Begin typing your search above and press return to search.

జ‌న‌సేన జ‌న‌వాణిలో రెండో విడ‌త‌కు ప‌వ‌న్ రెడీ!

By:  Tupaki Desk   |   10 July 2022 5:46 AM GMT
జ‌న‌సేన జ‌న‌వాణిలో రెండో విడ‌త‌కు ప‌వ‌న్ రెడీ!
X
జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జోరు పెంచేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓవైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు చేస్తూ రెండు ప‌డ‌వ‌ల మీద విజ‌య‌వంతంగా స్వారీ చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా త‌న వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే సినిమాల కంటే రాజ‌కీయాల‌కే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు. ఓవైపు జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌తో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న ప‌వ‌న్.. మ‌రోవైపు జ‌న‌వాణి కార్య‌క్ర‌మం పేరుతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌తి ఆదివారం అర్జీలు స్వీక‌రించే కార్య‌క్ర‌మానికి కూడా శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో జనవాణి-జనసేన భరోసా రెండో దఫా కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ సిద్ధమయ్యారు. ఇటీవల నిర్వహించిన మొదటి విడత జనవాణి కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.దీంతో.. రెండో విడత కార్యక్రమాన్ని విజయవాడలో జూలై 10న ఆదివారం పవన్ కల్యాణ్ నిర్వహించనున్నారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఇండోర్ హాల్ లో నిర్వహించనున్న జనసేన-జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌ పాల్గొంటారు. ప్ర‌జ‌లు త‌మ స‌మస్య‌ల‌పై ప‌వ‌న్ కే నేరుగా అర్జీలు స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

మ‌రోవైపు జూలై 10న తొలి ఏకాద‌శి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ప‌వ‌న్ క‌ల్యాణ్ గుంటూరు జిల్లా నంబూరు మండల పరిధిలోని దశావతార వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు జనసేనానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఇక్క‌డ నుంచి ప‌వ‌న్ విజ‌య‌వాడ‌లోని మాకినేని బసవ పున్నయ్య ఇండోర్ హాల్ లో నిర్వహించనున్న జనసేన-జనవాణి కార్యక్రమానికి హాజ‌ర‌వుతారు.

మొత్తం ఐదు వారాలు నిర్వ‌హించ‌నున్న జ‌న‌వాణికి సంబంధించి జూలై 10తో రెండు ఆదివారాలు పూర్త‌వుతాయి. జూలై నెల‌లోనే మ‌రో మూడు ఆదివారాలు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. మొద‌టి రెండు ఆదివారాలు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించ‌గా, మిగిలిన మూడు జ‌న‌వాణి కార్య‌క్ర‌మాలు ఉత్త‌రాంధ్ర‌, కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు.