Begin typing your search above and press return to search.

టీడీపీ కొమ్ము కాయనంటూనే... పవన్ మాటలకు...?

By:  Tupaki Desk   |   22 Aug 2022 1:30 AM GMT
టీడీపీ కొమ్ము కాయనంటూనే... పవన్ మాటలకు...?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ ఫుల్ స్టార్. ఆయన ఒక్కరే ఒంటి చేత్తో పదుల సంఖ్యలో విలన్లను అలా చావగొట్టేస్తారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచన చేయాల్సి వస్తోంది. దానికి కారణం ట్రయాంగిల్ ఫైట్ జరిగితే కచ్చితంగా వైసీపీకి లాభం. అదే టైమ్ లో మొత్తం 175 సీట్లకు పార్టీ అభ్యర్ధులను చూసుకోవాలి. వివిధ రకాలైన వ‌నరుల సమస్య ఉండనే ఉంది. ఇక జనసేనకు పార్టీ పరంగా ఉన్న సమస్యలు కూడా అనేకం ఉన్నాయి.

ఈసారి ఎన్నో కొన్ని సీట్లు సంపాదించి పార్టీని చక్కదిద్దుకోకపోతే 2024 తరువాత మళ్లీ వైసీపీ వస్తే ఆ పార్టీకి కూడా బిగ్ ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయి. అందుకే వైసీపీ నేతలు ఎంతలా రెచ్చగొడుతున్నా సింగిల్ గా పోటీ చేయమని సవాల్ చేస్తున్నా కూడా జనసేన నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే రావడంలేదు. ఈ పరిస్థితుల్లో పవన్ బయటకు ఒంటరిగా టూర్లు చేస్తున్నా లోపాయికారిగా మాత్రం పొత్తులకు సై అంటున్నారనే చెబుతున్నారు.

టీడీపీతో పొత్తుకు పవన్ సిద్ధమనే చెబుతున్నారు. ఈ రెండు పార్టీల తరఫున మధ్యవర్తులు కూడా రంగం లోకి దిగి పరిస్థితిని సానుకూలం చేస్తున్నారుట. అయితే పొత్తుల వరకూ ఓకే చెప్పినా సీట్ల దగ్గర మాత్రం పితలాటకం తప్పకపోవచ్చు అని అంటున్నారు. తన పార్టీకి మూడవ వంతు సీట్లు కావాలని జనసేన డిమాండ్ చేస్తోంది అని అంటున్నారు.

అంటే కచ్చితంగా యాభై సీట్లు అయినా తమకు ఇవ్వాలని జనసేన కోరుతోందిట. అంటే మొత్తం 175లో ఒక్క జనసేనకే యాభై ఇస్తే 125 ఉంటాయి. బీజేపీతో కూడా పొత్తు ఉండేలా ఉంది. వారు కూడా 15 సీట్లకు తగ్గేలా లేరు. మరి ఆ విధంగా చూస్తే టీడీపీ కేవలం 110 సీట్లకే పోటీ చేయాల్సి వస్తుంది. మరి అంత తక్కువ సీట్లకు పోటీ చేస్తే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు వస్తాయా అన్న కలవరం టీడీపీలో ఉంది. అందుకే టీడీపీ జనసేన నుంచి వస్తున్న ఈ భారీ ప్రతిపాదనకు సుముఖంగా లేదు అని అంటున్నారు.

ఇస్తే గిస్తే పాతిక సీట్లకే జనసేనను పరిమితం చేస్తే పది సీట్ల దాకా బీజేపీకి ఇచ్చి 140 సీట్లకు తగ్గకుండా తాను పోటీ చేయాలని చూస్తోంది. అలా కనుక చేస్తే రేపటి రోజున కూటమి సహకారం లేకుండా సింగిల్ గానే మెజారిటీ సీట్లు తెచ్చుకుని సొంతంగా అధికారంలోకి రావచ్చు అన్నదే టీడీపీ ఎత్తుగడగా ఉందిట.

అయితే జనసేన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదని అంటోందిట. తమకు గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్రాలోనూ రాయలసీమలోనూ బలం ఉందని చెప్పుకుంటోంది. దాంతో యాభై దాకా సీట్లు ఇస్తేనే తప్ప తమ పార్టీ వారి నుంచి వచ్చే వత్తిడి నుంచి తప్పించుకోలేమని చెబుతోంది. అయితే ఈ పీటముడి ఏదో కాడికి తెగుతుందని అంటున్నారు. అలాగే పొత్తులు కచ్చితంగా కుదురుతాయని కూడా రెండు పార్టీలలో విశ్వాసం ఉంది.

ఇవన్నీ ఇలా ఉంటే తిరుపతిలో నిర్వహించిన జనవాణిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాము వైసీపీకో టీడీపీకో కొమ్ము కాసేవాళ్ళం కామని స్పష్టంగా చెప్పారు. తమకు ఒక కచ్చితమైన రాజకీయ విధానం ఉందని ఆయన అన్నారు. ఏపీలో కూడా మూడవ పార్టీ అధికారంలోకి రావాలన్నది తమ ఆలోచన‌ అని ఆయన చెప్పుకున్నారు.

అయితే పవన్ స్టేట్మెంట్స్ ఇలా ఉన్నా రియల్ గా ఆయన టీడీపీతో కలసి పోటీకి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఈ పొత్తుల మీద ఒక కీలకమైన అడుగు రానున్న నెల రోజులలోనే పడుతుంది అని కూడా చెబుతున్నారు. ఎందుకంటే వైసీపీ ఒక వైపు దూకుడుగా ఉంది. అందువల్ల ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేసుకోవాలీ అంటే సీట్ల పంచాయతీకి ముగింపు పలకాలి అని రెండు పార్టీలూ భావిస్తున్నాయట.