Begin typing your search above and press return to search.

బాబు స‌ర్కారుకు తాజా డెడ్ లైన్ పెట్టిన ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   23 Dec 2017 6:58 AM GMT
బాబు స‌ర్కారుకు తాజా డెడ్ లైన్ పెట్టిన ప‌వ‌న్‌
X
విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన భూవివాదంపై ఏపీ అధికార‌ప‌క్షానికి చెందిన ఒక ఎమ్మెల్యే అనుచ‌రులు సాగించిన దుశ్శాస‌న ప‌ర్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఒక ద‌ళిత మ‌హిళ వ‌స్త్రాల్ని ఊడ‌దీసే ప్ర‌య‌త్నం చేయ‌టం.. ఆ క్ర‌మంలో ఆమెపై దాడికి పాల్ప‌డిన వైనంపై సీరియ‌స్ అయ్యారు. తాజాగా ఈ ఉదంతంపై ట్విట్ట‌ర్ లో వ‌రుస ట్వీట్లు చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్.

బాధిత మ‌హిళ‌కు న్యాయం చేసేందుకు ఏపీ స‌ర్కారు ప్ర‌య‌త్నించాల‌ని.. లేనిప‌క్షంలో స‌మ‌స్య తీవ్ర‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రించారు. విశాఖ‌లో రాజ‌కీయ నాయ‌కుల దాష్ఠీకానికి గురైన మ‌హిళ కేసులో ప్ర‌భుత్వం నుంచి స‌రైన స్పంద‌న‌ను ప్ర‌జ‌లు ఆశిస్తున్నార‌ని.. ఈ దారుణానికి పాల్ప‌డిన వారిపై ప్ర‌భుత్వం లేదంటే పోలీసులు త‌రుపు నుంచి చ‌ర్య‌లు తీసుకోకుంటే ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌న్నారు.

ఈ వివాదం చాలా సున్నిత‌మైన‌ద‌ని.. రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు చేయ‌కూడ‌దంటూ రాజ‌కీయ నేత‌ల‌కు సూచ‌న చేశారు. బాధితుల‌కు న్యాయం చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌కుంటే రోహిత్ వేముల ఉదంతం మాదిరి జాతీయ అంశంగా మారుతుంద‌న్నారు. తాను ప‌ర్స‌న‌ల్ గా వెళితే.. ప్ర‌భుత్వం మీద తీవ్ర ఒత్తిడి ప‌డుతుంద‌న్న మాట‌ను ప‌వ‌న్ ట్వీట్ లో స్ప‌ష్టం చేశారు.

నిస్స‌హాయ‌మైన మ‌హిళ‌పై దౌర్జాన్యానికి పాల్ప‌డ‌టం స‌రికాద‌న్న ప‌వ‌న్‌.. కొంత‌మంది వ్య‌క్తులు చేసిన ఘ‌ట‌న‌కు కులం రంగు పుల‌మ‌టం స‌రికాద‌న్నారు. కొద్ది మంది చేసే నేరాలు తీవ్ర‌మైన కులం గొడ‌వ‌లుగా మారే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ఈ దారుణాన్ని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో పాటు.. దాడుల‌కు పాల్ప‌డిన కులానికి చెందిన వారు సైతం ఈ ఘ‌ట‌న‌ను ఖండించాల‌న్నారు.

బాధితురాలికి అంతా అండ‌గా నిల‌వాల‌ని.. ఎవ‌రూ ఈ వివాదాన్ని సంచ‌ల‌నం చేయ‌కుండా సంయ‌మ‌నం పాటించాల‌న్నారు. ప‌ట్ట‌ప‌గ‌లు ఒక మ‌హిళ మీద కొంద‌రు వ్య‌క్తులు దాడి చేయ‌టం.. అమానుషంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. అదెలాంటి కార‌ణ‌మైనా స‌మ‌ర్థ‌నీయం కాద‌న్నారు. అధికార టీడీపీ.. విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్‌.. టీడీపీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఈ ఘ‌ట‌న మీద అసెంబ్లీలో చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ అంశంపై ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకునే క‌న్నా.. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఏపీలో మ‌రెక్క‌డా చోటు చేసుకోకుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. అసెంబ్లీలో చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. ప‌వ‌న్ తాజాగా ఇచ్చిన డెడ్ లైన్ విష‌యంలో బాబు స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.