Begin typing your search above and press return to search.

టార్గెట్ 100.. జ‌న‌సేన అదిరిపోయే వ్యూహం!

By:  Tupaki Desk   |   10 Oct 2022 1:30 AM GMT
టార్గెట్ 100.. జ‌న‌సేన అదిరిపోయే వ్యూహం!
X
ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు అనుస‌రించిన వ్యూహాల‌కు భిన్నంగా.. దూకుడుగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం జనసేనకు చాలా టైమ్‌ దొరికింది. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనుకుని ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్నా.. ఆ త‌ర‌హా సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. దీంతో జనసేనాని రూటు మారుస్తున్న‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ సీట్ల‌ను కొల్ల‌గొట్టే వ్యూహంతో ఆయ‌న ముందుకు సాగాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారట. వైసీపీ ముందస్తుకు వెళ్లదని సంకేతాలు రావడంతో.. జనసేనకు కావాల్సినంత టైమ్‌ దొరికిందని ఆ పార్టీలో ఉన్న నాయ‌కులు చెబుతున్నారు. ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా.. గ్రౌండ్‌ లెవెల్‌ నుంచి పార్టీని స్ట్రాంగ్‌ చేసుకోవాలని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు జనసేన టార్గెట్ 100 అసెంబ్లీ స్థానాలుగా నిర్ణ‌యించుకున్నార‌ని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వీటిని కైవసం చేసుకోవడానికి..పవన్ ప్రణాళిక రచిస్తున్నారట.. ఇప్పటికే జనసేనకు బలం పెరిగిందని.. సర్వేలు చెబుతుండటంతో.. మరింత కష్టపడితే..ఇంకా మంచి ఫలితాలు సాధించొ చ్చని పవన్‌ భావిస్తున్నారట. అందుకే పార్టీలో మార్పులు, చేర్పులు చేస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్రస్థాయి నుంచి వార్డు స్థాయి వరకు కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు.

ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల‌కు కూడా కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షుల నియామకం జరగనుంది. వచ్చే 5 రోజుల్లో నియోజకవర్గాల సమీక్షలపై షెడ్యూల్ త‌యారు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వాలంటీర్స్‌కు ఆహ్వానం పంపారు. అటు జనసేన కౌలురైతు భరోసా యాత్రలను కూడా కంటిన్యూ చేస్తూ.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై మ‌రింత దృష్టి పెడ‌తార‌ని తెలుస్తోంది. ఈ నెలలోనే చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న కూడా ప్లాన్‌ చేశార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ దూకుడు.. ఏమేర‌కు పార్టీలో మార్పు తెస్తుందో.. పార్టీ ఎలా పుంజుకుంటుందో చూడాలి.