Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ లోని గోపీ ఇవాళ కూడా బ‌య‌ట‌కు వ‌స్తాడా?

By:  Tupaki Desk   |   31 July 2017 4:53 AM GMT
ప‌వ‌న్ లోని గోపీ ఇవాళ కూడా బ‌య‌ట‌కు వ‌స్తాడా?
X
నోరు విప్పితే సూక్తిముక్తావ‌ళి మాటలు మాట్లాడ‌టం ఇప్ప‌టి రాజ‌కీయ నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. గ‌తంలో మాదిరి కాకుండా.. త‌మ‌ను తాము ఇంట‌లెక్చువ‌ల్స్ గా చూపించుకోవ‌టం.. త‌మ‌లోని ఉదాత్త గుణాల్ని త‌మ మాట‌ల ద్వారా చెప్పుకునే వైఖ‌రిని కొంద‌రు అధినేత‌లు ప్ర‌ద‌ర్శిస్తుంటారు. మాట‌ల‌కు.. చేత‌ల‌కు ఏ మాత్రం పొంత‌న లేని ఈ తీరు ఉన్న నేత‌ల విష‌యానికి వ‌స్తే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బెస్ట్ ఎగ్జాంఫుల్ గా చెప్పాలి.

వ్య‌క్తిత్వ వికాస నిపుణుడి త‌ర‌హాలు మాట‌లు చెప్పే మోడీ.. చేత‌ల విష‌యానికి వ‌స్తే ఎంత‌లా వ్య‌వ‌హ‌రిస్తారో ఇట్టే చెప్పేయొచ్చు. నీతులు వ‌ల్లించే ఆయ‌న‌.. ప‌వ‌ర్ కోసం ఎంత‌కైనా రెఢీ అన్న విష‌యం తాజాగా బీహార్ ఎపిసోడ్ తేల్చేసింది. అవినీతి ఆరోప‌ణ‌ల మీద లాలూకు తాను మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని చెప్పిన నితీశ్‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లోనూ.. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన స‌మ‌యంలోనూ తాను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిన మోడీతో చేతులు క‌ల‌ప‌టం చూస్తే.. నోటి మాట‌ల‌కు.. చేసే ప‌నుల‌కు ఏమాత్రం పొంత‌న ఉండ‌ద‌ని చెప్పాలి.

జాతీయ రాజ‌కీయాల్ని కాసేపు ప‌క్క‌న పెడ‌దాం. తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లోకి వ‌ద్దాం. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ముచ్చ‌ట కూడా ఇంచుమించు ఇదే రీతిలో ఉంటుంది. ఒక్కోసారి త‌ర‌చూ క‌నిపించే ఆయ‌న‌.. మ‌రికొన్ని సార్లు అస్స‌లు ప‌త్తానే ఉండ‌దు. దానికి సినిమాల‌ని.. మ‌రేదో కార‌ణ‌మ‌ని చెప్పినా.. ఎప్పుడేం చేస్తారో అర్థం కాని అనిశ్చితి ఉన్న నాయ‌కుడిగా పేరొందారు.

తాను ఎప్పుడు ఎక్క‌డ ఉన్న‌ప్ప‌టికీ రెండు రాష్ట్రాల్లో చోటు చేసుకునే ప‌రిణామాల మీద ఒక క‌న్నేసి ఉంచుతాన‌ని చెప్పే ప‌వ‌న్‌.. చాలాసంద‌ర్భాల్లో నోటి నుంచి మాట బ‌య‌ట‌కు వ‌చ్చిందే లేద‌ని చెప్పాలి. ఏపీలో ఇప్పుడు ఇష్టారాజ్యంగా వెల‌సిన మ‌ద్యం షాపుల‌పై మ‌హిళ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. బాబు స‌ర్కారు తీరును వారు తిట్టి పోస్తున్నారు. అయిన్ప‌టికీ ఇంత‌వ‌ర‌కూ ఆ విష‌యం మీద ప‌వ‌న్ మాట్లాడింది లేదు. అదొక్క విష‌య‌మే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన విశాఖ భూ కుంభకోణం గురించి కావొచ్చు.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో మరోసారి భూసేక‌ర‌ణకు సంబంధించి ఉదంతం కావొచ్చు.. ఏ విష‌యంలోనూ ప‌వ‌న్ మాట్లాడింది లేదు.

అక్వా మెగా ఫుడ్ పార్క్ విష‌య‌మే చూద్దాం. త‌న‌కు తానుగా పిలిపించుకొని.. బాధితుల‌తో మాట్లాడిన ప‌వ‌న్‌.. తాను ఆ విష‌యాన్ని చూస్తాన‌ని.. వెన‌క్కి త‌గ్గేది లేద‌ని.. ఎంత‌టి ఆందోళ‌న‌కైనా తాను సిద్ధ‌మ‌న్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. కానీ.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ విష‌యాన్ని ప్రస్తావిస్తే ఒట్టు. ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టిన‌ట్లుగా చెప్పుకునే ప‌వ‌న్‌.. త‌ర‌చూ గోడ మీద పిల్లి (గోపీ) వాటాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పాలి. ప్ర‌తి విష‌యానికి తాను చెప్పే దానికి చేసే దానికి ఏ మాత్రం పోలిక ఉండ‌ద‌న్న విష‌యాన్ని అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు.

అనంత‌పురం జిల్లా క‌ర‌వును ప‌రిశీలించ‌టానికి స్వ‌యంగా పాద‌యాత్ర చేస్తాన‌ని చెప్ప‌టం ద‌గ్గ‌ర నుంచి.. ఏపీకి ప్రాణాధార‌మైన ప్ర‌త్యేక హోదా విష‌యం మీదా అలుపెర‌గ‌ని పోరాటం చేస్తాన‌న్న ప‌వ‌న్‌.. ఆ ఊసులేమీ గ‌డిచిన కొద్ది రోజులుగా ప‌ట్ట‌న‌ట్లుగా ఉన్నారు. ఎందుకిలా అంటే కార‌ణం చెప్పరు. ఈ రోజు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో ఆయ‌న భేటీ కానున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి సీఎంతో మాట్లాడ‌నున్న ప‌వ‌న్‌.. సాయంత్రం మాత్రం మీడియా ముందుకు రానున్నారు.

వివిధ అంశాల మీద సూటిగా.. స్ప‌ష్టంగా స‌మాధానాలు చెప్ప‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజా మీడియా స‌మావేశంలో ఎలాంటి తీరును ప్ర‌ద‌ర్శిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న మార్క్ గోపీ తీరునే ఆయ‌న ప్ర‌ద‌ర్శిస్తారా? లేక‌.. గ‌డిచిన కొంత‌కాలంగా వివిధ అంశాలు చోటు చేసుకుంటున్నా.. త‌న‌కు ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన తీరుకు బాధ్య‌త‌గా స‌మాధానం చెబుతారా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా చెప్పాలి. వివిధ సంద‌ర్భాల్లో మీడియాతో హ‌డావుడిగా మాట్లాడి మ‌మ అనిపించే ప‌వ‌న్‌.. ఈసారి తానే మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో.. ప‌లు సందేహాల‌కు సంతృప్తిక‌ర స‌మాధానాలు చెప్పాల్సి ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంది. మ‌రి.. ఈ విష‌యంలో ప‌వ‌న్ తీరు ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.