Begin typing your search above and press return to search.

సీఎం జగన్ కు పవన్ ప్రశ్న.. లోపం మీదా? మీ నీడలోని వ్యవస్థదా?

By:  Tupaki Desk   |   6 Jan 2021 5:02 PM IST
సీఎం జగన్ కు పవన్ ప్రశ్న.. లోపం మీదా? మీ నీడలోని వ్యవస్థదా?
X
ఏపీలో జరుగుతున్న దేవాలయాల దాడులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి రియాక్టు అయ్యారు. గడిచిన రెండేళ్ల వ్యవధిలో రాష్ట్రంలోని వందకు పైగా దేవాలయాలపై దాడులు జరిగినట్లుగా ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రథాల్ని దగ్థం చేయటం.. దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం చేస్తున్నారని.. ఈ ఆరాచకం మీద మాట్లాడితే.. ప్రతిపక్షాలు రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ నడిపిస్తున్నాయంటూ సీఎంజగన్ వ్యాఖ్యానించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

జగన్ ఇలా మాట్లాడటం బాధ్యత నుంచి తప్పించుకోవటమే అన్న ఆయన.. ‘‘సీఎం స్థానంలో ఉన్న ఆయన ఆధారాలు లేకుండా మాట్లాడితే జనం హర్షించరు. సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోస్టులు పెట్టే వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెట్టేస్తారు. ఆలయాల్లో విగ్రహాల్ని ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవటం విడ్డూరం’’ అని మండిపడ్డారు.

జగన్ ను అత్యంత శక్తివంతులుగా పోల్చిన పవన్ కల్యాణ్.. వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఎంతటి శక్తివంతులో దేశ ప్రజలందరికి తెలుసు. మీపై గెరిల్లా వార్ ఫేర్ చేయటానికి ఎవరు సాహసిస్తారు? 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు.. 115 మంది ఐపీఎస్ లు.. మరో 115 మంది అదనపు ఎస్పీలు.. వేలాది మంది పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు. ఇంత మంది ఉండి కూడా విగ్రహాల్ని ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవటం విడ్డూరంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించారు కదా? వారు కూడా సమాచారం ఇవ్వలేకపోతున్నారా? అని ప్రశ్నించారు. ‘‘లోపంఎక్కడ ఉంది? మీలోనా? మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా? ప్రతిపక్షాల్ని ఒకే గాటన కట్టి దుష్ప్రచారం చేస్తున్నాయని మీరు చెప్పటం చూస్తే.. ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుగా ఉందన్నారు. రెండేళ్లుగా సహనంగా ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. మాటలు కట్టి పెట్టి ఇకనైనా దోషుల్ని పట్టుకొని ప్రజల ముందు నిలబెట్టే పనిలో ఉంటే మంచిదన్నారు. పవన్ తాజా వ్యాఖ్యలపై ఏపీ అధికారపక్షనేతలు ఏ రీతిలో స్పందిస్తారో చూడాలి.