Begin typing your search above and press return to search.

వారాహి తిరిగే రూట్లు...పరేషాన్ అవుతున్న తమ్ముళ్ళు

By:  Tupaki Desk   |   8 Jun 2023 12:08 PM GMT
వారాహి తిరిగే రూట్లు...పరేషాన్ అవుతున్న తమ్ముళ్ళు
X
ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రధాన్ని రోడ్ల మీదకు తెస్తున్నారు. ఆయన ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాలలో భారీ టూర్ వేస్తున్నారు. అన్నవరం స్వామి వారి సన్నిధానంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన తరువాత కత్తిపూడి జంక్షన్ వద్ద భారీ సభలో పవన్ వారాహి రధానికి కొబ్బరి కాయ కొడతారు.

వారాహి రధం అది లగాయితూ గోదావరి జిల్లాలలో కీలక నియోజకవర్గాలలో జోరుగా తిరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటి అంటే తమ పార్టీకి బలం ఉన్న నియోజకవర్గాలు, తాము సీట్లు పొత్తులో భాగంగా అడగబోయే చోట్లనే వారాహి రధం కలియతిరగనుంది. వారాహి రధాన్ని అలా పవన్ స్టీరింగ్ పెట్టి తిప్పుతూంటే తమ్ముళ్ళకు ఆయా నియోజకవర్గాలో టెన్షన్ మొదలైంది అని అంటున్నారు.

ఇక వారాహి రధం ఒక్కసారి వెళ్ళే రూట్లు చూసుకుంటే కనుక ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్‌, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు ఆ తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని తెలుస్తోంది. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాలోని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.

ఇవన్నీ తమకు బలమున్న సీట్లు అని జనసేన భావిస్తోంది. పైగా పొత్తు లేకపోయినా గెలిచే సీట్లుగా చెప్పుకుంటోంది. అందుకే పవన్ ఈ సీట్ల గుండానే వారాహిని తిప్పబోతున్నారు అని అంటున్నారు. అయితే ఈ సీట్లలో తెలుగుదేశం చాలా కాలంగా పట్టును సాధించి ఉంది.

అనేక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు గెలుస్తూ వస్తున్నారు. బలమైన నాయకత్వంతో పాటు క్యాడర్ కూడా గట్టిగా ఇక్కడ టీడీపీకి ఉంది. ఇపుడు వారాహితో పవన్ దూసుకొచ్చి ఈ సీట్లలో హల్ చల్ చేస్తే జనసైనికులు కూడా పూర్తిగా యాక్టివ్ అవుతారు. దాంతో ఆయన చోట్ల వారు కచ్చితంగా సీట్ల కోసం పట్టుబట్టే అవకాశం ఉంది.

ఇదే ఇపుడు తమ్ముళ్లకు టెన్షన్ పెట్టేదిగా కనిపిస్తోంది అని అంటున్నారు. టీడీపీకి బలం ఉన్న చోట్ల సీట్లు వదులుకోవడానికి తమ్ముళ్ళు ససేమిరా అంటున్నారు. అయితే జనసేన మాత్రం అంతా వ్యూహాత్మకమే అన్నట్లుగా ఈ సీట్ల కోసమే రధయాత్ర చేస్తోంది అని అంటున్నారు.

ఇక పొత్తులఒ కొన్ని సీట్లు జనసేనకు వదిలినా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్తిపాడు, ముమ్మిడివరం, కాకినాడ సిటీ, పాలకొల్లు లాంటి సీట్లు టి‌డి‌పి అసలు వదులుకోదని అంటున్నారు. దీంతో అక్కడే పేచీ వస్తుందని కూడా అంటున్నారు.

మరి ఈ సీట్లు అన్నీ తమకే కావాలని జనసేన పంతం మీద ఉంది. అక్కడ నాయకులు అపుడే కర్చీఫ్ వేసేశారు కూడా పవన్ వారాహితో వారికి రెట్టింపు బలం ధైర్యం వస్తుంది. మరి ఆ సీట్లు వారు వదులుకోమంటే తమ్ముళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వారాహి రధయాత్ర మాత్రం తమ్ముళ్లకు ఫుల్ టెన్షన్ పెట్టేలా సాగుతోందా అంటే ముందు ముందు చూడాల్సినవి చాలానే ఉన్నాయని అంటున్నారు.