జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సందర్బంగా మనోళ్ల కోసం కీలకమైన అంశంపై స్పందించారు. హెచ్-1బీ వీసాల వ్యవహారంలో ట్రంప్ సర్కారు అవలంబిస్తున్న కఠిన నిబంధనలతో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలని కోరుతూ భారత ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. అమెరికాలో ఉన్న భారతీయులకు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వలసవాదుల పట్ల అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన వైఖరితో ఉద్యోగాలు - వ్యాపారాలు చేస్తున్న భారత సంతతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని - అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేదోడువాదోడుగా నిలుస్తున్న భారత సంతతి ప్రజల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందని ఆ లేఖలో పేర్కొన్నారు. అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనల కారణంగా వీరంతా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.
స్వేచ్ఛాయుత మార్కెట్ కు కేంద్రంగా మారిన అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్ ను ఆకర్షించిందనీ - భారతీయులు కూడా అదే రీతిలో ఆ దేశానికి వలస వెళ్లారని పేర్కొన్నారు. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలతో.. ప్రవాస భారతీయులును అంటరాని వారిగా, శత్రువులుగా చిత్రించే ప్రయత్నాలకి చట్టబద్దత కల్పించినట్లు అయ్యిందన్నారు. ఎందరో భారతీయులు తమకు తెలియకుండానే ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకున్నారని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థని పరిపుష్టం చేయడంలో కీలకపాత్ర పోషించిన ప్రవాసుల జీవితాలు వారి ప్రమేయం లేకుండానే వివిధ మార్పులకి లోనయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాల వల్ల అమెరికాలో ఎన్నో ఏళ్లుగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు - వారి మీద ఆధారపడినవారు - గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు - వ్యాపారవేత్తలు - విద్యార్థులు - భార్యా-భర్తలు - వారి పిల్లలు అమెరికా ప్రభుత్వానికి లక్ష్యంగా మారిపోయారని పేర్కొన్నారు. ప్రయోగాత్మక విధానాలతో అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం అవరోధాల్ని అదధిగమించిందేమోగానీ దాని వల్ల భారతీయుల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపర్చడంలో - స్వేచ్ఛను ప్రసాదించడంలో విఫలమైందని తెలిపారు.