Begin typing your search above and press return to search.

ప్రాణ భయంతో వైసీపీ ఎమ్మెల్యేలు...కేంద్రానికి ఫిర్యాదు చేస్తానంటున్న పవన్

By:  Tupaki Desk   |   2 Feb 2023 8:00 PM GMT
ప్రాణ భయంతో వైసీపీ ఎమ్మెల్యేలు...కేంద్రానికి ఫిర్యాదు చేస్తానంటున్న పవన్
X
సొంత పార్టీ ప్రభుత్వంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాణ భయంతో ఉన్నారని, ఇది దారుణం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ విషయం మీద డీజీపీ తగిన విధంగా స్పందించకపోతే తాను కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను అని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ అసలు ఏపీలో ఏమి జరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద సీరియస్ ఆరోపణలు చేస్తే హోం మంత్రి కానీ డీజీపీ కానీ స్పందించకపోవడం ఏంటని మండిపడ్డారు. వెంకటగిరికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి రక్షణ సిబ్బందిని తగ్గించారని, ఆయనకు ప్రాణ రక్షణ బాధ్యతను డీజీపీ తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.

ఏపీలో ఎమ్మెల్యేలే ప్రాణాలను అరచేత పెట్టుకుని బతికే రోజులు వచ్చాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్ర హోం శాఖకు తాను తెలియచేస్తాను అని పవన్ చెప్పడం విశేషం. ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రాణభయంతో ఉన్నారని, వారు స్వేచ్చగా మాట్లాడుకునే పరిస్థితి అయితే లేదని పవన్ ఘాటు విమర్శలు చేశారు.

ఏకంగా ముఖ్యమంత్రి జగన్ ఆఫీస్ మీద అధికార పార్టీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్యోన్ టాపింగ్ ఆరోపణలు చేస్తే డీజీపీ కానీ హోం మంత్రి కానీ ఎందుకు స్పందించడంలేదని పవన్ నిలదీశారు. ఇక తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని, తనకు ప్రాణహాని ఉందని సీనియర్ ఎమ్మెల్యే ఆనం అంటూంటే కూడా పట్టించుకోరా అని పవన్ మండిపడ్డారు. ఈ విషయాల మీద ప్రజలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, తనకు భద్రత తగ్గించారని, తనకు ప్రాణ హాని ఉందని ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అదే టైం లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వైసీపీ ప్రభుత్వం మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన అయితే జగన్ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది అని సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీలో తనకు అనేక అవమానాలు జరిగాయని, ఆ పార్టీ తరఫున తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని చెప్పి షాక్ తినిపించారు.

ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో ఈ ఇద్దరు నెల్లూరు రెడ్ల కామెంట్స్ వేడిని పెంచుతున్నాయి. మరో వైపు ఈ విషయంలో విపక్షాలు ఇప్పటివరకూ ఎంటర్ కాలేదు. టీడీపీ అయితే అన్నింటినీ గమనిస్తోంది. అయితే జనసేన తరఫున ఫస్ట్ రియాక్షన్ పవన్ నుంచి వచ్చింది. ఏపీలో జరుగుతున్న పరిణామాల మీద తాను కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తాను అంటూ పవన్ ముందుకు రావడంతో ఈ వేడి మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది అంటున్నారు. పవన్ రియాక్షన్ మీద వైసీపీ నుంచి ఏ రకమైన కామెంట్స్ వస్తాయో ఏ రకంగా కౌంటర్ చేస్తారో చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.