Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌కు ప‌వ‌న్ పెట్టిన కొత్త పేరు ఇదే!

By:  Tupaki Desk   |   21 Aug 2022 12:26 PM GMT
జ‌గ‌న్‌కు ప‌వ‌న్ పెట్టిన కొత్త పేరు ఇదే!
X
తెలంగాణ‌లోని మునుగోడులో జ‌రిగే అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌డం లేద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. విధ్వంస రాజ‌కీయాలు అంటే త‌న‌కు ఇష్టం లేద‌ని.. అందుకే మునుగోడులో పోటీ చేయ‌డం లేద‌ని చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తివ్వ‌డానికి త‌న కార‌ణాలు త‌న‌కు ఉన్నాయ‌న్నారు. దేశంలో, రాష్ట్రంలో మూడో ప్ర‌త్యామ్నాయం అవ‌స‌ర‌మ‌ని ప‌వ‌న్ తెలిపారు. ప్ర‌జారాజ్యం పార్టీ ఉండి ఉంటే మూడో ప్ర‌త్యామ్నంగా ఉండేద‌న్నారు.

టీడీపీకో, వైఎస్సార్సీపీకో జ‌న‌సేన కొమ్ముకాయ‌ద‌ని ప‌వ‌న్ తెలిపారు. జ‌న‌సేన పార్టీ జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని తిరుప‌తిలోని ఓ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఆగ‌స్టు 22న నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాయ‌ల‌సీమ‌లో అగ్ర‌వ‌ర్ణాల ముందు చేతులు క‌ట్టుకునే ప‌రిస్థితిని త‌ప్పిస్తామని స్ప‌ష్టం చేశారు. రాయ‌ల‌సీమ‌లో ప‌లు ఉప‌కులాల‌కు రాజ‌కీయ ప్రాతినిధ్యం ద‌క్క‌డం లేద‌ని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో అనేక మందికి భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు. హైద‌రాబాద్‌లో త‌మ ఆస్తులు పోతాయ‌ని ఎంపీలు మాట్లాడ‌లేద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయితే తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేద‌ని.. త‌న ఆస్తులు లాక్కొన్నా ప‌ర్వాలేద‌ని ప‌వ‌న్ తేల్చిచెప్పారు.

తాను కులాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డానికి రాజ‌కీయాల్లోకి రాలేద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. రాయ‌ల‌సీమ‌లో ఫాక్ష‌న్ ఎక్కువ అంటార‌ని.. అయితే త‌న‌కు మాత్రం క‌నిపించ‌లేద‌న్నారు. రాయలసీమలోని కులాల మధ్య అసమానతలున్నాయ‌ని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు కూడా రాజకీయ అధికారం రావాల‌ని ఆకాంక్షించారు. వక్ఫ్‌ బోర్డు భూములు కబ్జాకు గురవుతున్నాయ‌ని ఆరోపించారు. వైఎస్సార్సీపీ పాల‌న‌లో గ్రామ పంచాయ‌తీల‌కు నిధులు కూడా లేవ‌ని ప‌వ‌న్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ ఓట‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తాన‌ని ప‌వ‌న్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.
గ్రంథాలయాలకు పేరుగాంచిన రాయలసీమలో.. నేడు మద్యం ఏరులైపారుతోందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇటీవలి కాలంలో సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులలోనూ హింస అధికమైందన్నారు. రాయలసీమలో దళితుల గొంతు నొక్కుతున్నార‌ని.. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, వేధింపులు పెరిగాయ‌న్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే వెనుకబడిన కులాలకు అధికారం దక్కాల‌న్నారు.

సమయం వచ్చినప్పుడు మాత్రం త‌న ఎన్నికల వ్యూహం చెబుతాన‌న్నారు. మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకూడదనేదే ప్రస్తుతం తమ వ్యూహమని స్పష్టం చేశారు. ఇందుకు అవ‌స‌ర‌మైతే శ‌త్రువులు, ప్ర‌త్య‌ర్థి పార్టీల‌తోనైనా క‌లుస్తాన‌న్నారు. ఒక ఎలక్షన్‌ కోసమైతే జ‌న‌సేన‌ పార్టీలో చేరవద్దని స్పష్టం చేశారు.

కాగా సీఎం జ‌గ‌న్‌కు ప‌వ‌న్ కొత్త పేరు పెట్టారు. త‌న‌ను చంద్ర‌బాబుకు ద‌త్త పుత్రుడిన‌ని విమ‌ర్శిస్తున్నార‌ని.. అందుకే తాను కూడా సీఎం జ‌గ‌న్‌కు ఆంధ్రా థానోస్ అనే పేరు పెడుతున్నాన‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ అవెంజ‌ర్స్ సినిమాను గుర్తు చేశారు. అవెంజ‌ర్స్ సినిమాలో థానోస్ అనే విల‌న్ ఉంటాడ‌న్నారు. తాను ప్ర‌పంచానికి మంచి చేస్తున్నాన‌ని అనుకుంటాడ‌ని.. అలాగే జ‌గ‌న్ కూడా న‌వ‌ర‌త్నాల‌తో మంచి చేస్తున్నాన‌ని అనుకుంటున్నాడ‌ని ఎద్దేవా చేశారు. అవెంజ‌ర్స్ సినిమాలో థానోస్ ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తున్నాన‌ని అనుకుని సగం మందిని చంపేస్తాడ‌ని.. అలాగే ఆంధ్రాలో జ‌గ‌న్ కూడా న‌వ‌ర‌త్నాల‌తో మంచి చేస్తున్నానంటూ ప్ర‌జ‌ల‌ను చంపేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అందుకే తాను జ‌గ‌న్‌కు ఆంధ్రా థానోస్ అనే పేరు పెడుతున్నాన‌ని తెలిపారు.