Begin typing your search above and press return to search.

జనసేన జపం : పవన్ ఇటు వైపు చూడు

By:  Tupaki Desk   |   25 Sep 2022 11:42 PM GMT
జనసేన జపం :  పవన్ ఇటు వైపు చూడు
X
ఏపీలో పొత్తులు అన్నవి ఎవరికి ఎవరితో ఉంటాయో ఈ రోజు దాకా తెలియదు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో చీల్చనివ్వను అని శపధం పట్టారు. ఆయన ఉద్దేశ్యంలో బీజేపీ జనసేన టీడీపీ కలవాలని ఉంది అని ప్రచారం సాగుతోంది. అయితే బీజేపీ మాత్రం ఈ రోజుకీ తేల్చడం లేదు, ఆయన అడిగిన రోడ్ మ్యాప్ అయితే అసలు ఇవ్వడంలేదు.

దాంతో పవన్ బీజేపీ పేరుని తన పార్టీ సభలలో సమవేశాలలో చెప్పడం మానేశారు. అంతే కాదు బీజేపీ పెద్దలతో కేంద్ర పెద్దలతో సమావేశాలకు పిలుపు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉన్నారు. అయితే బీజేపీ వారు మాత్రం తాము కోరుకున్నదే జరగాలని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ పవన్ తమతోనే అంటూ ఇస్తున్న పొలిటికల్ స్టేట్మెంట్స్ మాత్రం కొంత చిత్రంగా ఉన్నాయి.

బీజేపీ నేతలు ఏపీలో అంతటా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ డియోధర్ నుంచి కీలక నేతలు అంతా వచ్చారు. వారంతా ఒక్కటే మాట చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాబోతున్నామని. ఏపీలో రెండు కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీలను మట్టి కరిపిస్తామని చెబుతున్నారు.

ఏపీలో 2024 ఎన్నికల్లో వచ్చేది బీజేపీ జనసేన కాంబినేషన్ లోని సర్కార్ అని కూడా బల్లగుద్దుతున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీ టూర్ లో ఉన్న సునీల్ డియోధర్ అయితే జనసేనతో కలసి మాత్రమే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తమ రెండు పార్టీలే ప్రభుత్వంలోకి వస్తాయని కూడా జోస్యం చెప్పారు.

ఇదే విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ కూడా గట్టిగా చెబుతున్నారు. తాము ఏపీలో జనసేనతోనే రాజకీయ పొత్తుని పెట్టుకున్నామని అంటున్నారు. ఇక రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అయితే జనసేనతో కలసే ఎన్నికలను ఎదుర్కొంటామని అంటున్నారు. బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు సరేసరి తన ప్రసంగం మొత్తంలో ఎక్కడో ఒక చోట జనసేన ప్రస్థావన తెస్తారు.

మరి ఇంతలా బీజేపీ జనసేన జపం చేస్తున్నా కూడా పవన్ మాత్రం పట్టించుకుంటున్నారా అంటే డౌటే అంటున్నారు. పవన్ తమ పార్టీకి సంబంధించి తాను చేయాల్సింది చేసుకుంటున్నారు. మరి పవన్ తో కలసి ఒక్క మీటింగ్ ఏపీలో పెట్టలేదు. బీజేపీ వారి సమావేశాల్లో జనసైనికులు ఎక్కడా కనిపించరు. అలాగే బీజేపీ అన్న మాట పవన్ నోట ఈ మధ్య రావడంలేదు. మరి బీజేపీ వారు చెబుతున్నా ఈ పొలిటికల్ కాంబినేషన్ని జనాలు ఎలా నమ్మాలి. ఎలా నమ్ముతారు అని కాషాయం అనుకుంటోంది అన్నదే తమషాగా ఉంది.

ఏది ఏమైనా పవన్ తాము చెబుతున్న పొత్తు మాటలకు నో అనడంలేదు కదా అన్న ఆలోచనతోనే బీజేపీ ఇలా మాటలతో దూకుడు చేస్తోంది అని అంటున్నారు. పవన్ విషయం తీసుకుంటే ఇప్పటి నుంచే ఎందుకు తెంచేసుకోవడం అని భావిస్తున్నారు అని అంటున్నారు. ఎన్నికల ముందు పొత్తుల విషయం తేలితే అపుడు కచ్చితంగా బీజేపీ విషయంలో ఒక స్టాండ్ తీసుకుంటారు అని అంటున్నారు. అంతవరకూ నేనూ మా ఆవిడ అన్నట్లుగా మేమూ జనసేన అని బీజేపీ వారు ప్రతీ చోటా అదే పాటగా ప్రచారం చేసుకుంటూ పోతారన్న మాట.