్ర స్వరంతో నాయకుడు మాట్లాడినా అందులోని ఆలోచనలు వినే కోట్లాదిమందిలో చైతన్యం నింపాలి. అది నాయకుడు చేయాల్సిన పని. అంతే తప్ప వీరావేశంతో రెచ్చిపోవడం కాదు. పవన్ కళ్యాణ్ జనసేనానిగా ఉన్నారు. ఆయన రాజకీయ పార్టీని పెట్టి సమాజంలో మార్పుని తేవాలనుకుంటున్నారు.

ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు వస్తే అంతవరకూ ప్రజలకే మంచిది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే మల్టిపుల్ ఆప్షన్స్. అలా ఉంటేనే అది వికసిస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఎపుడూ చంద్రబాబే సీఎం కావాలని లేదు. అలాగే జగన్ కూడా దశాబ్దాలుగా ఉంటాను అంటే కోరిక ఉండొచ్చేమో కానీ బెస్ట్ చాయిస్ ఉంటే జనాలు ఆయనకు మించి ఆలోచిస్తారు అని కూడా చూడాలి.

ఇక ప్రజాస్వామ్యంలో పవన్ జనసేనకు కూడా అవకాశం ఉంది, ఉంటుంది. ఏపీలో మూడవ ఆల్టర్నేషన్ ఏంటి ఎన్ని పార్టీలు అయినా ఆల్టర్నేషన్లుగా రావచ్చు. జనాలు మెచ్చేలా నాయకత్వాలు పనిచేయాలి. వారి మనసు గెలుచుకోవాలి. ఇక్కడ ఆవేశం అన్నది పనికి రాదు. ప్రజలలో మన గురించి ఎలా పోట్రేట్ అవుతుంది అన్నది నాయకులు గుర్తించాలి. నిజానికి రాజకీయం అంటేనే బయట మంచిగా కనిపించడం. లోపల ఏం చేశారు అన్నది ఏమో కానీ బుద్ధుడికి పెద్దన్నలా ఉంటేనే జనాలు ఇష్టపడతారు.

పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే ఆది నుంచే ఆయనకు మైనస్ పాయింట్ ఆవేశమే అని విశ్లేషిస్తారు. ఆయన ఆవేశం వల్లనే ఆ పార్టీకి ఇబ్బంది అవుతుంది అని కూడా అంటున్నారు. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకపోతే కోట్లాదిమంది ప్రజానీకం తమ నేతగా మెచ్చి అధికారాన్ని ఎలా అప్పచెబుతారు. పవన్ ఈ మధ్యనే కొద్ది రోజుల తేడాలోనే ఎన్నడూ లేని విధంగా ఫ్రస్టేషన్ కి తరచూ గురి అవుతున్నారు.

ముందుగా మంగళగిరి పార్టీ ఆఫీసు మీటింగులో చూస్తే ఒక పార్టీకి చెందిన నాయకుడు అలా చెప్పులు చూపించి అనుచిత కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. అవతల పార్టీ వారు కూడా చేశారు అంటే వారు పార్టీలను నడపడం లేదు, వారు ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే. ఆయా పార్టీల అధినాయకులు ఎపుడూ కూల్ గానే ఉంటున్నారు. బయటకు అలా కనిపిస్తున్నారు.

దీంతో ఇక్కడే పవన్ వైఖరి మీద ఒక పెద్ద చర్చ సాగింది. జనసేనకు చేదుగా అనిపించినా పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయింది కూడా ఈ పాయింట్ లోనే. ఇక దానితో పాటు ఇపుడు ఇప్పటంలో పవన్ చేసిన అతి దూకుడు రాజకీయం చర్చకు వస్తోంది. తన కారు టాప్ మీద ఆయన కూర్చుని ప్రయాణం చేయడంలో డేరింగ్ కంటే ప్రజా నాయకుడిగా ఆయన బాధ్యతనే జనాలు ప్రశ్నిస్తారు. యువతకు ఆయన వైఖరి ఎలాంటి సందేశం ఇస్తుంది అన్నదే ప్రశ్నిస్తారు.

