Begin typing your search above and press return to search.

ప‌వ‌న్.. బీజేపీతో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నాడా?!

By:  Tupaki Desk   |   16 May 2022 1:30 AM GMT
ప‌వ‌న్.. బీజేపీతో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నాడా?!
X
రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. శాశ్వ‌త శ‌తృవులు.. శాశ్వ‌త మిత్రులు.. రాజ‌కీయాల్లో ఉండ‌ర‌నేది అంద‌రికీ తెలిసిందే. అవ‌కా శం, అవ‌స‌రం.. అనే రెండు ప‌ట్టాల‌పైనే రాజ‌కీయాలు నేడు న‌డుస్తున్నాయి. ఎవ‌రితో అవ‌స‌రం ఉంటే.. వారితో క‌ల‌వ‌డం.. ఎవ‌రితో అవ‌కాశం వ‌స్తే.. వారితో చేతులు క‌ల‌ప‌డం.. రివాజుగా మారిపోయింది.దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. పెద్ద పెద్ద జాతీయ పార్టీలే.. కొమ్ములు తిరిగిన నాయ‌కులే.. త‌మ అవ‌స‌రాలు.. త‌మ అవ‌కాశాలు చూసుకుని .. రాజ‌కీయంగా చ‌క్రాలు తిప్పుతున్నారు. ఇప్పుడు.. ఇలాంటి ప‌రిస్తితే.. ఏపీలోనూ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప్ర‌స్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న కూడా ఈ విష‌యం చెబుతున్నా రు. అదేస‌మ‌యంలో ఏపీ బీజేపీ నాయ‌కులు కూడా త‌ర‌చుగా పొత్తుల విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు.. తాము జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్నామ‌ని చెబుతున్నారు. అయితే.. ప‌వ‌న్ ఇటీవ‌ల కాలంలో త‌న వ్యూహం మార్చుకునేందుకు రెడీ అయ్యార‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌త నెల‌లో జ‌రిగిన జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌ద‌స్సులో ప‌వ‌న్ .. వైసీపీ వ్య‌తిరేక ఓటును చీల‌నివ్వ‌బోన‌ని శ‌ప‌థం చేశాడు. అదేస‌మ‌యంలోఅన్ని పార్టీలూ క‌లిసేలా.. తాను చ‌క్రం తిప్పుతాన‌ని కూడా అన్నారు.

ఇక‌, ప‌వ‌న్ టీడీపీలు.. క‌లిసి పోటీ చేస్తాయ‌నే ప్ర‌చార హోరు.. జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి అటు జ‌న‌సేన కానీ.. ఇటు టీడీపీ కానీ, క్లారిటీ ఇవ్వ‌క‌పోయినా.. దీనిపై చ‌ర్చ అయితే జోరుగా సాగుతోంది. ఇదిలావుంటే.. బీజేపీ కేంద్ర పెద్ద‌లు త‌ను ఎప్పుడు అడిగితే.. అప్పుడు అప్పాయింట్‌మెంట్ ఇస్తున్నార‌ని.. ప‌వ‌న్ కొన్నాళ్ల కింద‌ట చెప్పారు. త‌న‌పై ఎలాంటి కేసులు లేవు కాబ‌ట్టే.. వారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నార‌ని.. పేర్కొంటూ.. సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న ఎద్దేవా చేశారు. అయితే.. ఇది నిజ‌మే అయినా.. ఇప్పుడు మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ బీజేపీకి దూర‌మ‌వుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

దాదాపు ఏడాదిన్న‌ర‌గా.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌ను ప‌వ‌న్ క‌లుసుకోవ‌డం లేదు. అంతేకాదు.. వారు హైద‌రాబాద్ వ‌చ్చినా.. గ‌తంలో క‌లిసిన‌.. ప‌వ‌న్ ఇటీవ‌ల కాలంలో వారికి చిక్క‌డం లేదు వారితో క‌నీసం.. మ‌ర్యాద పూర్వ‌కంగా కూడా భేటీ కావ‌డం లేదు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో కూటమి ఘోర పరాజయం తర్వాత జనసేన నేతలు బీజేపీ నేతలను కలవకపోవడం ఆశ్చర్యకరం. 2024 ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య ఉమ్మడి కార్యక్రమం ఉండాలని తొలుత నిర్ణయించారు.

అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు విజయవాడలో ఒకసారి, వీర్రాజు, నాదెండ్ల మనోహర్ ఆ తర్వాత రెండుసార్లు భేటీ అయ్యారు. కానీ, తిరుపతి ఎన్నికల తర్వాత పొత్తులో భాగంగా ఉమ్మడి కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకునేందుకు నేతలు ఎప్పుడూ కలవలేదు. రెండు పార్టీల మధ్య బంధాన్ని పటిష్టం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లడం లేదు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర బీజేపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్‌ను కలవడం లేదు. అసలు ఆయ‌న ఊసు కూడా ఎక్క‌డా తీసుకురాలేదు.

దీంతో వారి పొత్తుపై సందేహాలు లేవనెత్తుతూ గత ఏడాదిన్న‌ర‌గా అనేక విశ్లేష‌ణలు వ‌స్తున్నాయి. బీజేపీతో సంబంధాలను బలోపేతం చేసుకునే అజెండాను ప‌క్క‌న పెట్టిన‌ పవన్ కళ్యాణ్.. టీడీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఏపీ బీజేపీ నాయ‌కులు భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో తాము టీడీపీతో క‌లిసేది లేద‌ని.. ఇది కుటుంబ పార్టీఅని సోము వీర్రాజు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌కు బీజేపీకి మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.