Begin typing your search above and press return to search.

రెండో విడత పంచాయితీల్లో జనసేన రికార్డుల్ని చెప్పుకొచ్చిన పవన్

By:  Tupaki Desk   |   17 Feb 2021 4:30 AM GMT
రెండో విడత పంచాయితీల్లో జనసేన రికార్డుల్ని చెప్పుకొచ్చిన పవన్
X
ఏపీలో జనసేన ప్రభావం ఎంత? ఇదీ ఒక ప్రశ్నేనా? అన్నట్లుగా చూసే రోజులు పోయినట్లు చెప్పాలి. ఇంతకాలం తన సత్తా చాటే విషయంలో వెనుకబడిన జనసేన.. తాజాగా వెల్లడైన రెండో విడత పంచాయితీలో ఫలితాలు అదరగొట్టేసినట్లుగా చెబుతున్నారు. ఊహించని విధంగా పలు ప్రాంతాల్లో తమ పార్టీ మద్దతుదారులు విజయం సాధించిన విషయాన్నిపార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించటం గమనార్హం.

మొదటి విడతలో పెద్దగా ప్రభావం చూపని జనసేన.. రెండో విడతలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. మొదటి విడతలో 18 శాతం ఓట్లు వస్తే.. రెండో విడతలో 22 శాతం ఓట్లు వచ్చినట్లుగా పవన్ వెల్లడించారు. అంతేకాదు.. పలు స్థానాల్లో తమ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారంటూ.. వారికి సంబంధించిన ఆసక్తికర అంశాల్నివెల్లడించారు.

250కు పైగా పంచాయితీల్లో సర్పంచ్.. ఉప సర్పంచ్ పదవులు జనసేన మద్దతుదారులు సొంతం చేసుకున్నారన్నారు. 1500 పంచాయితీల్లో రెండో స్థానంలో నిలిచినట్లుగా చెప్పారు. 1500 వార్డులు తమ పార్టీ ఖాతాలో చేరినట్లుగా పవన్ ప్రకటించారు. పలుచోట్ల జనసేన మద్దతుదారులు సాధించిన విజయాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నరసరావుపేట మండలంలో గౌసిగా బేగం.. తాడేపల్లి మండలంలో దళిత మహిళ మేదరి సౌజన్య.. ఉద్దానంలో జనసేన మద్దతుదారులు గెలపొందటంపై పవన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా క్రిష్ణాజిల్లాలోని కోలుకొల్లు గ్రామంలో తొమ్మిది నెలల గర్భిణితో ఉన్న లీలా కనకదుర్గ గెలుపొందటం అభినందనీయమన్నారు. ఆమె జనసేన సైనికులకు సరికొత్త స్ఫూర్తిని ఇచ్చారన్నారు. రానున్న మరో రెండు విడతల్లోనూ ఇదే ఊపును కొనసాగించాల్సిందిగా.. పవన్ కోరుతున్నారు. ఆరంభం బాగా లేకున్నా.. రెండో విడతలో కోలుకున్న జనసేన.. రానున్నరెండు విడతల్లో ఎలాంటి విజయాల్ని నమోదు చేస్తుందో చూడాలి.