జనసేనాని పవన్ కళ్యాణ్ నాకు భయం లేదు అంటారు. ఆయన రాజకీయం సెపరేట్ అని కూడా చెబుతారు. తాను ప్రజల కోసం వారి సమస్యల సాధన కోసం ఉన్నానని ఇప్పటికి అనేకసార్లు చెప్పుకున్నారు. ఇపుడు పవన్ కి సరైన సవాల్ ఎదురైంది అంటున్నారు. పవన్ ఒక వైపు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంటే మిత్ర పక్షం అన్న మాట. ఆ ప్రభుత్వం కేంద్రంలో ప్రైవేటీకరణను కఠినంగా అమలు చేస్తోంది. అదొక పాలసీగా పెట్టుకుని మరీ ముందుకు సాగుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గట్టిగా గర్జించి అయిదు దశాబ్దాలు నిండా కాలేదు. ఈ లోగానే నిండు నూరేళ్లూ విశాఖ ఉక్కుకు నిండిపోయేలా చేస్తోంది కేంద్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసి తీరుతామని అంటున్నారు.ఈ విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ్ మాట్లాడుతూ తమ ఆధీనంలోని పరిశ్రమను తాము ప్రైవేటీకరిస్తామని కూడా పక్కాగా క్లారిటీ ఇచ్చేశారు.
అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం కోసం తొమ్మిది నెలలుగా కార్మికులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తూనే ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించమని ఈ మధ్య దాకా ఏపీ బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. సోము వీర్రాజు అయితే ఒక అడుగు ముందుకేసి ప్రైవేటీకరణ అన్నది ఉండదని అన్నారు. కానీ జరుగున్నది వేరుగా ఉంది. మరి ఈ సమయంలో విశాఖకు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఆయన విశాఖ ఉక్కు మీద గట్టిగా మాట్లాడుతారు అంటున్నారు. విశాఖ ఉక్కుని పరిరక్షించాల్సిందే అని నినదిస్తారని కూడా జనసైనికులు చెబుతున్నారు. కానీ విశాఖ ఉక్కుని ఎవరు రక్షించాలి. ఎవరు ప్రైవేటీకరణను ఆపగలరు అంటే అందరికీ తెలిసిన విషయమే. అది కేంద్రం చేతిలో ఉంది. ప్రధాని మోడీ ఒక్కరే దాన్ని ఆపగలరు, ఆయన కనుక తలచుకుంటే అయిదు నిముషాల్లో విశాఖ ఉక్కు ఉరి కంబం నుంచి తప్పుకుంటుంది.
అయితే పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలను కలిశారని, ఫిబ్రవరి 9న ఆయన కేంద్ర మంత్రి అమిత్ షాను కలసి విశాఖ ఉక్కుని కాపాడాలని కోరారని జనసైనికులు చెబుతున్నారు. మరి పవన్ కోరారు, కానీ కేంద్రం తీరు వేరుగా ఉంది కదా, ఈ రోజుకు మరిన్ని అడుగులు ముందుకు వేస్తూ ప్రైవేటీకరణకు నడుం బిగిస్తోంది కదా, ఈ సమయంలో పవన్ విశాఖలో గర్జిస్తే కేంద్రానికి వినిపిస్తుందా అన్న చర్చ కూడా ఉంది. అయితే పవన్ విశాఖ సభలో ఏం చెబుతారు అన్నది కూడా చూడాలని అంటున్నారు. పవన్ కనుక విశాఖ ఉక్కు మీద చిత్తశుద్ధితో వ్యవహరించదలుచుకుంటే కచ్చితంగా కేంద్రాన్ని ఆయన విమర్శించాలి. అదే సమయంలో మిత్ర పక్షంగా బీజేపీని నిలదీయాలి. మోడీని తక్షణం ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేయాలి.
అలా కనుక చేస్తే పవన్ ఏపీలో బహు మొనగాడే అవుతారు అంటున్నారు. కానీ పవన్ అలా కాకుండా ఏపీలోని వైసీపీ సర్కార్ని విమర్శించి వారి వల్లనే ప్రైవేటీకరణ జరుగుతోంది అన్న మాట అంటే అది ఫక్తు రాజకీయ ప్రసంగంగానే భావించాలి అంటున్నారు. మొత్తానికి పవన్ ఎలా మాట్లాడుతారు, ఆయన విశాఖ ఉక్కు విషయంలో కేంద్రంలో అమీ తుమీ తేల్చుకుంటారా లేక కేంద్రానికి ఒక విన్నపం చేసేసి యధా ప్రకారం వైసీపీ మీద నిప్పులు చెరుగుతారా అన్న చర్చ ఉంది. అదే జరిగితే ఉక్కు కర్మాగారానికి ఒరిగింది ఏమీ ఉండదు అని కార్మికల లోకం కూడా అంటోంది. మరి పవన్ ఆవేశం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.