Begin typing your search above and press return to search.

ఆ పార్టీల‌తో పొత్తు.. జ‌న‌సేన‌కు ఒరిగేదేంటి..?

By:  Tupaki Desk   |   31 Oct 2022 12:30 AM GMT
ఆ పార్టీల‌తో పొత్తు.. జ‌న‌సేన‌కు ఒరిగేదేంటి..?
X
రాజ‌కీయాల్లో ఎవ‌రు ఔన‌న్నా.. ఎవ‌రు కాద‌న్నా.. ఖ‌చ్చితంగా నేత‌లు కానీ, పార్టీలు కానీ.. త‌మ త‌మ లాభాలు చూసుకునే ముందుకు అడుగులు వేస్తుం టాయి. ఇక‌, ఒక పార్టీ మ‌రొక పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం ఉండాలి. ఈ విష‌యంలో ఎవ‌రూ ఎలాంటి రాజీ ప‌డే ప్ర‌శ్నే త‌లెత్త‌దు. ఇప్పుడు ఏపీలోనూ పొత్తులు పెట్టుకుంటున్న జ‌న‌సేన‌కు వ‌చ్చే లాభం ఏంటి? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. 2014లో జ‌న‌సేన టీడీపీకి, బీజేపీకి మ‌ద్ద‌తి చ్చింది. ఆ రెండు పార్టీలు కూడా గెలిచాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే బీజేపీకి ల‌బ్ధి చేకూరింది.

బీజేపీకి చెందిన ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు మంత్రి పద‌వులు ఇచ్చారు. త‌ద్వారా వాడిపోతున్న క‌మ‌లం మెరిసేలాంటి ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి 2014లో ఈ రెండు పార్టీల‌కు మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌న్‌.. పోటీకి దూరంగా ఉన్నప్ప‌టికీ త‌న మ‌ద్ద‌తుతోనే ఏర్ప‌డిన ప్ర‌భుత్వం కాబ‌ట్టి తానేమైనా సాధించుకున్నాడా? అనేది ప్ర‌శ్న‌. పోనీ..తాని నిస్వార్థంగానే ప్ర‌జ‌ల కోసం ప‌నిచేశాడ‌ని, ఆయాపార్టీలు అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించాడ‌నే అనుకుందాం. కానీ, వ్య‌క్తిగ‌తంగా చూసుకుంటే..కాపుల ఓట్ల‌న్నీ ప‌వ‌న్‌ను చూసే ప‌డ్డాయి. మ‌రి వారికి ఏమైనా చేశారా? అంటే చేయ‌లేదు.

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపుల రిజ‌ర్వేష‌న్ కోసం ప్ర‌య‌త్నించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న కూడా ప‌వ‌న్ దీనిపై ప‌ట్టించుకునిప్ర‌భుత్వంతో చ‌ర్చించి న్యాయం చేయాల‌ని కోరారు. కానీ, ప‌వ‌న్ ఆ స‌మ‌యంలో త‌న‌కు క‌ులం లేదు.. మ‌తం లేదు.. న‌న్ను ఒక కులానికి చెందిన నాయ‌కుడిగా ఎందుకు చూస్తారంటూ ప్ర‌శ్నించారు. దీంతో కాపుల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. రిజ‌ర్వేషన్ ద‌క్క‌లేదు. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు గుండుగుత్తుగా కాపుల‌కు ఇచ్చేసినా అది చ‌ట్ట‌బ‌ద్ధం కాకుండా పోయింది.

ఇక, ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్న ప‌వ‌న్‌.. దీనివ‌ల్ల సాధించింది ఏంటి? అనేది ప్ర‌శ్న‌. నిజానికి పొత్తులో ఉన్నందున త‌నైనా అబివృద్ధి చెందాలి లేదా.. ఆ పొత్తు ద్వారా రాష్ట్రానికి అయినా మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. సో.. ఇవ‌న్నీ లేకుండా పొత్తు పెట్టుకుంటే.. ప్ర‌యోజ‌నం ఏంటి? ఇప్పుడు ఇదే చ‌ర్చ గ్రామీణ స్థాయిలో వైసీపీ నాయ‌కులు వినిపిస్తున్నారు. ఇవ‌న్నీ.. కేవ‌లం జ‌గ‌న్‌ను ఓడించేందుకు చేస్తున్న మాయా పొత్తులుగా వారు అభివ‌ర్ణిస్తున్నారు. ఈ పొత్తుల‌తో ప్ర‌యోజ‌నం ఏంట‌ని కూడా ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు. మ‌రి దీనినుంచి ప‌వ‌న్ బ‌య‌ట‌పడి.. క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది.