Begin typing your search above and press return to search.

పార్టీని న‌డ‌ప‌డం ఆషామాషీ కాదు.. జ‌న‌సేనాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   7 July 2021 4:30 PM GMT
పార్టీని న‌డ‌ప‌డం ఆషామాషీ కాదు.. జ‌న‌సేనాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అత్యంత సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ప్ర‌శ్నిస్తానంటూ.. 2014 ఎన్నిక‌ల‌కుముందు ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి సొంత‌గా పార్టీ పెట్టుకున్న ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు..రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఒక రాజ‌కీయ పార్టీని న‌డిపించ‌డం అంత ఆషా మాషీ విష‌యం కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ``ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో.. రాజ‌కీయ పార్టీని న‌డిపించ‌డం.. అత్యంత స‌వాళ్ల‌తో కూడుకున్న విష‌యం. అయిన‌ప్ప‌టికీ.. మేం అనేక స‌వాళ్ల‌ను ఎదురొడ్డి నిలుస్తున్నాం. ప్ర‌జ‌ల‌తోనే జ‌న‌సేన ఉంటుంది. ప్ర‌జ‌ల కోసం పోరాడుతుంది!`` అని పేర్కొన్నారు.

మంగ‌ళ‌గిరిలో బుధ‌వారం జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మాట్లాడారు. తిరుప‌తి ఉప ఎన్నిక త‌ర్వాత‌.. తొలిసారి ఏపీలో అడుగు పెట్టిన ప‌వ‌న్‌కు పార్టీ కార్య‌క‌ర్త‌లు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లో ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం.. జ‌న‌సేన క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు.. స‌మాజానికి సేవ చేయ‌డం ద్వారా ప్ర‌జ‌లు పార్టీపై ఉంచిన విశ్వాసాన్ని చూర‌గొనాల‌ని.. కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ కూడా ఆత్మ స్థ‌యిర్యాన్ని కోల్పోవ‌ద్ద‌ని ప‌వ‌న్ కోరారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌తోనే ఉండాల‌ని సూచించారు..

``క‌రోనా క‌ష్ట‌కాలంలో జ‌న సైనికులు ప్ర‌జ‌ల‌తోనే ఉన్నారు. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అనేక సేవ‌లు అందించారు. ఈ క్ర‌మంలో కార్య‌క‌ర్త‌లు కూడా క‌రోనా బారిన ప‌డి అనేక మంది మృతి చెందారు. ఇది న‌న్ను తీవ్రంగా క‌లిచి వేసింది`` అని ప‌వ‌న్ అన్నారు. ఈ స‌మ‌యంలో పార్టీ కార్య‌క‌ర్త‌లకు ఇన్సూరెన్స్ స‌దుపాయాన్ని లక్ష మందికి వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అదేవిధంగా వ్య‌క్తిగ‌తంగా తాను ఇన్సూరెన్స్ కోసం కోటి రూపాయ‌లు వెచ్చించ‌నున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఏ చిన్న క‌ష్టం వ‌చ్చినా.. తాను అండ‌గా నిలుస్తాన‌ని అన్నారు. దీనికి ముందు.. క‌రోనాతో మ‌ర‌ణించిన వారి ఆత్మ‌ల‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుతూ.. కొన్ని నిముషాల పాటు మౌనం పాటించారు. క‌రోనాతో మృతిచెందిన‌.. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌.. ఆకుల సోమేష్ కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును ప‌వ‌న్ అందించారు.