Begin typing your search above and press return to search.

చంద్రబాబు శ్రేయస్సే..జనసేన అజెండానా!

By:  Tupaki Desk   |   31 Aug 2019 5:54 AM GMT
చంద్రబాబు శ్రేయస్సే..జనసేన అజెండానా!
X
రాజధాని విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయంతో పనిలేనట్టుగా - చంద్రబాబు నాయుడు మేలే తన ప్రయోజనం అన్నట్టుగా జనసేన అధిపతి పవన్ కల్యాణ్ వ్యవహరిస్తూ ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడంతా చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడే పవన్ కల్యాణ్ బయటకు వచ్చేవారు. జనాలను డైవర్ట్ చేయడానికి - చంద్రబాబు మీద ప్రజల వ్యతిరేకతను తగ్గించేందుకు పవన్ కల్యాణ్ ఒక మాత్రలా పని చేశాడనే విశ్లేషణలు వినిపించాయి.

అందుకు అందాల్సిన ప్రతిఫలం పవన్ కల్యాణ్ కు అందనే అందిందంటారు. అదే ఎన్నికల్లో చిత్తైన ఓటమి. ఆఖరికి ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు పవన్ కల్యాణ్. ఒకటికి రెండు చోట్ల పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన పార్టీ రాష్ట్రమంతా తుడిచిపెట్టుకుపోయింది. అదంతా చంద్రబాబుకు వంత పాడటం వల్లనే అనే విశ్లేషణలు ఎన్నికల తర్వాత గట్టిగా వినిపించాయి.

అయితే ఇప్పటికీ పవన్ కల్యాణ్ తీరులో మాత్రం మార్పులేదు. రాజధాని వ్యవహారంలో పవన్ కల్యాణ్ స్పందన అంతా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం వంత పాడుతున్నట్టుగా ఉందనే టాక్ మొదలైంది. రాజధాని ఏరియాలో తెలుగు దేశం ముఖ్యనేతలు భారీగా భూములు కొనుగోలు చేశారని - ఇప్పుడు రాజధాని మార్చితే వారి భూముల విలువలో భారీగా పతనం నమోదువుతుందని వారు టెన్షన్ పడుతున్నారని సామాన్య ప్రజానీకం చర్చించుకుంటున్నారు.

అందుకే తెలుగుదేశం పార్టీ రాజధాని విషయంలో ఆందోళనలు అంటోందనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ కూడా తెలుగుదేశానికి తానా తందానా అనడం ఆయన కూడా చంద్రబాబు పార్టీనే అనే అభిప్రాయలకు ఆస్కారం ఏర్పడుతూ ఉంది. ఎన్నికలు అయిపోయి ఎన్నో రోజులు కాలేదు. ఇంతలోనే తెలుగుదేశం పార్టీ తెగ ఇదైపోతోంది. అదే ఆవేదనను పవన్ కల్యాణ్ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు.

ఇదంతా చూస్తుంటే.. పవన్ తీరులో మార్పు లేదు - ఆఖరికి ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు అవసరాల మేరకే పవన్ పని చేస్తున్నాడనే అభిప్రాయాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో మరో విషయాన్ని కూడా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పవన్ మీడియాను చూసే సరికే ఆవేశంగా మాట్లాడటం - ఆ తర్వాత ఆ వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టేయడం గతంలో కూడా జరిగిందని.. ఇప్పుడూ అదే జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవద్దని వారు అంటున్నారు!