Begin typing your search above and press return to search.

ప్రెసిడెంట్ మెడల్ ఎందుకు..సీఎం మెడల్ అని తీసుకొచ్చేస్తే పోలా పవన్ పంచ్

By:  Tupaki Desk   |   6 Dec 2020 4:25 AM GMT
ప్రెసిడెంట్ మెడల్ ఎందుకు..సీఎం మెడల్ అని తీసుకొచ్చేస్తే పోలా పవన్ పంచ్
X
ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయం కింద రూ10వేలు ఇచ్చి.. ఎకరాకు రూ.35వేల పరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము డిమాండ్ చేసినట్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాని పక్షంలో రేపు (డిసెంబరు 7న) అన్నిజిల్లాల్లో జనసేన నిరసన దీక్షలు చేపడుతుందని చెప్పారు.

నెల్లూరు జిల్లాలోని కోవూరు.. గూడురు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. రైతులు.. చేనేతల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు రూ.35వేల పరిహారం జనసేన కోసం కాదని.. రైతుల కోసమన్న ఆయన.. తక్షణ సాయం ప్రకటించిన కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలన్నారు.

ఈ సందర్భంగా పవన్ కొన్ని పవర్ ఫుల్ పంచ్ లు వేశారు. రాష్ట్రంలో విడతల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి.. చివరకు ప్రభుత్వమే మద్యాన్ని అమ్మటాన్ని తప్పు పట్టారు. బూమ్.. సుప్రీం.. ప్రెసిడెంట్ మెడల్.. ఆంధ్రా గోల్డ్ అంటూ కొత్త కొత్త బ్రాండ్లతో మద్యాన్ని అమ్ముతున్నారన్నారు. బంగారు తెలంగాణ విన్నాం కానీ బంగారు ఏపీ అంటూ మద్యానికి బ్రాండ్ పేరుగా పెట్టటం ఏమిటని ప్రశ్నించిన ఆయన.. ఆంధ్రా గోల్డ్ అంటే అది మద్యం బ్రాండ్ అని తాను అనుకోలేదన్నారు.

చిత్రవిచిత్రమైన పేర్లతో మద్యం బ్రాండ్లను తీసుకొస్తున్న ప్రభుత్వ తీరును తప్పుపట్టిన పవన్ కల్యాణ్.. సీఎం మెడల్.. వైసీపీ స్పెషల్ లాంటి పేర్లు పెట్టి మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలంటూ మండిపడ్డారు. హైదరాబాద్ మహానగర ఎన్నికల్ని నగర ఎన్నికలుగా ఓటర్లు చూడలేదని.. విశ్వనగర ఎన్నికలుగా చూశారన్నారు. తాజా ఎన్నికల తీర్పు చూస్తే.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం స్పష్టమైందని చెబుతున్నారు.