Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ మ‌న‌సు ఈ నియోజ‌క‌వ‌ర్గంపైనేనా?

By:  Tupaki Desk   |   9 Oct 2022 11:30 AM GMT
ప‌వ‌న్ మ‌న‌సు ఈ నియోజ‌క‌వ‌ర్గంపైనేనా?
X
గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని గాజువాక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రంల్లో పోటీ చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ రెండు స్థానాల్లోనూ ఆయ‌న రెండో స్థానంలో నిలిచారు. ఈ రెండు చోట్లా వైసీపీ అభ్య‌ర్థులు తిప్ప‌ల నాగిరెడ్డి (గాజువాక‌), గ్రంథి శ్రీనివాస్ (భీమ‌వ‌రం) గెలిచిన సంగ‌తి తెలిసిందే.

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న దృష్టి విశాఖ‌ప‌ట్నంపైనే ఉంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ పార్ల‌మెంటు సీటును అతి తక్కువ మెజారిటీతో వైసీపీ గెలుచుకుంది. అయితే విశాఖప‌ట్నం న‌గ‌రంలో ఉన్న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ ఓట‌మి పాలైంది. విశాఖ తూర్పు, విశాఖ ఉత్త‌రం, విశాఖ ద‌క్షిణం, విశాఖ ప‌శ్చిమ ఇలా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు రెండో స్థానంలో నిల‌వ‌గా జ‌న‌సేన అభ్య‌ర్థులు మూడో స్థానంలో నిలిచారు.

కాగా జ‌న‌సేనాని జ‌న‌సేన పార్టీ కౌలు రైతు భ‌రోసా యాత్ర‌ను గ‌త కొంత‌కాలంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్లోని ప‌లు జిల్లాల్లో పంట‌లు పండ‌క‌, గిట్టుబాటు ధ‌ర‌లు ల‌భించ‌క అప్పుల‌పాలై ఆత్మ‌హ‌త్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌కు ప‌వ‌న్ ల‌క్ష రూపాయ‌ల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ప‌శ్చిమ గోదావ‌రి, కోన‌సీమ, క‌ర్నూలు, వైఎస్సార్‌, అనంత‌పురం, ప్ర‌కాశం జిల్లాల్లో ఇప్ప‌టికే కౌలు రైతు భ‌రోసా యాత్ర పూర్త‌యింది.

ఈ నేప‌థ్యంలో ఈసారి జ‌న‌సేన పార్టీ కౌలు రైతు భ‌రోసా యాత్ర‌ను విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హిస్తార‌ని స‌మాచారం. అందులోనూ విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాలంటూ కొన్నింటిపైన చ‌ర్చ జ‌రుగుతోంది. వీటిలో తిరుప‌తి, పిఠాపురం, అవ‌నిగ‌డ్డ‌, భీమ‌వ‌రం వంటివి ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం కూడా చేరింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో బీసీల జ‌నాభా ఎక్కువ‌. గ‌త మూడు ప‌ర్యాలు అంటే 2009, 2014, 2019ల్లో టీడీపీ అభ్య‌ర్థి వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు.

అయితే విశాఖ‌ప‌ట్నంలో కాపు సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు, మెగాభిమానులు ఎక్కువ‌. 2009లో విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప్ర‌జారాజ్యం పార్టీ మెరుగైన స్థానాలు సాధించింది. ఇక్క‌డ నుంచి న‌లుగురు ఎమ్మెల్యేలు పీఆర్పీ త‌ర‌ఫున‌ విజ‌యం సాధించారు. అంతేకాకుండా మ‌రికొన్ని స్థానాల‌ను చాలా త‌క్కువ మెజారిటీతో పోగొట్టుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన సీట్లు సాధించ‌లేక‌పోయినా గ‌ణ‌నీయంగానే ఓట్ల‌ను కొల్ల‌గొట్టింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ తూర్పు నుంచి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.