Begin typing your search above and press return to search.

పవన్ పంచ్ పవర్ పెరిగిందే.. జగన్ కు షాక్ లగా?

By:  Tupaki Desk   |   24 April 2022 4:30 PM GMT
పవన్ పంచ్ పవర్ పెరిగిందే.. జగన్ కు షాక్ లగా?
X
ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల భరోసా యాత్రకు పవన్ కల్యాణ్ కదిలారు. జిల్లాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తూ ఓదారుస్తున్నారు. ఈ మేరకు వారికి భరోసా కల్పిస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు కామెంట్లు చేయడంతో పవన్ రెచ్చిపోయారు. చంచల్ గూడ జైల్లో షటిల్ ఆడే వారు తనకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. తానేమిటో తనకు తెలుసని తన గురించి అవాకులు చెవాకులు పేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వారు నోరు జారితే నేను కూడా వారిని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని హితవు పలికారు.

పవన్ కల్యాణ్ ఇక జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. దీని కోసమే కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టారు. జిల్లాల్లో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శిస్తూ వారికి ఆర్థిక సాయం చేస్తూ వారిలో భరోసా నింపుతున్నారు. మీకు నేనున్నానని హామీ ఇస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మండిపడుతున్నారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబడుతున్నారు.

రాష్ట్రంలో వైసీపీ పాలన తీరుపై విమర్శలు వస్తున్నాయి. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం ఓదార్చాల్సింది పోయి అపహాస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల తీరు హాస్యాస్పదంగా ఉందని మండిపడుతున్నారు. రైతు కుటుంబాలంటే లెక్కలేకుండా పోతోంది. వారి సంక్షేమంపై కనీసం శ్రద్ధ కూడా చూపడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేదు.

కౌలు రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తాను ఉన్నానని భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల కోసం తాను ఎంతకైనా సిద్ధమేనని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. గజమాలతో సత్కరిస్తున్నారు. కౌలు రైతుల పాలిట దేవుడని అభివర్ణిస్తున్నారు. ఏపీలో సమస్యలు లేకుండా చూడాలన్నదే తమ అభిమతమని పవన్ ఈ సందర్భంగా చెప్పడం విశేషం.

మొత్తం రైతు కుటుంబాలకు సుమారు రూ. 5 కోట్ల మేర అవసరమయ్యేలా కనిపిస్తోంది. అయినా వారందరికి తమ పార్టీ తరఫున సాయం అందజేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటిస్తున్నారు. దీంతో కౌలు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అన్ని కుటుంబాలకు ఓదార్పుగా భరోసా యాత్ర చేపట్టనున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో పవన్ కల్యాణ్ చేస్తున్న కృషికి వైసీపీ ఓర్వడం లేదు.