Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌.. ఏది మొద‌లెట్టినా.. ఇంతే బ్రో..!

By:  Tupaki Desk   |   15 April 2022 12:21 PM GMT
ప‌వ‌న్‌.. ఏది మొద‌లెట్టినా.. ఇంతే బ్రో..!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్లు వ‌స్తున్నాయి. ఆయ‌న ఏది ప్రారంభించినా.. మ‌ధ్య‌లోనే వ‌దిలేస్తార‌ని.. ఏదీ పూర్తిగా చేసిన దాఖ‌లా క‌నిపించ‌డం లేద‌ని.. ప‌వ‌న్ హార్డ్ కోర్ అభిమానులు కూడా పెద‌వి విరుస్తున్నారు. దీనికి కార‌ణం.. ఏడాది కాలంలో ఆయ‌న మూడు కార్య‌క్ర‌మాలు ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించారు.

అయితే.. దేనినీ ఆయ‌న పూర్తిగా చేయ‌లేదు. కేవ‌లం హ‌డావుడి చేయ‌డం.. వెంట‌నే వాటిని ముగించేయ‌డం.. ప‌వ‌న్ త‌ర‌హా రాజ‌కీయాలుగా చెబుతున్నారు. గ‌త ఏడాది అక్టోబ‌రు 2న గాంధీ జ‌యంతిని పుర‌స్కరించుకుని.. శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. దీనికి భారీ ఎత్తున ప్ర‌చారం కూడా క‌ల్పించారు.

ఏపీలో ప్ర‌భుత్వం రోడ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప‌వ‌న్‌.. రెండు వారాల గ‌డువులో ప్ర‌భుత్వం రోడ్లు బాగుచేయాల‌ని అల్టిమేటం ఇచ్చారు. అయితే.. అప్ప‌టికీ ప్ర‌భుత్వం వాటిని ప‌ట్టించుకోలేదు. దీంతో గోతులు ప‌డిన ర‌హ‌దారుల‌ను బాగు చేసే బాధ్య‌త జ‌న‌సేన తీసుకుంటుంద‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ వెంట‌నే రంగంలోకి కూడా దిగిపోయారు.

గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా, ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో స్వ‌యంగా శ్ర‌మ‌దానం కార్యక్ర‌మాలు చేప‌ట్టారు. అప్ప‌ట్లో ఇది పెద్ద రాజ‌కీయ వివాదంగానూ మారింది. ఇక‌, ఆత‌ర్వాత రోజు నుంచి జ‌న‌సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి.. ర‌హ‌దారులు బాగు చేస్తార‌ని.. ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

కానీ, ఆ త‌ర్వాత‌.. దాని ఊసు మ‌రిచిపోయారు. ఇక‌, అదేసంవ‌త్స‌రం జూలై-ఆగ‌స్టు మ‌ధ్య ఎస్సీల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ఖండించిన ప‌వ‌న్‌.. ప్ర‌కాశంలో ఒక కుటుంబాన్ని కూడా ప‌రామ‌ర్శించారు. ఇక నుంచి ఎస్సీల‌కు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. ఎస్సీ త‌ర‌ఫున పోరాటాలు చేస్తామ‌న్నారు.

అంతే.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప‌వ‌న్ కంటికి క‌నిపించ‌కుండా పోయి.. అక్టోబ‌రు 2న ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఇక‌, ఆత‌ర్వాత‌.. మ‌ళ్లీ ఆయ‌న ఊసు ఎక్క‌డా వినిపించ‌లేదు. కేవ‌లం ట్వీట్లు.. కామెంట్ల‌తోనే స‌రిపెట్టారు. తాజాగా రాష్ట్రంలో కౌలు రైతుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని.. వారు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని.. ఆవేద‌న వ్య‌క్తం చేసిన ప‌వ‌న్ ఒక్కొక్క కుటుంబానికి రూ.ల‌క్ష చొప్పున ప‌రిహారం అందించే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.

స్వ‌యంగా ఆయ‌నే రంగంలోకి దిగి.. అనంత‌పురానికి వ‌చ్చారు. త‌నే స్వ‌యంగా అంద‌రినీ క‌లుస్తాన‌ని.. చెప్పారు. అయితే.. ఇది జ‌రిగి రెండు రోజులు అయినా.. ఇప్ప‌టికీ.. ఈ కార్య‌క్ర‌మం ముందుకు సాగ‌లేదు. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న అభిమానులు. జ‌న‌సేన నేత‌లు కూడా పెద‌వి విరుస్తున్నారు.

ఇవేం రాజ‌కీయాలు.. ఉంటే పూర్తిగా రాజ‌కీయాల్లో అయినా.. ఉండాలి .. లేక పోతే.. ఎన్నిక‌ల‌కు ముందుగా అయినా.. రావాలి. ఇలా మ‌ధ్యలో ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతే.. ఆయ‌నకే బ్యాడ్ నేమ్ వ‌స్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ వ్యూహం ఏంటో తెలియాల్సి ఉంది.