Begin typing your search above and press return to search.

పవన్ గురించి వాళ్లేమనుకుంటున్నారు?

By:  Tupaki Desk   |   24 April 2022 6:18 AM GMT
పవన్ గురించి వాళ్లేమనుకుంటున్నారు?
X
'నా సభలకు పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు..నాపై అభిమానం చూపుతున్నారు..కానీ ఓట్లు మాత్రం వైసీపీకే వేస్తున్నారు'...ఇది తాజగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. పవన్ వ్యాఖ్యల్లో ఆవేదన, ఆగ్రహం, ఉడుకుమోతుతనం అన్నీ కనబడుతున్నాయి. పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా బహిరంగ సభల్లో మాట్లాడేటపుడు చాలాసార్లే అన్నారు.

బహిరంగ సభల్లో అభిమానులు పవన్ ను ఉద్దేశించి సీఎం..సీఎం అని అరవటం మామూలే. అలా అరిచినపుడల్లా అభిమానులపై పవన్ మండిపోతున్నారు. తనను ఉద్దేశించి సీఎం సీఎం అని అంటారు ఓట్లు మాత్రం జగన్ కు వేస్తారని మండిపోయారు. వైసీపీకి ఓట్లేసి తనను సీఎం సీఎం అనంటే ఎలా సీఎం అవుతానని అభిమానులను నిలదీసిన సందర్భాలున్నాయి. ప్రస్తుతానికి వస్తే చింతలపూడిలో కౌలు రైతులను పరామర్శించేందుకు, ఆర్థిక సాయం చేసేందుకు పశ్చిమగోదావరిలో పర్యటిస్తున్నారు.

హనుమాన్ జంక్షన్లో పవన్ కు ఘనంగా రిసీవ్ చేసుకున్నపుడు కూడా జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఒకవైపు తనకు ఘన స్వాగతం చెబుతునే జగన్ కు జిందాబాద్ కొట్టడాన్ని పవన్ తట్టుకోలేకపోయారు. అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటమో లేకపోతే ఆగ్రహం వ్యక్తం చేయటం వల్లో ఉపయోగం లేదు. తన సభలకు వచ్చే తన అభిమానులు కూడా వైసీపీకి ఎందుకు ఓట్లేస్తున్నారనే విషయమై పవన్ ఒకసారి ఆలోచించుకోవాలి.

తనను సినిమాల్లో పవర్ స్టార్ గా మాత్రమే అభిమానులు చూడాలని అనుకుంటున్నారా ? లేకపోతే రాజకీయాల్లో కూడా స్టార్ గా చూడాలని అనుకుంటున్నారా ? అనే విషయాన్ని విశ్లేషించుకోవాలి. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అభిమానులు జనసేన అధిపతిని కేవలం సినిమాల్లో మాత్రమే అభిమానించాలని అనుకుంటున్నట్లు అర్ధమవుతోంది.

తమ పవర్ స్టార్ ను రాజకీయాల్లో ఊహించుకోలేకపోతున్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి పవన్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇలాగే ప్రతి సభలోను అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తునే ఉండాల్సొస్తుందేమో.