Begin typing your search above and press return to search.

పవన్ ఆప్షన్లు మూడు కాస్తా రెండు.... తెలివి అంటే బాబుదే ?

By:  Tupaki Desk   |   28 Aug 2022 9:04 AM GMT
పవన్ ఆప్షన్లు మూడు కాస్తా రెండు.... తెలివి అంటే బాబుదే ?
X
తెలివి అంటే చంద్రబాబుదే అని ఊరకే అంటారా. ఆయన రాజకీయ చాణక్యుడు. ఆయన వ్యూహాలు కూడా అలాగే ఉంటాయి. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా పోటీ చేయరాదు అని 2019లో వచ్చిన దారుణ ఫలితాలను చూసిన తరువాత బాబు గట్టి నిర్ణయమే తీసుకున్నారు. అయితే దాన్ని అమలులో పెట్టడానికి ఆయన ఒక వ్యూహాన్నే అనుసరించారు. అందుకోసం ఆయన చేశారని చెబుతున్నవి కొన్ని ఉన్నాయి. ఫలితాలు వచ్చిన తరువాత తన ఎంపీలను బీజేపీలోకి కావాలనే పంపించారని, ఆ తరువాత తన మిత్రుడు అనదగిన పవన్ కళ్యాణ్ తో బీజేపీ దోస్తీకి ఆయన సలహాసూచనలే కారణం అని కూడా ప్రచారంలో ఉంటూ వచ్చిన మాటగా చెబుతారు.

దీని వల్ల చంద్రబాబు బీజేపీని తనతో పొత్తుల కోసం తిరిగి రప్పించుకోవాలనుకున్నారు. అయితే పవన్ బీజేపీ మిత్ర బంధం అంత సాఫీగా సాగినట్లుగా కనిపించలేదు అంటారు. పేరుకు మాత్రమే అన్నట్లుగానే ఉంది అని చెబుతారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయాన్ని అతిగా ఊహించుకుని మొత్తం కూటమికే పెద్దన్న కావాలని అనుకున్నారని చెబుతారు. అందుకే ఆయన జనసేన ఆవిర్భావ సభలో అన్ని పార్టీలు తగ్గాలి. వైసీపీ వ్యతిరేక కూటమికి సహకరించాలని ఒక పిలుపు ఇచ్చారు.

అంటే తన నాయకత్వాన అటు తెలుగుదేశం ఇటు బీజేపీ చెరో వైపున చేరి కూటమి కడితే తాను పెద్దన్న కావచ్చు అని ఆయన బహుశా భావించి ఉంటారు. ఆ తరువాత కూడా ఆయన తెలుగుదేశంతో పొత్తు మీద కొన్ని కామెంట్స్ చేశారు. అధికార వాటా కోసం కూడా జనసేన నాయకులు మాట్లాడారు. మొత్తానికి ఏదైతేనేమి జనసేనతో నేరుగా పొత్తు అన్నది వల్ల కాదేమో అన్న భావన అయితే టీడీపీకి కల్పించారు అని ఒక విశ్లేషణ ఉంది.

ఈలోగా చంద్రబాబు రెండవ వైపు నుంచి పావులు కదిపారు. దానికి బీజేపీ రాజకీయం కూడా సహకరించింది. ఇక బీజేపీ సైతం మిత్రుడిగా ఉంటూ పవన్ టీడీపీ వైపుగా ఉన్నట్లుగా అనిపించడం కూడా ఆ పార్టీకి ఇబ్బందిగా మారిందని చెబుతారు. దాంతో పాటు జనసేన బీజేపీ కూటమికి పవన్ సీఎం అని ప్రకటించాలని జనసైనికులు చేసిన డిమాండ్లు కూడా కమలం పార్టీకి నచ్చినట్లుగా లేదు. దాంతో వారు కూడా పవన్ని పక్కన పెట్టి బాబుతో డైరెక్ట్ గానే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ ఊహించారో లేదో తెలియదు కానీ మోడీ చంద్రబాబు షేక్ హ్యాండ్లు ఇచ్చేసుకున్నారు. ఇక తొందరలో రెండు పార్టీలు కూడా కలవబోతున్నాయి. ఈ పరిణామాలతోనే పవన్ కొంత కలత చెందారని అంటున్నారు. అందుకే ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తాను నరేంద్ర మోడీ చెబితేనే టీడీపీకి 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చానని చెప్పుకొచ్చారు. టీడీపీ మీద తనకు ప్రత్యేకమైన ప్రేమలు ఏవీ లేవని అలా ఆయన చెప్పారన్నమాట.

సరే పవన్ కామెంట్స్ ఎలా ఉన్నా ఇపుడు ఏపీలో కాగల పొత్తుల కార్యం అలా సాగిపోతోంది. అటు బీజేపీ ఇటు టీడీపీ రెండూ కలవాలనుకుంటున్నాయి. ఇక్కడ బాబు ఏపీకి తదుపరి సీఎం అయినా బీజేపీకి ఓకే. అక్కడ మోడీని మూడవసారి ప్రధాని చేయడానికి టీడీపీ కూడా రెడీగా ఉంది. ఈ కొత్త పొత్తు వల్ల వైసీపీకి చేదు కషాయం తాగిద్దామన్న అజెండా ఉన్నా మధ్యలో మిత్రుడు పవన్ కూడా పొలిటికల్ గా ఇబ్బంది పడతారా అన్న చర్చ ఒకటి బయల్దేరింది.

తనకు మూడు ఆప్షన్లు అని చెబుతూ వచ్చిన పవన్ కి ఇపుడు ముందు రెండే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ఒకటి టీడీపీ బీజేపీ కూటమితో తానుగా ముందుకు వచ్చి పోటీ చేయడం. లేకపోతే ఒంటరిగా పోటీ చేయడం. అంటే పవన్ ముందున్న మూడు ఆప్షన్లు రెండుగా చేయడంతో బాబు మార్క్ పాలిటిక్స్ సక్సెస్ అయింది అంటున్నారు. ఇక్కడ పవన్ తానుగా వస్తే సీట్లు ఎన్నో ఆయన అడగలేరు. ఇచ్చినవి తీసుకోవడమే.

అంటే డిమాండ్ చేసే స్థితి నుంచి జనసేనను తగ్గించి ఆయనే కూటమిలో చేరే అనివార్యతను కల్పిస్తున్నారన్న మాట. దటీజ్ బాబు అంటున్నారు. ఎటూ జగన్ మళ్ళీ సీఎం కాకూడదు అని పంతం పట్టిన పవన్ కచ్చితంగా టీడీపీ బీజేపీ కూటమిలో చేరక తప్పదనే అంటున్నారు. అదే కనుక జరిగితే ఎన్నో కొన్ని సీట్లు మాత్రమే పొత్తులో భాగంగా జనసేనకు వస్తాయి. ఇక సీఎం ఎవరు అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు, నాలుగవ సారి బాబు సీఎం కావడానికి ఎటూ బీజేపీ పల్లకి మోస్తున్న వేళ జనసేన కూడా మరోవైపు మోయాల్సిందేనా అంటే ఏపీ రాజకీయం చూస్తే అలాగే ఉంది అంటున్నారు.