Begin typing your search above and press return to search.

ఉత్తరాంద్రాలో పవన్ మానియా... ?

By:  Tupaki Desk   |   14 April 2022 12:30 PM GMT
ఉత్తరాంద్రాలో పవన్ మానియా... ?
X
ఉత్తరాంధ్రాలో గతంలో మూడుగా ఉండేవి, ఇపుడు ఆరు జిల్లాలు అయ్యాయి. . ఇక ఒకపుడు టీడీపీకి కంచుకోటలు ఈ జిల్లాలు. 2019 ఎన్నికలలో వైసీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఇక 2024 ఎన్నికలు వస్తున్నాయి. దాంతో ఉత్తరాంధ్రా జిల్లాలు ఏ రకమైన పొలిటికల్ రూట్ తీసుకుంటాయి అన్న చర్చ సాగుతోంది. ఉత్తరాంధ్రా జిల్లాలు రాష్ట్ర రాజకీయాన్ని నిర్దేశించే స్థితిలోనే ఎపుడూ ముందుటాయి.

బీసీల జిల్లాలుగా వీటికి పేరు. ఇక కాపులు కూడా ఇక్కడ ఎక్కువ. ఇవన్నీ పక్కన పెడితే 2019 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన జనసేన అనుకున్న విధంగా రాణించలేకపోయింది.కానీ ఈసారి మాత్రం ఆ పార్టీ ఆశలు ఫలించే సూచనలు కనిపించబోతున్నాయి అంటున్నారు. బడా రాజకీయ కుటుంబాలకు చెందిన వారసులు జనసేన వైపు చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది.

ముందుగా శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే బొడ్డేపల్లి రాజగోపాల్, సర్ధార్ గౌతు లచ్చన్న వంటి రాజకీయ దిగ్గజాలు ఈ జిల్లాలో ఒకనాడు హవా చాటారు. ఇపుడు వారి వారసులు వేరే పార్టీలలో ఉన్నారు. అలాగే టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు రాజకీయం కూడా ఈ జిల్లా నుంచే సాగుతోంది. ఇపుడు కళా వెంకటరావు వారసులతో పాటు పైన చెప్పుకున్న కుటుంబాల వారసులు, అనుచరుల చూపు జనసేన మీద పడింది అంటున్నారు.

అదే విధంగా విజయనగరం జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి పడాల అరుణ, మాజీ విప్ గద్దె బాబూరావు, తెంటు లక్షుంనాయుడు జనసేనలోకి రావాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడ అధికార పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడి పట్టు గట్టిగా ఉంది. ఆయన చూపు ఇటు పడితే మాత్రం మొత్తం రాజకీయ సమీకరణలు మారిపోతాయని చెబుతున్నారు. విశాఖ జిల్లాలో చూసుకుంటే అధికార వైసీపీ తో సహా కీలకమైన నాయకులు మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది జనసేనలోకి వెళ్ళాలనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ఇక విశాఖ జిల్లాలో ఒక మాజీ మంత్రి జనసేన బలోపేతం చేయడానికి తెర వేనక గట్టిగానే చక్రం తిప్పుతున్నారు అని అంటున్నారు. అదే విధంగా ఈ ఆరు జిల్లాల్లో మాజీ జెడ్పీటీసీలు, మాజీ వార్డు మెంబర్స్, మాజీ కార్పోరేటర్లు ఇపుడు పెద్ద సంఖ్య‌లో జనసేన వైపుగా క్యూ కడుతూండడం కీలక పరిణామంగా చూడాల్సిందే.

అలాగే, అనకాపల్లి జిల్లా నుంచి ఒక మాజీ మంత్రి జనసేనలోకి వస్తారు అని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే మాత్రం ఉత్తరాంధ్రాలో జనసేన జెండా గొప్పగా ఎగరడం ఖాయమనే అంటున్నారు. రాజకీయాల్లో ఇపుడున్న పరిస్థితుల్లో అన్ని పార్టీలను చూసేసిన వారు ఇక మీదట జనసేన వేదికగా రాజకీయాలు చేయడం బెస్ట్ అనుకోవడం వల్లనే ఈ మార్పు అంటున్నారు. సో పవన్ మానియాతో ఉత్తరాంధ్రా ఊగుతోంది అని అంటున్నారు. కొద్ది నెలలలో రాజకీయ ప్రకంపనలు ఈ జిల్లాల్లో మొదలవుతాయని అంటున్నారు.