Begin typing your search above and press return to search.

బద్వేలు ఉప ఎన్నికపై బీజేపీకి షాకిచ్చిన పవన్..

By:  Tupaki Desk   |   3 Oct 2021 9:31 AM GMT
బద్వేలు ఉప ఎన్నికపై బీజేపీకి షాకిచ్చిన పవన్..
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత కొన్ని రోజులుగా రాజకీయంగా దూకుడు పెంచారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పొలిటికల్ గ్రాఫ్ ను కూడా పెంచుకుంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల జనసే ఆధ్వర్యంలో చేపట్టిన శ్రమదానం కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడంతో పార్టీ నాయకులు మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లోనూ కాస్త నమ్మకం పెరుగుతోంది. తాజాగా బద్వేల్ ఉప ఎన్నికపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపై కొందరు విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. పవన్ రాజకీయంగా దూకుడుగానే కాకుండా మానవతా విలువలున్న వ్యక్తి అని ప్రశంసిస్తున్నారు.

కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్లో బద్వేల్ కు ఎన్నిక నిర్వహించాలని చెప్పారు. ఇక్కడున్న ఎమ్మెల్యే వెంటకసుబ్బయ్య మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ పోటీచేసేందుకు వైసీపీ ఆయన భార్య దాసరి పద్మను బరిలోకి దింపింది. టీడీపీ కూడా అభ్యర్థిని ప్రకటించి ప్రచారం చేస్తోంది. అయితే ఇక్కడ పోటీ చేసేందుకు బీజేపీ-జనసేనలు అభ్యర్థి కోసం కొన్ని రోజులుగా సమావేశం నిర్వహిస్తున్నాయి. చివరికగా తమ అధిష్టానం ఆదేశాల మేరకు ఏ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టాలో నిర్ణయించి చెబుతామని బీజేపీ తెలిపింది.

కానీ జనసేన అధినేత మాత్రం అనూహ్యంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ తమ పార్టీ నుంచి ఎవరూ పోటీ చేయరని తెలిపారు. బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఒత్తిళ్లు ఉన్నా రాజకీయ విలువల కోసం బరి నుంచి తప్పుకున్నామని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఆయన భార్యను పోటీలో ఉంచారన్నారు. ఆమెను గౌరవించే పోటీ నుంచి తప్పుకుంటున్నామని పవన్ ప్రకటించారు. మరి బీజేపీ అభ్యర్థి పోటీలో దిగితే ఆయనకు మానవత్వం లేదన్నట్లుగా భావిస్తారా..? అని బీజేపీ నాయకులు లోలోపల అనుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని బీజేపీతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది అని కొందరు బీజేపీ నాయకులు అనుకుంటున్నారు.

బద్వేలు ఉప ఎన్నికపై ఉమ్మడి ప్రకటన చేసి ఉంటే ఇరు పార్టీలకు గౌరవం ఉండేదని అనుకుంటున్నారు. అయితే కొన్ని రోజులుగా పవన్ సొంతంగానే పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రధానంగా చేసుకొని వాటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వంపై పోరాడేందుకు ఇతర పార్టీల సాయం కోరామని, అయితే ఎవరూ ముందుకు రాలేదని పవన్ అన్నారు. దీంతో తాను వైసీపీకి భయపడేది లేదని ఒంటరిగానే ప్రజా సమస్యలపూ పోరాడుతామని అంటున్నారు.

ఇదిలా ఉండగా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులపై ప్రజల్లో జనసేనపై సానుభూతి పెరుగుతోంది. ఇందులో భాగంగా మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన నాయకులు చాలా మంది గెలుపొందారు. దీంతో జనసేనకు ఆదరణ లభిస్తోందని భావిస్తున్న ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా స్వయంగానే ప్రజా సమస్యలపై పోరాడాలని పవన్ కు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే బద్వేలు ఉప ఎన్నికపై పవన్ ఒంటరిగానే పోటీలో లేమని ప్రకటన చేశాడని అంటున్నారు.

మొన్నటి వరకు బీజేపీతో కలిసి ఉన్న జనసేన నాయకులు ఇప్పడు ఆ పార్టీకి దూరమవుతున్నారు. రాబోయే రోజుల్లోనూ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు. సమస్య ఏదైనా పవన్ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్టీలో పవన్ వన్ మేన్ షో గా మారిపోయారు. రాబోయే రోజుల్లో కూడా పవన్ పై అదరణ పెరగడంతో పార్టీకి లాభం చేకూరవచ్చని అనుకుంటున్నారు.