Begin typing your search above and press return to search.

జగన్ పాలనపై స్పందనకూ..పీకేకు ముహూర్తం కావాల్సిందేనా?

By:  Tupaki Desk   |   7 Sep 2019 10:10 AM GMT
జగన్ పాలనపై స్పందనకూ..పీకేకు ముహూర్తం కావాల్సిందేనా?
X
ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పుడే తన వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. జగన్ వంద రోజుల పాలనపై ప్రశంసలు కురిపిస్తూ వైసీపీ నేతలు - తెగడుతూ టీడీపీ నేతలు... నిన్ననే ఎవరికి తగిన రీతిలో వారు స్పందించారు. అయితే జగన్ పై ఇప్పుడు తనదైన శైలిలో విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రం జగన్ వంద రోజుల పాలనపై స్పందించేందుకు ఓ మంచి ముహూర్తం కావాల్సిందేనట. ఇదేదో పవన్ ప్రత్యర్థులు చెబుతున్న మాట కాదు. స్వయంగా పవనే చెప్పిన మాట ఇది. జగన్ తీసుకుంటున్న ఏ ఒక్క నిర్ణయంపై పెద్దగా స్పందించని పవన్... కేవలం ఒక్క రాజధాని అమరావతిపై తీసుకున్న నిర్ణయంపైనే ఇప్పటిదాకా స్పందించారు.

ఈ క్రమంలో జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన పాలన ఎలా సాగిందన్న విషయంపై మాట్లాడేందుకు పవన్ నిరాకరించారు. జగన్ వంద రోజుల పాలనపై తాను ఈ నెల 14న స్పందిస్తానని - జగన్ పాలనపై స్పందించేందుకు ఆ రోజుననే తాను ముహూర్తం పెట్టుకున్నానని కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జగన్ వంద రోజుల పాలన ఎలా సాగిందన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకు తమ పార్టీ తరఫున ఓ కమిటీని నియమించానని చెప్పిన పవన్... ఆ కమిటీ తన నివేదికను ఓ రెండు మూడు రోజుల్లో తనకు అందజేయనుందని కూడా చెప్పారు. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత ఈ నెల 14న జగన్ వంద రోజుల పాలనపై స్పందిస్తానని పవన్ పేర్కొనడం నిజంగానే ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

జగన్ పాలనపై పవన్ తన స్పందనకు టైం ఫిక్స్ చేసుకోవడం నిజంగానే ఆసక్తిరంగానే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కారు ఇప్పటిదాకా తీసుకున్న ఏ ఒక్క నిర్ణయంపైనా పవన్ స్పందించిన దాఖలా లేదనే చెప్పాలి. రాజధాని అమరావతిపై జగన్ కేబినెట్ లోని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మాత్రమే పవన్ స్పందించారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామంటే ఒప్పుకునేది లేదని - రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల తరఫున పోరాటం చేస్తానని పవన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి జగన్ వంద రోజుల పాలనపై ఈ నెల 14న స్పందిస్తానన్న పవన్... ఆ రోజు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న ఆసక్తి నెలకొంది.