Begin typing your search above and press return to search.

‘కడియం’పై పవన్ సీరియస్ వార్నింగ్.. తేడా వస్తే సీన్లోకి వచ్చేస్తారట

By:  Tupaki Desk   |   22 Sep 2021 2:47 AM GMT
‘కడియం’పై పవన్ సీరియస్ వార్నింగ్.. తేడా వస్తే సీన్లోకి వచ్చేస్తారట
X
ఏపీలో ఇటీవల విడుదలైన పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ విజయ దుందుబి మోగించటం తెలిసిందే. తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన అధికార పార్టీ.. ప్రతి జిల్లాల్లోనూ తన సత్తా ఎంతన్నది చాటి చూపింది. అధికార పార్టీ అధిక్యతను గుర్తించిన విపక్ష టీడీపీ.. ఎన్నికల సమయంలో.. బహిష్కరణస్త్రాన్ని సంధించినప్పటికీ..కొందరు టీడీపీ నేతలు బరిలోకి దిగటం తెలిసిందే. మొత్తంగా పరిషత్ ఎన్నికల వేళ.. టీడీపీ చేతులు ఎత్తేయటం.. వైసీపీకి అడ్డు లేకుండా పోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎన్నికల్లో పెద్దగా బలం లేని జనసే.. రాష్ట్ర వ్యాప్తంగా 180 స్థానాల్ని గెలుచుకోవటం ఆసక్తికరంగా మారింది.

అన్నింటికి మించి కడియం మండలాధ్యక్ష పదవిని ఆ పార్టీ సొంతం చేసుకునే పరిస్థితి రావటం ఇప్పుడు అందరి చూపు దాని మీద పడుతోంది. కడియం మండలంలో అత్యధిక జనసేన అభ్యర్థులు విజయం సాధించటంతో.. ఈ మండలాధ్యక్ష పదవిని ఆ పార్టీకి చెందిన వారు సొంతం చేసుకోవటానికి వీలుంది. అయితే.. అధికార పార్టీకి చెందిన వారు.. తమ పార్టీ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. తమ అధిక్యతను గుర్తించేందుకు ఇష్టపడకపోగా.. పోలీసుల సాయంతో ఒత్తిళ్లు తీసుకొచ్చి.. పార్టీ మారాలని చెబుతున్నట్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండల జెడ్పీ స్థానంతో పాటు.. అత్యధిక ఎంపీటీసీ స్థానాల్ని జనసేన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న (శుక్రవారం) జరిగే మండలాధ్యక్ష పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందని.. ఈ నేపథ్యంలో పార్టీ నేతలపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తోందని పవన్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గెలిచిన అభ్యర్థుల కుటుంబాల మీద తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చి.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు.

అధికార వైసీపీ ఇన్ని స్థానాలు గెలుచుకొని.. జనసేన గెలిచిన ఒక్క కడియంను వదిలి పెట్టకుండా.. దాన్ని కూడా తామే సొంతం చేసుకోవాలనుకోవటం దుర్మార్గమని.. ఒకవేళ అలాంటి ప్రయత్నమే చేస్తే.. అడ్డుకోవటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు పవన్ కల్యాణ్. న్యాయంగా తాము గెలుచుకున్న కడియం ఎంపీటీసీని తమకు చెందకుండా అడ్డుకుంటే మాత్రం.. తాము తీవ్రంగా పోరాడతామని.. అవసరమైతే ఆ రోజు తానే స్వయంగా వస్తానని పార్టీ నేతలకు అభయమిచ్చారు పవన్ కల్యాణ్. తానే నేరుగా వెళ్లి.. తేల్చుకుంటానన్నారు. అలాంటి పరిస్థితి ఎదురైతే.. అందుకు డీజీపీ.. ఏపీ ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే.. కేంద్ర హోంశాఖకు తాను కంప్టైంట్ చేస్తానని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. దీంతో.. కడియం ఎంపీటీసీ ఎన్నికల ఎలా సాగుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.