Begin typing your search above and press return to search.

పవన్.. ఏపీ కోదండరాం కానున్నారా?

By:  Tupaki Desk   |   28 Aug 2016 9:21 AM GMT
పవన్.. ఏపీ కోదండరాం కానున్నారా?
X
ప్రత్యేక హోదా మీద తన వైఖరిని సూటిగా.. స్పష్టంగా చెప్పేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయ పక్షాలు మిశ్రమ స్పందన వ్యక్తమైందని చెప్పాలి. సీపీఐ నారాయణతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నెగిటివ్ గా రియాక్ట్ అయితే.. ఏపీ అధికారపక్ష నేతలు కాస్త పాజిటివ్ గా స్పందించారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా ప్రత్యేకహోదా సాధనకు జేఏసీ ఏర్పాటు చేయాలని.. అన్ని రాజకీయ పార్టీల్ని అందులో భాగస్వామ్యం చేయాలని కోరింది. జేఏసీ ఛైర్మన్ గా పవన్ సారథ్యంలో తాము పని చేయటానికి సిద్ధమని చెప్పేసింది.

కాంగ్రెస్ పేరు వినిపిస్తేనే కస్సుమనే పవన్ కల్యాణ్.. ఆ పార్టీ నేతలు ప్రపోజల్ కు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. ఇక.. జేఏసీ ఐడియాకు సీపీఎం నుంచి కూడా సానుకూలత వ్యక్తమైంది. ఇక.. ఏపీ బీజేపీనేతలు పవన్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యేందుకు సుతారం ఇష్టపడటం లేదు.

ఇదిలా ఉంటే.. కొన్ని పార్టీల నోటి నుంచి వచ్చిన జేఏసీ ఆలోచన కార్యరూపం దాల్చే అవకాశం ఉందా? అంటే సందేహమనే చెప్పాలి. నిజానికి రాజకీయ పార్టీలన్నీ ఉమ్మడిగా పోరాటం చేస్తే కేంద్రం మీద విపరతమైన ఒత్తిడి ఏర్పడే వీలుంది. కలిసి కట్టుగా ఫైట్ చేద్దామని చెబుతున్న రాజకీయ పక్షాలకు.. నిజంగానే ఆ ఆలోచన ఉందా? అన్నది సందేహమే. నిజంగా వారికి ఆ కమిట్ మెంట్ ఉండి ఉంటే.. పవన్ కల్యాణ్ వరకూ అవకాశం వచ్చిఉండేది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

కొన్ని పార్టీలు జేఏసీ కాన్సెప్ట్ ను తెర మీదకు తీసుకొచ్చిన క్రమంలో ఏపీ కోదండరాంగా పవన్ కల్యాణ్ మారతారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వతహాగా హక్కుల ఉద్యమ నాయకుడైన కోదండరాంకు.. పవన్ కల్యాణ్ కు అస్సలు పోలికే లేదు. పరిస్థితుల ప్రభావంతో ఉద్యమ బాట పట్టిన వ్యక్తి పవన్ అయితే.. తొలినాళ్ల నుంచి హక్కుల ఉద్యమంలో భాగస్వామ్యమైన నేత కోదండరాం. ఈ నేపథ్యంలో జేఏసీ ఐడియా పవన్ వరకూ వెళతాయా? అన్నది ఒక సందేహం. ఎందుకంటే.. తెలంగాణ జేఏసీలో కీలక పాత్ర పోషించింది కోదండరాం అయినప్పటికీ.. ఆయన ఛైర్మన్ గా ఆస్థానంలో కూర్చోవటం వెనుక ఏం జరిగిందన్నది మర్చిపోకూడదు. తెలంగాణకు చెందిన ఒక ముఖ్యనేత చొరవతోనే జేఏసీ రాజకీయ ఛైర్మన్ గా కోదండరాం తెర మీద రావటమే కాదు.. మిగిలిన వారు కలవాల్సిన వాతావరణాన్ని సృష్టించారన్న విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణలో మాదిరి ఏపీలో అంతటి బ్యాక్ ఎండ్ వర్క్ చేసే మైండ్ సెట్ పవన్ కు ఉందా? అన్నది సందేహమే. అందుకే.. ఆయన ఎప్పటికీ ఏపీ కోదండరాంలా అయ్యే అవకాశం లేదనే చెప్పాలి.