Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పెద్దల భేటి వేళ జగన్ పై పవన్ మరో అస్త్రం

By:  Tupaki Desk   |   10 Feb 2022 6:03 PM GMT
టాలీవుడ్ పెద్దల భేటి వేళ జగన్ పై పవన్ మరో అస్త్రం
X
ఓవైపు టాలీవుడ్ సమస్యలపై చిరంజీవి, రాజమౌళి సహా సినీ ప్రముఖుల భేటి వేళ జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎండగట్టారు.. జగన్ సర్కార్ పై మరో బాంబు పేల్చారు. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరణతో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందో తెలుస్తోందని.. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తేటతెల్లమైందని ఆయన మండిపడ్డారు.

కేంద్ర రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు ఏపీ ప్రభుత్వం అలక్ష్యం కారణంగానే ఆలస్యమవుతున్నాయని.. ఏపీ ప్రభుత్వం తన వాటాగా నిధులు మంజూరు చేయకపోతే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో కీలకమైన రైల్వేలైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయి. ఏపీలోని కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ పనులు ఎక్కడ వేసిన గొంగడి మాదిరిగా అలాగే ఉన్నాయని..ఈ ప్రాజెక్టుకు కేటాయించాల్సిన 25శాతం కూడా ఏపీ ప్రభుత్వం కేటాయించలేదన్నారు. ఆ మొత్తాన్ని మంజూరు చేయకపోవడంతోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.358 కోట్లు ఇస్తేనే ఈ పనులు ముందుకు సాగుతాయన్నారు. ఈ రైల్వే లైన్ పూర్తి చేస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి-నడికుడి ప్రాజెక్టుకు రూ.1351కోట్లు, కడప-బెంగళూరు రైల్వే లైన్ కు రూ.289 కోట్లు, రాయదుర్గం-తమకూరు లైన్ కు రూ.34 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రైల్వే పనులకు నిధులు ఇవ్వరు..భూసేకరణ చేయరని.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని పవన్ ప్రశ్నించారు.

ఏపీలో రైల్వే లైన్లు పూర్తికావడానికి రాష్ట్ర ఎంపీలందరూ సీఎం దృష్టికి.. కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లాలని పవన్ సూచించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన పూర్తయినా దానికి కార్యరూపం దాల్చడంలో ఎంపీలు విఫలమవుతున్నారు.