Begin typing your search above and press return to search.

పవన్ ఉక్కిరి బిక్కిరి... అంతా స్వయంకృతం..?

By:  Tupaki Desk   |   24 April 2022 10:31 AM GMT
పవన్ ఉక్కిరి బిక్కిరి... అంతా స్వయంకృతం..?
X
పవన్ కళ్యాణ్. సినీ రంగాన పవర్ స్టార్. అక్కడ ఆయన అన్న చాటు తమ్ముడు నుంచి సొంతంగా ఎదిగి సత్తా చాటారు. మెగాస్టార్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా తనకంటూ ఒక పేజీని టాలీవుడ్ చరిత్రలో లిఖించుకున్నారు. అదే పవన్ రాజకీయ రంగాన మాత్రం ఇంకా నీడగానే ఉండిపోతున్నారు. ఎవరికో తోడుగానే నిలిచిపోతున్నారు. అంటే దానికి కారణం పవన్ చేజేతులా చేసుకున్నదే ఇదంతా.

జనసేనది ఎనిమిదేళ్ల రాజకీయ ప్రస్థానం. పవన్ కళ్యాణ్ ది అంతకంటే ముందే మొదలైన రాజకీయ జీవితం. ఆయన ప్రజారాజ్యం పార్టీలో యువ రాజ్యం నేతగా 2008లో బాధ్యతలు స్వీకరించారు. దశాబ్దన్నర అనుభవం. అయినా పవన్ ఏపీ పాలిటిక్స్ లో సొంత ఉనికిని చాటుకోవడానికి ప్రయాస‌ పడుతున్నారు అంటే ఆలోచించాల్సిందే. జనసేన కేరాఫ్ టీడీపీ అని చాలా ఈజీగా వైసీపీ కామెంట్స్ చేస్తోంది అంటే తప్పు ఎక్కడ ఉంది.

మాటకు మాట, కామెంట్ కి కామెంట్ అనేస్తే సరిపోతుందా. దత్తపుత్రుడు అంటే మరో పుత్రుడు అని తగిలించి ఊరుకుంటే కుదురుతుందా. అసలు ఇదంతా ఎలా జరిగింది. ఎందుకు ఇలా అంటున్నారు అని జనసేనాని ఎపుడైనా విశ్లేషించుకున్నారా. ఆయన 2014లో రాజకీయ పార్టీ పెట్టారు. మరి నాడే ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎవరినో ఉద్ధరించడానికి అంటే రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు.

ఒక పార్టీని గద్దె దించడానికి, మరో పార్టీని గెలిపించడానికి పార్టీ అన్నది అవసరం లేదు. కేవం తాను నచ్చిన పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తే సరిపోతుంది. రాజకీయాల్లో త్యాగాలు ఉండవు. పోరాటాలు ఉంటాలి. ముఖ్యంగా ఆశలు, ఆశయాలూ ఉంటాయి. టార్గెట్లు, వాటి కోసం కొండనైనా ఢీ కొట్టే డేరింగ్ స్టెప్స్ ఉంటాయి. ఏ ఒక్క నాయకుడూ కూడా సులువుగా సీఎం పీఎం అయిపోలేదు.

ఎక్కడో కొందరు వారసత్వంగా అయితే అవవచ్చు కాక. మిగిలిన వారు ఎవరైనా జనాల్లో ముద్ర బలంగా వేసుకోవాలి. ఈయన మన కోసం వచ్చాడు అనిపించుకోవాలి. కానీ జనసేన తన ఎనిమిదేళ్ల ప్రస్థానంలో చేసిందేంటి. పొత్తులతోనే గడిపేశారు. మరీ ముఖ్యంగా బలమైన టీడీపీకి అండగా ఉండాలనుకున్నారు. అది ఎక్కడా దాచుకోకుండా పనిచేసారు.

