Begin typing your search above and press return to search.

ఢిల్లీ పెద్దల ఆహ్వానాన్ని తిర‌స్క‌రించిన ప‌వ‌న్‌... బీజేపీతో క‌టీఫేనా?

By:  Tupaki Desk   |   23 Oct 2022 4:32 PM GMT
ఢిల్లీ పెద్దల ఆహ్వానాన్ని తిర‌స్క‌రించిన ప‌వ‌న్‌... బీజేపీతో క‌టీఫేనా?
X
``బీజేపీ పెద్ద‌ల‌ను గౌర‌విస్తాను. ప్ర‌ధాని మోడీ అంటే గౌర‌వం ఉంది. కానీ, ఊడిగం మాత్రం చేయ‌ను!`` అని వ్యాఖ్యానించిన జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అనుకున్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రి స్తున్నారా? బీజేపీ పెద్ద‌లు త‌న‌ను అవ‌మానిస్తున్నార‌ని.. రాష్ట్ర నేత‌లు అస‌లు త‌న‌ను తృణీక‌రిస్తున్నార‌ని .. భావిస్తున్నారా? అందుకే ఆయ‌న బీజేపీకి డిస్టెన్స్ మెయింటెన్ చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీని వ‌దులుకునేందుకే... ప‌వ‌న్ మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది.

వాస్త‌వానికి 2019-20 మ‌ధ్య‌కాలంలో.. ప‌వ‌న్ స్వ‌యంగా.. బీజేపీ పెద్ద‌ల వ‌ద్ద‌కు వెళ్లి చేతులు క‌లిపారు. మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేద్దాం.. మ‌ని సంక‌ల్పం చెప్పుకొన్నారు. దీనికి బీజేపీ పెద్ద‌లు కూడా.. సంతోషంగా ఆహ్వానించారు. ఈ ప‌రిణామాల‌తోనే.. ఏపీలో జన‌సేన‌-బీజేపీ క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించారు. కానీ, ఆ త‌ర్వాత‌.. రాష్ట్ర బీజేపీ నేత‌లు..ప‌వ‌న్‌ను దూరం పెట్టారు. ఏ కార్య‌క్ర‌మానికీ పిల‌వ‌డం లేదు. పైగా..తిరుప‌తి పార్ల‌మెంటుకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో తన పార్టీ పోటీచేస్తుంద‌ని.. చెప్పినా..ప‌వ‌న్‌ను కాద‌ని.. ముందుగానే రాష్ట్ర బీజేపీ నేత‌లు కేంద్రంలో లాబీయింగ్ చేసుకున్నారు.

దీంతో ఇక్క‌డ బీజేపీనే పోటీ చేసింది. అయినా.. మ‌న‌సు చంపుకుని..ప‌వ‌న్ ఆపార్టీకి మ‌ద్ద‌తిచ్చారు. త‌ర్వాత‌.. బ‌ద్వేల్ ఉప పోరు వ‌చ్చింది. దీనిని వ‌దిలేద్దాం.. పోరాడినా.. ఓడిపొవ‌డం త‌ప్ప‌.. ప్ర‌యోజ‌నం లేద‌ని..ప‌వ‌న్ చెప్పారు. `కాదు.. నువ్వు లేక‌పోయినా.. మేం పోటీకి దిగుతాం`.. అంటూ.. రాష్ట్ర నేత‌లు బ‌రిలో నిలిచారు. ఇక‌, అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం, విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని రామ‌తీర్థం ఘ‌ట‌న‌.. వంటివాటి విష‌యంలో క‌నీసం.. ప‌వ‌న్‌ను సంప్ర‌దించ‌కుండానే.. ఉద్య‌మాలు చేసి.. ఆ ల‌బ్ధిని త‌మ ఖాతాల్లోకి వేసుకునేందుకు బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నించారు.

ఇలా.. అడుగ‌డుగునా..ప‌వ‌న్‌ను అవ‌మానించేలా చేశారు. అయినా..ప‌వ‌న్ స‌ర్దుకు పోయారు. కానీ, ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రోడ్ మ్యాప్ అడిగారు. దీనిపై కేంద్రం పెద్ద‌లు ఏమ‌నుకున్నారో..ఏమో.. ఇప్ప‌టికీ.. ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో విసిగిపోయిన ప‌వ‌న్ ఇటీవ‌ల చంద్ర‌బాబుతో చేతులు క‌లిపారు. దీంతో బీజేపీలోని ప‌వ‌న్ వ్య‌తిరేక వ‌ర్గం..ఆయ‌న‌ను అసమర్థ రాజకీయ నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో పాటు పెళ్లిళ్ల గురించి కూడా కించపరచడం మొదలుపెట్టింది.

ఇంత జ‌రుగుతున్నా బీజేపీ పెద్ద‌లు మౌనంగా ఉన్నారు. కాగా దీనిపై జన సైనికులు ఫైర్ అవుతున్నారు. 2014 ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా బేషరతుగా పార్టీకి ప‌వ‌న్ మద్దతిచ్చారు. ఆయ‌న‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌బ‌బు కాదు ”అని వారు అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ హైకమాండ్ ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బీజేపీ అనుస‌రిస్తున్న విధానాల‌తో విసుగు చెందిన జనసేనాని వెళ్లేందుకు నిరాకరించార‌ని తెలుస్తోంది. ఇక‌, బీజేపీకి ప‌వ‌న్ దూర‌మైన‌ట్టేన‌నే సంకేతాలు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.