Begin typing your search above and press return to search.

విలీనం చేయించిన కోవర్టులు వారేనట...?

By:  Tupaki Desk   |   21 Aug 2022 3:46 PM GMT
విలీనం చేయించిన కోవర్టులు వారేనట...?
X
జనసేన అధినేతకు తన సొంత పార్టీ కంటే విలీనం అయి ప్రకృతిలో ఏనాడో కలిసిపోయిన ప్రజారాజ్యమే ఎక్కువగా గుర్తుకు వస్తోంది. ఆయన పదే పదే ప్రజా రాజ్యం గురించే ఎపుడూ చెబుతూ ఉంటారు. ప్రజారాజ్యం ఉంటే ఈ పాటికి ఏపీలో బలమైన ఫోర్స్ గా ఉండేది కదా అని పవన్ అంటున్నారు. నిజమే కానీ ఆ పార్టీ విలీనం అయిపోయింది. దాన్ని విలీనం చేసిన వారు ఆయన అన్న గారు అయిన చిరంజీవి. మరి ఆ పార్టీలో ఉన్న వారు చెబితే చెప్పవచ్చు. తప్పో ఒప్పో సలహాలు ఇచ్చి ఉండవచ్చు. కానీ దానిని నమ్మి విలీనం చేసారు అనడం ఎంత వరకూ సబబు అన్న చర్చ కూడా వస్తోంది.

ఇదిలా ఉంటే పీయార్పీని విలీనం చేయించి చిరంజీవి చేత రాజకీయాన్ని ముగింపచేసి తాము మాత్రం తమదైన రాజకీయాన్ని కొనసాగిస్తున్న వైసీపీ కోవర్టులు వారే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఆయన కడపలో తిరిగినపుడు అదే మాట చెప్పారు. ఇక తిరుపతిలో జనవాణిలో కూడా ఆయన ఆ మాటలనే మళ్ళీ చెప్పుకొచ్చారు. పవన్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే పీయార్పీతో పుట్టి దాని ద్వారానే రాజకీయం మొదలెట్టి పదవులు పొందిన వారు ఇపుడు వైసీపీలో ఎవరు ఉన్నారు అని ఆరా తీస్తే ముగ్గురు కీలక నేతలు ఉన్నారని చెప్పాలి.

పీయార్పీ మాజీలు చాలా మంది చేరవచ్చు కానీ మంత్రి పదవులు పొందిన వారు నిన్నటి దాకా అధికార దర్జాను అనుభవించిన వారు ముగ్గురు ఉన్నారు. వారే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, మరో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, అదే విధంగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ ముగ్గురినీ జగన్ ఆదరించి మంత్రులుగా చేశారు. అయితే ఈ ముగ్గురూ చిరంజీవికి సన్నిహితులే కావచ్చు.

కానీ అందరిలాగానే ఆ పార్టీ మూత పడ్డాక తమ రాజకీయం తాము చూసుకున్నారు. అవంతి టీడీపీలో చేరి అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యారు. 2019 నాటికి వైసీపీలో చేరి మంత్రి అయ్యారు. ఇక కురసాల కన్నబాబు కూడా 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. 2019లో మాత్రం గెలిచి మంత్రి అయ్యారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే 2009లో ప్రజారాజ్యం ఉంచి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి ఓడారు. 2019లో గెలిచి మంత్రి అయ్యారు.

మరి వారు తమ రాజకీయ భవిష్యత్తు తాము చూసుకుంటే పవన్ కి ఎందుకు కోపం అన్న ప్రశ్న ఇక్కడ వస్తోంది. అయితే వీరంతా పెద్ద నోరు వేసుకుని మంత్రులుగా ఉన్నపుడు పవన్ మీద విమర్శలు చేశారు. అదొక కారణం అయితే తాను జనసేన పెట్టాక తిరిగి తన వద్దకు రాకుండా 2019 ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి తన పార్టీని బలోపేతం చేయకుండా జగన్ పార్టీలో చేరి అక్కడ గెలిచి తన మీద విమర్శలు చేస్తారా అన్న కోపం అయితే పవన్ కి ఉంది అంటున్నారు. అయితే పవన్ కోపాలు తాపాలు అన్నీ అర్ధం లేనివని వైసీపీ వారు అంటున్నారు.

రాజకీయాల్లో ఎక్కడైనా ఇదే జరిగేది అని కూడా అంటున్నారు. రేపటి రోజున జనసేన బలంగా మారితే వీరే ఇటు నుంచి అటు వస్తారని కూడా అంటున్నారు. జనసేనను అభివృద్ధి చేసుకోకుండా ఇలా కోవర్టులు అంటూ కొందరిని టార్గెట్ చేయడం వల్ల ఉపయోగం ఏదీ ఉండబోదు అని కూడా అంటున్నారు. కానీ పవన్ మాత్రం వీరిని గట్టిగానే టార్గెట్ చేశారు. మరి 2024 ఎన్నికల్లో తన తడాఖా చూపిస్తారేమో చూడాలి.