Begin typing your search above and press return to search.

సంక్రాంతి తరువాత అసలైన సినిమా...పవన్ మాస్టర్ ప్లాన్

By:  Tupaki Desk   |   30 Oct 2022 11:30 AM GMT
సంక్రాంతి తరువాత అసలైన సినిమా...పవన్ మాస్టర్ ప్లాన్
X
ఏపీలో ఎన్నికలు ఎపుడు జరుగుతాయి అంటే షెడ్యూల్ ప్రకారం అయితే 2024 ఏప్రిల్ లో అని చెప్పాలి. కానీ ఏపీ సీఎం జగన్ మరో సారి పక్కగా గెలవాలని చూస్తున్నారు. దానికి తగిన పరిస్థితులు ఎపుడు ఉంటే అపుడు వీలుగా ఎన్నికలను ముందుకు జరుపుకునే చాన్స్ ఉంది. దాంతో విపక్షాలు కూడా అన్నీ తెలుసుకునే తమ జాగ్రత్తలో తాము ఉన్నాయి.

ఏపీలో టీడీపీ గేర్ మార్చి స్పీడ్ పెంచింది. పవన్ కళ్యాణ్ కూడా గతానికి భిన్నంగా ఇపుడు వీలైనంత ఎక్కువ కాలం ఏపీలో గడుపుతున్నారు. పార్టీ నాయకులతో వరసబెట్టి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూనే మరో వైపు ప్రజా పోరాటాలకు కూడా సై అంటున్నారు. ఇదిలా ఉంటే జనసేనాని 2023 జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత సినిమాలకు షూటింగులకు పూర్తి స్థాయిలో గుడ్ బై కొట్టేస్తారు అని తెలుస్తోంది.

అప్పటికి సార్వత్రిక ఎన్నికలు దాదాపుగా ఏడాది వ్యవధిలోకి వచ్చేస్తాయి. దాంతో పవన్ కూడా ఏపీలోనో ఉంటూ నిత్యం జనంతో కలియతిరిగేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పవన్ బస్సు యాత్ర ఒకటి ఉంది. ఇది చాలా కీలకమైన ప్రోగ్రాం. ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాలలో తిరగాలని పవన్ ప్లాన్ వేసుకున్నారు.

పొత్తులు ఉన్నా కూడా కూటమికి ఈ బస్సు యాత్ర ఉపయోగపడుతుంది అన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. అదే టైం లో టీడీపీ నుంచి ఒక మంచి నంబర్ తోనే పొత్తులో భాగంగా సీట్లు అడగాలని పవన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఇక ఇప్పటిదాకా ఇతర పార్టీల నేతలకు నో చెప్పిన జనసేన ఇపుడు వెల్ కం అంటోందిట.

పొత్తులు ఉంటాయి అన్నది దాదాపుగా కన్ ఫర్మ్ అయిన వేళ టీడీపీ వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేన వైపు చూసే వారు కనిపిస్తున్నారు. వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఎక్కడికక్కడ పార్టీని పటిషం చేయడానికి జనసేనాని డిసైడ్ అయ్యారని టాక్.

మొత్తానికి వైసీపీ సర్కార్ మీద పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడానికి పవన్ అన్ని అస్త్ర శస్త్రాలు సమకూర్చుకుంటున్నారు అని తెలుస్తోంది. ఏపీలో రాజకీయాన్ని హీటెక్కించడం, అదే టైం లో జనసేన వైపు జనాలు ఉండేలా పొలిటికల్ సీన్ ని మార్చుకోవడం పైన పవన్ ఫోకస్ పెడతారు అని తెలుస్తోంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు పవన్ కళ్యాణ్ 2023 సంక్రాంతి తరువాత వైసీపీకి అసలైన సినిమా చూపిస్తారు అని అంటున్నారు.