Begin typing your search above and press return to search.

పవన్ దూకుడు : టీడీపీలో అంతర్మధనం...?

By:  Tupaki Desk   |   12 Jun 2022 4:30 PM GMT
పవన్ దూకుడు : టీడీపీలో అంతర్మధనం...?
X
జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దూకుడు పెంచేశారు. ఆయన బస్సు యాత్రను సడెన్ గా డిసైడ్ చేసి మరీ ప్రకటించేశారు. ఆరు నూరు అయినా పవన్ ఈసారి సీఎం కావాల్సిందే అన్న పంతం పట్టుదల జనసైనికులలో కనిపిస్తోంది. దాంతో పోరాడితే పోయేదేమీ లేదు అన్న ఆలోచనతో జనసేన అధినాయకత్వం ఉంది. ప్రజలలో ఉంటే బలం పెంచుకోవడమే కాదు, తమ డిమాండ్ ని కూడా సాధించుకోవచ్చు అన్నదే జసేన వ్యూహం

ఒక వైపు చంద్రబాబు జిల్లాల యాత్రను చేపట్టిన తరుణంలోనే పవన్ కళ్యాణ్ బస్సు యాత్రను తలపెట్టడం మీద మాత్రం టీడీపీలో పెద్ద ఎత్తున అంతర్మధనం జరుగుతోంది. పవన్ తో పొత్తు ఉండాల్సిందే అని సీనియర్ నేతలు అభిప్రాయపడుతూంటే జనంలో ఉన్న అభిప్రాయం మేరకు టీడీపీ పట్ల ఈసారి మొగ్గు ఉంటుంది కాబట్టి ఒంటరిగానే పోటీకి సై అనాలని దిగువ స్థాయి క్యాడర్ అధినాయకత్వం మీద వత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది

అదే సమయంలో సీనియర్లు, పార్టీలో మొదటి నుంచి ఉన్న వారు మాత్రం ఎలాగైనా పవన్ని కలుపుకుని ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించగలమని, ఏ చిన్న అవకాశాన్ని అనుమానాన్ని కూడా లేకుండా చేయగలమని కూడా చెబుతున్నారు. మరో వైపు చూస్తే ముఖ్యమంత్రి సీటు షేరింగ్ వద్దనే ఇపుడు చిక్కుముడి ఉంది.

పవన్ తన పార్టీ సమావేశంలో ధీమాగా ఆ విషయం చెప్పాక ఆయన వెనక్కి తగ్గేదిలేదు. ఇక పవన్ సీఎం అది కూడా మొదటి దఫాలోనే అని జనసేన పట్టుబడుతోంది. చెరి రెండున్నర ఏళ్ళు సీఎం అని రెండవ టెర్మ్ లో జనసేనకు చాన్స్ ఇస్తామని చెప్పినా కూడా ఒప్పుకునే సీన్ లేదని అంటున్నారు. దానికి కారణం తెలుగుదేశం అధినాయకత్వం చాణక్య రాజకీయాల మీద ఉన్న అనుమానాలే అంటున్నారు.

ఇక జనసేనకు ఇపుడు కాకపోతే మరో సందర్భంలో అయినా అవకాశం ఉండవచ్చేమో కానీ టీడీపీకి మాత్రం 2024 ఎన్నికలు అత్యంత కీలకం కాబట్టి వారే వస్తారని ఆ పార్టీ నాయకులు ఊహిస్తున్నారు. అయితే ఇపుడు పొత్తుల మీద చర్చ కంటే ముందు పార్టీ పటిష్టత మీదనే దృష్టి సారించాలని టీడీపీ అధినాయకత్వం సూచిస్తోంది. ఎన్నికల ముందు దాకా ఇలాగే వ్యూహాత్మకైన మౌనాన్ని ఆశ్రయించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే ముందుకు పోవాలని ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది

ఇక చూస్తే టీడీపీకి మద్దతుగా నిలిచే అనుకూల మీడియా సైతం పొత్తులు ఉంటేనే టీడీపీకి అధికారం దక్కుతుందని విశ్లేషించడం కీలకమైన పరిణామం. పొత్తుల విషయంలో ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా మరోమారు జగన్ చేతిలో అధికారాన్ని తీసుకువెళ్ళి అప్పగించడమే అంటున్నారు. ఈ విషయంలో జనసేన తగ్గాలని కూడా అనుకూల మీడ రాతలు సూచిస్తున్నాయి. అయితే జనసేన మాత్రం తగ్గేది లేదు అంటోంది

మొత్తానికి ఏదో రకమైన అద్భుతం జరుగుతుందని, పొత్తులు కుదురుతాయని, జగన్ మాజీ సీఎం అవుతాడని అటు జనసేన, ఇటు టీడీపీ వర్గాలలో ధీమాగా వినిపిస్తున్న మాట. మరి అది ఎలా అన్నదే చూడాలిపుడు.