Begin typing your search above and press return to search.

పవన్ అహం దెబ్బతిన్నదా ?

By:  Tupaki Desk   |   5 Jun 2022 7:05 AM GMT
పవన్ అహం దెబ్బతిన్నదా ?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకపుడు పొత్తులతో పోటీ విషయమై ఆసక్తి చూపిన తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇపుడు ఒంటరిపోటీయే మేలన్నట్లుగా మాట్లాడుతున్నారంటు పవన్ చెప్పారు. అప్పట్లో వన్ సైడ్ లవ్ అన్నవాళ్ళే ఇపుడు వార్ వన్ సైడే అని వచ్చే ఎన్నికలు ఏకపక్షమని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలనే పవన్ నిదర్శనంగా ఉదహరించారు.

పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు చూసిన తర్వాత తన అహం దెబ్బతిన్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే అప్పుడెప్పుడో కుప్పం పర్యటనలో లవ్ ప్రపోజల్ చేసినా పవన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని స్వయంగా చంద్రబాబే చెప్పారు. అలాంటిది ఎప్పుడైతే బాదుడే బాదుడు కార్యక్రమంలో జనాలు వస్తున్నారని అనుకున్నారో, మహానాడు బహిరంగసభ సక్సెస్ అయ్యిందనుకున్నారో అప్పటినుండే చంద్రబాబు స్వరం మారిపోయింది.

తమతో అప్పట్లోనే లవ్ ప్రపోజల్ అన్నవాళ్ళు ఎప్పుడు ఎందుకు మాటమార్చారన్నట్లుగా చంద్రబాబు పేరెత్తకుండా పవన్ నిలదీశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు లవ్ ప్రపోజ్ చేసినపుడు పవన్ డైరెక్టుగా స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని, ప్రభుత్వ వ్యతిరేకఓటును చీలనిచ్చేది లేదని భీషణ ప్రతిజ్ఞచేశారు. చంద్రబాబు లవ్ ప్రపోజల్ చేసినపుడే పవన్ సానుకూలంగా రెస్పాండ్ అయ్యుంటే ఇపుడు పరిస్ధితి ఎలాగుండేదో.

చంద్రబాబును బీజేపీ దూరంగా పెడుతున్న విషయం తెలిసికూడా పవన్ ఏమీ మాట్లాడటంలేదు. అందుకనే చంద్రబాబుతో పొత్తు విషయంలో పవన్ ఏదో ఒక నిర్ణయం తీసుకుని ప్రకటనచేసుంటే ఇపుడు రాజకీయం మరింతగా వేడెక్కిపోయేదే. ఇపుడు కూడా మూడు ఆప్షన్లు చెప్పారు. మొదటిది బీజేపీతో కలిసి పోటీచేయటం, రెండోది టీడీపీతో పొత్తులో పోటీచేయటం. మూడోదేమో జనసేన ఒంటరిగా పోటీచేయటం. అంటే ఇపుడు కూడా టీడీపీతో కలిసి పోటీచేస్తామని ధైర్యంగా చెప్పటంలేదు. ఇదంతా చూస్తుంటే పొత్తులపై మళ్ళీ చంద్రబాబే ప్రపోజల్ పంపితే అప్పుడు రెస్పాండ్ అవుదామని అనుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.