Begin typing your search above and press return to search.

టీడీపీకి దెబ్బేస్తున్న పవన్...?

By:  Tupaki Desk   |   26 Sep 2022 2:30 AM GMT
టీడీపీకి దెబ్బేస్తున్న పవన్...?
X
ఏపీలో రాజకీయం మెల్లగా మారుతోంది. పొలిటికల్ పోలరైజేషన్ దిశగా అడుగులు అయితే పడుతున్నాయి. కానీ అది ఈ రోజుకు అంత సులువు కాకపోయినా రాజకీయాల్లో ఏదీ ఆసాధ్యం మాత్రం కాదు కాబట్టి ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఏపీలో చూస్తే అధికార వైసీపీ తన పవర్ ని చూపిస్తోంది. ఎటూ అధికారం ఉంది కాబట్టి బలంగానే కనిపిస్తోంది. మరి ఎన్నికల వేళకు సీన్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పటి నుంచే అయితే ఎవరూ అంచనా కట్టలేరు.

ఇక విపక్షంలో చూస్తే తెలుగుదేశం పార్టీ ఉంది. మూడేళ్ళు పై దాటినా ఆ పార్టీ గ్రాఫ్ అయితే పెద్దగా పెరిగిన దాఖలాలు లేవు ఎందుకో తెలియదు కానీ టీడీపీ లో లీడర్లు, క్యాడర్ కూడా స్తబ్దుగా మారిపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్ ఇపుడు ఆ పార్టీకి మైనస్ గా మారుతోందా అంటే ఆలాగే కూడా విశ్లేషణలు ఉన్నాయి.

చంద్రబాబు ఎంతసేపూ రొటీన్ స్పీచులు చేస్తూ వస్తున్నారు. అదే టైం లో టీడీపీ విషయంలో కొత్తదనం కూడా ఏమీ కనిపించడంలేదు. భావి వారసుడు లోకేష్ అందుకుంటాడంటే అది ఈ ఎన్నికల్లో సాధ్యపడుతుందా అన్నది కూడా ఆలోచించాల్సిందే అంటున్నారు. మరో వైపు చూస్తే మొత్తం ఏపీవ్యాప్తంగా టీడీపీకి హైప్ అయితే ఇచ్చే ఏ ఇష్యూని టేకప్ చేయలేదు అని అంటున్నారు.

అమరావతి రాజధాని చుట్టూ టీడీపీ రాజకీయం పరిమితం అవుతోంది అన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్రా రాయలసీమలో గతం కంటే పరిస్థితిని మెరుగుపర్చుకోవాల్సిన చోట కూడా చేయాల్సిన రిపేర్లు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే గోదావరి జిల్లాల్లో జనసేన అనూహ్యంగా పెరుగుతోంది. కొన్ని సీట్లలో అధికార వైసీపీతో నువ్వా నేనా అన్నట్లుగా జనసేన పొజిషన్ ఉందని అంటున్నారు.

ఇక్కడ చాలా చోట్ల టీడీపీ పుంజుకోవడంలేదు అన్న సర్వేలు కూడా ఉన్నాయి. అదే విధంగా గుంటూరు, క్రిష్ణా జిల్లాలలో కూడా గతంలో దక్కిన ఆదరణ ఇపుడు టీడీపీకు ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా జనసేన తన బలాన్ని బాగా పెంచుకుంటోంది. రాయలసీమలో గతంలో జనసేన పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. కానీ ఈసారి అక్కడ తన ప్రభావాన్ని ఎంతో కొంత చూపుతుంది అని అంటున్నారు.

ఉత్తరాంధ్రాలోకి వస్తే విశాఖ జిల్లాలో చాలా చోట్ల జనసేన బాగా పటిష్టం అయింది విశాఖ సిటీలోనే నాలుగు సీట్లలో ఆ పార్టీ ప్రభావం గణనీయంగా ఉంది. రూరల్ లో చూస్తే మూడు సీట్లలో గట్టిగా కనిపిస్తోంది. విజయనగరంలో రెండు సీట్లలో, శ్రీకాకుళంలో మరో రెండు సీట్లలో జనసేన తన బలాన్ని పెంచుకుంది అని సర్వే నివేదికలు తెలియచేస్తున్నాయి.

చిత్రమేంటి అంటే ఈ సీట్లు అన్నీ కూడా గతంలో టీడీపీకి కంచు కోటలు. అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంటే టీడీపీ వైపు చూసే ఈ సీట్లలో ఇపుడు జనసేన పాగా వేయడం ఆసక్తికరమైన అంశమే. దానికి కారణం టీడీపీలో వర్గ విభేదాలు, స్తబ్దత అని అంటున్నారు. జనసేన లోకల్ లీడర్ షిప్ తమను తాము ప్రూవ్ చేసుకుంటూ ఇలాంటి సీట్లలో ముందుకు సాగుతున్నారు.

ఇప్పటికి ఇలా ఉన్న ఏపీ రాజకీయ ముఖ చిత్రం పవన్ కళ్యాణ్ కనుక బస్సు యాత్ర చేపడితే పూర్తిగా మారుతుంది అని అంటున్నారు. రాజకీయాలకు జనసేన కొత్త కావడం, పవన్ ఇచ్చే హామీలు ఎలా ఉంటాయి. ఆయనను కూడా ఒకసారి చూడాలన్న ఆసక్తిని కనుక పవన్ బస్సు యాత్ర కనుక పెంపొందిస్తే ఏపీలో రాజకీయం సమీకరణలు మొత్తం మారుతాయని అంటున్నారు.

ఏది ఏమైనా 2019 ఎన్నికల్లో కేవలం ఆరు శాతం మాత్రమే ఓట్లు తెచ్చుకున్న జనసేన అంతకంతకు తన బలాన్ని చాలా కీలకస్థానాలలో పెంచుకుంటూ టీడీపీ ఓట్లకే ఎక్కువగా దెబ్బ తీయడం మాత్రం అనూహ్య పరిణామమే అని చెప్పాలి. ఇదే జోరు సాగితే రాజున్న రోజుల్లో ఏపీలో త్రిముఖ పోరుకు రంగం సిద్ధం అయినట్లే అంటున్నారు. అదే విధంగా పవన్ బస్సు యాత్ర తరువాత వైసీపీ ఓటు బ్యాంక్ ని కూడా చిల్లులు పెట్టే ప్రయత్నం జనసేన నుంచి మొదలవుతుంది అంటున్నారు.