Begin typing your search above and press return to search.

టీడీపీకి ప‌వ‌న్ ఏ స్థాయి వార్నింగిచ్చారంటే!

By:  Tupaki Desk   |   5 July 2018 12:37 PM GMT
టీడీపీకి ప‌వ‌న్ ఏ స్థాయి వార్నింగిచ్చారంటే!
X
ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఓ వైపు విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట సాంతం ప్ర‌జ‌ల్లోకే వెళ్లిపోగా... ఇప్పుడు టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ - జ‌న‌సేన అధినేత కూడా జ‌నంలోకి వెళ్లిన‌ట్లుగానే క‌నిపిస్తున్నారు. జ‌గ‌న్ మాదిరి నాన్ స్టాప్‌ గా యాత్ర‌లు చేసేంత స‌త్తా ప‌వ‌న్‌ కు లేకున్నా... త‌న యాత్ర సాగుతున్న కొద్ది ప‌వ‌న్ త‌న మాట‌లో ప‌దును పెంచేస్తున్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యానికి దోహ‌దం చేసిన ప‌వ‌న్‌... ఇప్పుడు అదే పార్టీ అప‌జ‌యమే లక్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. ప‌వ‌న్ తీసుకున్న వైఖ‌రితో బెంబేలెత్తిపోతున్న టీడీపీ నేత‌లు... అస‌లు ప‌వ‌న్‌పై ఏ విధమైన వైఖ‌రితో ముందుకు వెళ్లాల‌న్న విష‌యంపై అవ‌గాహ‌న లేక నానా యాగీ చేసుకుంటున్నారు. ఫ‌లితంగా త‌మ‌ను తామే ముద్దాయిలుగా నిలిపేసుకుంటున్నారు. త‌న‌పైకి దూసుకువస్తున్న టీడీపీ విమ‌ర్శ‌ల‌ను ప‌వ‌న్ కూడా త‌న‌దైన శైలిలో తిప్పికొడుతున్నారు. ఈ క్ర‌మంలో నానాటికీ టీడీపీపై ప‌వ‌న్ సంధిస్తున్న విమ‌ర్శ‌ల్లో వేడి పెరిగిపోతోంది.

ఈ క్ర‌మంలో నేటి యాత్ర‌లో భాగంగా ప‌వ‌న్ టీడీపీ నేత‌ల‌కు ఏకంగా గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలంటే ఏమైనా పైనుంచి దిగివచ్చారా? వాళ్లకు మేమేమైనా బానిసలమా? అంటూ ప‌వ‌న్ గ‌ట్టిగానే నిలదీశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అల్లుడు ఎవరైనా సరే రాజ్యాంగ పరిధికి లోబడే ఉండాలని హుకుం జారీ చేశారు. ఇష్టం వచ్చినట్లు దోపిడీ చేస్తామంటే.. చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోబోమని, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని పవన్... టీడీపీ నేత‌ల‌ను గ‌ట్టిగానే హెచ్చరించారు. తాను అన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, పోతే ప్రాణాలే పోతాయని ధైర్యంగా అడుగు వేశానని త‌న‌లోని సీరియ‌స్‌నెస్‌ను తెలిపే య‌త్నం చేశారు. రాజకీయ నాయకులు తలచుకుంటే ఒక్క సంతకంతో తలరాతలు మార్చేయవచ్చని తెలిపారు. టీడీపీ నేతల అన్యాయాలను, అక్రమాలను ఇలాగే మౌనంగా చూస్తూ కూర్చుంటే విశాఖలోని డాల్ఫిన్ కొండలను కూడా ఆక్రమించుకుంటారని అన్నారు. తప్పు చేస్తున్నవారిని తానెందుకు ప్రశ్నించకూడదని ప‌వ‌న్ ఓ లాజిక్ లాగారు. ఇక కులం విష‌యంపై మాట్లాడిన ప‌వ‌న్‌... టీడీపీ వాళ్లకు మాత్రమే కులం ఉండ‌ద‌ని కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. ఎవరు ఏ పార్టీ పెట్టినా వారికి కులం అంటగడతారా? టీడీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. జనసేనకు కులం అంటగడితే ఏకంగా కాళ్లు విరగ్గొడతానని ప‌వ‌న్‌ హెచ్చరించారు.

తన వద్ద డబ్బులు, మీడియా ఛానళ్లు లేవని..నిర్భయంగా పోరాడే సత్తా మాత్ర‌మే ఉందని పవన్ స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య కుమ్ములాటలు, మతాల మధ్య తగాదాలు, జాతుల మధ్య వైరాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. భారతీయతను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ జనసేన అని తెలిపారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు త‌న సోద‌రుడు మోగాస్టార్ చిరంజీవి తుపాకీ కొనిచ్చిన వైనం, కార‌ణాల‌ను కూడా ప‌వ‌న్ ప్ర‌స్తావించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తనకున్న ఆవేశానికి ఎక్కడ తీవ్రవాద ఉద్యమాల్లోకి పోతానోన‌ని తన సోదరుడు చిరంజీవి ఆందోళన చెందేవారని, ఓ తుపాకీ కొనిస్తే.. ఇంట్లోనే ఉంటాడని భావించి.. ఆనాడు తన అన్నయ్య తనకు ఓ తుపాకీ కొనిచ్చారని చెప్పారు. తన ఆవేదన, ఆవేశం అన్యాయం మీదనే తప్ప, తుపాకీ కోసం కాదని ఆనాడు తన అన్నకు వివరించలేకపోయానని కూడా ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ప్రజలకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తుంటే ప్రశ్నించకుండా ఎలా ఉంటామని ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తంగా నిన్న‌టిదాకా టీడీపీపై ఆరోప‌ణ‌లు మాత్ర‌మే చేస్తూ వ‌చ్చిన ప‌వ‌న్‌... ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకే వార్నింగులు ఇచ్చేసి సంచ‌ల‌నం రేపార‌ని చెప్పాలి.