Begin typing your search above and press return to search.

లిస్ట్ రెడీ : బస్సు యాత్రలో పవన్ వరాలు...?

By:  Tupaki Desk   |   18 July 2022 12:30 AM GMT
లిస్ట్ రెడీ : బస్సు యాత్రలో పవన్ వరాలు...?
X
రాజకీయ పార్టీలు అన్న తరువాత జనాలకు హామీలు ఇవ్వాలి. అవి తీరుస్తారా లేదా అంటే అది ఒక బ్రహ్మపదార్ధమే. ఎందుచేతనంటే హామీలు ఎపుడూ నూరు శాతం ఎవరూ నెరవేర్చేది ఉండదు. ఇది ఏడున్నర పదుల దేశ స్వాతంత్రాన ప్రతీ చోటా జరుగుతున్నదే. ఇక పవన్ కళ్యాణ్ జనసేన కూడా 2019 ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చింది. అవి ఆచరణ సాధ్యమా కాదా అన్నది పక్కన పెడితే హామీలు ఇవ్వడానికి మాత్రం ఆ పార్టీ సుముఖంగా ఉందనే చెబుతారు.

ఇక 2024 ఎన్నికలకు కూడా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా మండపేట మీటింగులో చెప్పారు. నేను ఏం చేస్తానో, అధికారంలోకి జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తామో త్వరలో జరిగే బస్సు యాత్రలో చెబుతామని పవన్ స్పష్టం చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే యువత కోసం తమ ప్రభుత్వం చాలానే చేస్తుందని పవన్ అంటున్నారు.

యువతకు పది లక్షలు వంతున ఆర్ధిక సాయం చేస్తామని ఆయన చెబుతున్నారు. అంటే ఈ మొత్తంతో వారి చేత పరిశ్రమలు పెట్టించి తద్వారా మరింతమందిని ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే జనసేన ఆలోచనగా చెబుతున్నారు. ఇక ఇదే సభలో ఏపీలో నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఏమీ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కానీ తాను అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పకుండా స్వయం ఉపాధి పధకాలు ప్రకటిస్తామని చెప్పడమే ఇక్కడ చిత్రం.

ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని వర్గాల కోసం పధకాలను సిద్ధం చేసి ఉంచారని అంటున్నారు. అందులో రైతులు మహిళలు, కార్మికులు, వయోజనులు ఇలా అన్ని సెక్షన్లను కవర్ చేసేలా జనసేన ఎన్నికల మ్యానిఫేస్టో జనరంజకంగా తయారు చేస్తున్నారు అని చెబుతున్నారు. ఇక ప్రాంతాల వారీగా కూడా ఎక్కడ ఏమేమి చేయాలన్న దాని మీద జనసేనలో పెద్ద ఎత్తున అధ్యయం జరుగుతోంది అంటున్నారు.

అక్టోబర్ 5తో స్టార్ట్ అయ్యే పవన్ బస్సు యాత్ర సందర్భంగా ప్రతీ చోటా అవసరమైన చోట హామీలను ప్రకటిస్తూ వెళ్తారని అంటున్నారు. తన చిత్తశుద్ధిని నమ్మమని పవన్ జనాలను కోరుకుంటున్నారు. పవన్ అన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏమి చేయగలరు అన్నది కూడా చూడాలని ఆయన కోరుతున్నారు. ఏపీలో కొత్త రాజకీయం రావాలని ఆయన అంటున్నారు. మరి ఏపీలో ఎన్నో పధకలను ప్రకటించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాదాపుగా 650 హామీలను 2014 ఎన్నికల్లో ప్రకటించి టీడీపీ గద్దెనెక్కింది. మరి పవన్ జనసేన పార్టీ ఇచ్చే హామీలను జనాలు నమ్ముతారా. ఆయనకు అందలం అప్పగిస్తారా అంటే వెయిట్ అండ్ సీ.