వైసీపీని శతృవుగా చూశారు. అదే టీడీపీని మిత్రుడిగా చూశారు. అందుకే సైడ్ పార్టీగానే జనసేనను ఏపీ జనాల మనసుల్లో ఉంచేశారు. తప్పో ఒప్పో తెగింపో దుస్సాహసమో పవన్ ఎందుకు ఒంటరిగా పోటీ చేయకూడదు. ఏపీ లాంటి చిన్న రాష్ట్రంలో 175 సీట్లకు ఎందుకు అభ్యర్ధులను పెట్టకూడదు. ఆయనకు ఆయనే చెప్పుకున్నట్లుగా పాతికేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని మెల్లగా ఎందుకు ప్రారంభించకూడదు.

ఎపుడూ ఒక పార్టీని తెగనాడుతూ మరో పార్టీని ఏమీ అనకుండా చేసే రాజకీయం వల్ల తనకు ఒనకూడింది ఏంటి అన్నది ఆయన ఆలోచన చేసుకోవాలి కదా. పవన్ కి విపరీతమైన జనాకర్షణ శక్తి ఉంది. ఆయనకు సామాజికవర్గం పరంగా బలం ఉంది. ఆయనకు మిగిలిన పార్టీలతో పోటీ పడగల సత్తువ చాలానే ఉంది. కానీ వ్యూహాల్లోనే తప్పు ఉంది.

అందుకే ఆయన వైసీపీ చేత దత్తపుత్రుడు అనిపించుకుంటున్నారు. పొత్తుల కోసం ఆరాటపడే పార్టీగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అసలు వైసీపీకి వ్యతిరేక ఓట్లను చీల్చాల్సిన అవసరం అగత్యం పవన్ కి ఎందుకు. వైసీపీ యాంటీ ఓట్లను గుత్తమొత్తాన ఒడిసిపట్టుకునే దిశగా జనసేనను తానే బలోపేతం చేసుకోవచ్చుగా.

తనతో పొత్తులకు ఏ పార్టీ వచ్చినా వద్దు అనాల్సిన పవనే అందరినీ కలుపుకుని పోవాలని చూడడం ఎందుకు. ఇది దేన్ని సూచిస్తుంది. జగన్ని బలవంతుడిగా, పవన్ సహా విపక్షాలను బలహీనులుగా మార్చదా. ఇప్పటిదాకా జనసేనాని చేసింది తప్పుడు వ్యూహాలతో కూడిన రాజకీయమే. అందుకే వైసీపీ దాన్ని టీడీపీతో కలిసి కట్టేస్తోంది. ఆ విధంగా టీడీపీ రాజకీయంగా లాభపడుతోంది. మరో వైపు వైసీపీకి కూడా ఇది లాభమే.

మరి మధ్యన ఉన్న జనసేనకు ఏం ఒరిగింది. అందుకే పవన్ మాటలలో కాదు, చేతలలో తన సత్తాను చాటాలి. ఆరు నూరు అయినా వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే అని తెగేసి చెప్పాలి. జనసేనకు ఆ దిశగా నడిపించాలి. తనకు వైసీపీ అయినా టీడీపీ అయినా ఒక్కటే అని జనాల్లోకి వెళ్ళి రెండు పార్టీలను విమర్శించాలి. అపుడే జనాలు తన వైపు చూసే అవకాశం ఉంటుంది.

లేకపోతే వైసీపీకి ఆల్టర్నేషన్ గా ఈ రోజుకీ పటిష్టంగా ఉన్న టీడీపీ వైపే జనాలు చూస్తారు. అలాగే పవన్ పార్టీకి మాత్రం వైసీపీ నుంచి ఈ రకమైన ఎపుడూ సెటైర్లు తప్పవు. మొత్తానికి ఎన్నికలు రెండేళ్లకు పైగా సమయం ఉన్న వేళ పవన్ సీరియస్ గానే ఆలోచించాల్సిన సమయం ఇది. అపుడే వైసీపీ విమర్శలకు సరైన జవాబు చెప్పినట్లు అవుతుంది.