Begin typing your search above and press return to search.
పవన్ కు దేశంపై గాలి మళ్లింది
By: Tupaki Desk | 7 April 2018 5:51 AM GMTకొద్దిరోజులు ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఏపీలో ఒక్క సీటు కూడా లేని వామపక్ష నేతలతో కలిసి పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నటి పాదయాత్రలో కూడా ఆయన పాల్గొన్నారు. చిత్రంగా ఈరోజు ఆయన ఒక కొత్త సబ్జెక్టుపై స్పందించారు. అటు జగన్ పై గాని - ఇటు చంద్రబాబుపై గాని ఏ వ్యాఖ్య అందులో లేదు. ఇంకా చెప్పాలంటే.. ఆయన తాజా వ్యాఖ్యాలు దేశ భవిష్యత్తు గురించి చేసినవని చెప్పొచ్చు.
నాలుగైదు ట్వీట్ల ద్వారా ఆయన పర్యావరణంపై తీవ్రమైన ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.... *వెలుగుతున్న ఇండియా బయట దేశాలను అలరిస్తుందే కానీ ఇండియాను కాదు. మన దేశ ఎకానమీ పెరుగుతూ ఉండవచ్చు, ప్రపంచ వేదికపై ఇండియా మెరుస్తూ ఉండవచ్చు... కానీ రాజకీయ అవినీతి దేశానికి భవిష్యత్తు లేకుండా చేస్తోంది. రాజకీయ వ్యవస్థలో వ్యవస్థీకృతంగా పేరుకుపోయిన అవినీతి జాడ్యం దేశ సౌభాగ్యాన్ని దిగజార్చుతోంది. ప్రజల పట్ల, వ్యవస్థ పట్ల రాజకీయనేతలకు ఎలాంటి పట్టింపులు లేకపోవడం విస్మయం. ఇది మన వ్యవస్థను నాశనం చేస్తోంది. ఎక్కడో ఎందుకు దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని మనకు కనీసం స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు. ఉదాహరణకు చెప్పాలంటే... ఏపీలోని తుండూరు ఆక్వా పార్కును గమనిస్తే సరిపోతుంది. ఆ ప్రాంత యువకులు నాతో కలిసి తీవ్రమైన ఆవేదన వెలిబుచ్చారు. కనీసం స్వచ్ఛమైన గాలి, నీరు కూడా మాకు లేకుండా చేస్తున్నారని వారు నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు* అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్స్ చేశారు.
మరికొన్ని ట్వీట్లు కూడా ఎకానమీ పై చేశారు. *అనుభవజ్ఞులైన మన రాజకీయ నేతలు చేస్తున్న రాజకీయ పాలనా ప్రయోగాలు వ్యవస్థ చేటు చేస్తున్నాయి. లోపభూయిష్టమైన పబ్లిక్ పాలసీలు, స్థిరంగా లేని ఆర్థిక ఎదుగుదల - బలహీనవర్గాలపై మాత్రమే బలంగా పని చేసే చట్టాలు, బలంగా ఉన్నవారిని వదిలేసి దేశంపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. ఇలాంటి ఎన్నో అంశాలు దేశాన్ని పీడిస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే... ప్రాథమిక హక్కుల కోసం కూడా ప్రజలు పోరాడే రోజులు వస్తాయి. ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ అగ్నిగుండంలా రగులతోంది. నాయకులు - పాలకులు మేలుకోవాల్సిన అవసరం ఉంది* అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.
పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే... మోడీని - చంద్రబాబును ఉద్దేశించే చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. లోకేష్ పై ఇప్పటికే తీవ్ర ఆగ్రహంగా ఉన్న పవన్ ఆక్వా పార్కు వెనుకనున్నది లోకేష్ అని ఆయనకు సమాచారం ఉందట. అందుకే దానిని ఉదహరించారు. ఇక తన ట్వీట్లలో చేసిన విషయాలు కూడా దళిత చట్టసవరణ - బ్యాంకుల మోసాలు వంటి అంశాలపై మోడీని - రాజకీయ అవినీతి ట్వీట్లు మోడీ-చంద్రబాబు-లోకేష్ ను ఉద్దేశించే చేసినట్లు సోషల్ మీడియాలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే అనేకరకాల ప్రత్యక్ష ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా మోడీ-బాబు ఇద్దరినీ ఎత్తిపొడిచినట్లు అర్థమవుతుంది.