ఇక ఇప్పటం లోపలికి వెళ్ళేందుకు పోలీసుకు అనుమతించకపోవడం వారి తప్పే. కానీ దానికి పవన్ లాంటి పార్టీ అధినేత చేయాల్సింది చేశారు. నడచుకుంటూ వెళ్లారు. ఈ సమయంలో ఆయన తన క్యాడర్ కి ఆవేశపూరితమైన పిలుపు ఇవ్వడం మీద చర్చ సాగుతోంది. అలాగే పోలీసులను ఉద్దేశించి కొట్టుకోండి, తిట్టుకోండి. చంపుకోండి అరెస్టులు చేసుకోండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఒక నాయకుడిగా అంత శోభను ఇచ్చేవి కావు. ఆయన ఆవేశాన్ని క్యాడర్ వేరే విధంగా అర్ధం చేసుకుంటేనే అసలు ప్రమాదం అన్నది గుర్తెరగాలి.

ఇదిలా ఉంటే సినిమాటిక్ గా విన్యాసాలు చేస్తే రాజకీయాల్లో ఫ్యాన్స్ కి ఆకట్టుకుంటాయి కానీ సాదర జనాలకు మాత్రం అవి ఎబ్బెట్టుగా తోస్తాయి. ఇప్పటికే పవన్ లోని ఆవేశం మీద చర్చ సాగుతోంది. ఒక విధంగా జనసేనకు ఉన్న మంచి అవకాశాలను పవన్ తన ఆవేశంతో తగ్గించుకుంటున్నారా అన్న చర్చ కూడా వస్తోంది.

పవన్ ఇప్పటం వెళ్ళి ఏం చేశారు అన్న విమర్శలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. ఆయన లాంటి స్థాయి ఉన్న నాయకుడు జనాలలోకి చాలామందిని తీసుకుని వెళ్ళకుండా అధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపి ఉంటే బాగుండేది అన్నదే అందరి మాటగా ఉంది.

అలాగే ఇప్పటం లాంటి సంఘటనలు ఏపీలో ఎన్నో జరుగుతాయి. ప్రతీ చోటకూ నాయకుడు రావడం కంటే ద్వితీయ శ్రేణి నాయకులను పంపించి ఆ మీదట తాను ప్రభుత్వంతో మాట్లాడో డిమాండ్ చేసో సమస్యకు పరిష్కారం చూపి ఉంటే హుందాగా ఉండేదని అంటున్నారు. జనసేనలో పవన్ లాటి నాయకుడు అగ్ర స్థానంలో ఉండాలి. ఆయన పార్టీని సరైన సూచనలతో నిర్దేశిస్తూ ముందుకు నడపాలి. అన్నీ తానే అయి రోడ్డు మీదకు వస్తే పలుచన అవుతారు అన్నది గ్రహించాలి.

కానీ పవన్ లో మంచి ఆలోచనలు ఉన్నా ఆయన ఆవేశం దాన్ని డామినేట్ చేస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద పవన్ కనుక తన ఆవేశాన్ని దూకుడుని అదుపులో పెట్టుకుంటే జనసేనకు మంచి రోజులు వస్తాయన్నది అందరి భావన. ఇక చూస్తే వెండి తెర కధా నాయకుడికీ. రాజకీయ నాయకుడికీ ఎంతో తేడా ఉంటుంది. అక్కడ వెంటనే ఫలితాలు వస్తాయి. అలా అన్ని కూడా ఒంటి చేత్తో హీరో చేస్తారు. కానీ వ్యవస్థలు ఎన్నో ఉన్న రియల్ లైఫ్ ఇన్స్టంట్ గా న్యాయం దక్కదు. దానికోసం ఓపికగా దశలవారీగా పోరాటం చేయాలి. అది కూడా ప్రజలు మెచ్చే తీరున సాగాలి. ఈ సమయంలో ఆవేశం తో ఏ మాత్రం తొణికినా బెణికినా జనాలు ఇచ్చే తీర్పు వేరుగా ఉంటుంది.