Begin typing your search above and press return to search.

ఐదో తేదీ త‌ర్వాత ప‌వ‌న్ తాడో పేడో

By:  Tupaki Desk   |   30 July 2016 3:26 PM GMT
ఐదో తేదీ త‌ర్వాత ప‌వ‌న్ తాడో పేడో
X
రెండేళ్ల కింద‌ట ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్ప‌ట్నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏ రాజ‌కీయ ప‌రిణామం చోటు చేసుకున్నా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు క‌చ్చితంగా వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఈ వ్య‌వ‌హారం మీద ప‌వ‌న్ స్టాండేంటి.. ఈ అన్యాయం మీద ప‌వ‌న్ స్పందించ‌డేంటి.. ప్ర‌శ్నిస్తాన‌న్న ప‌వ‌న్ ఏమ‌య్యాడు.. అంటూ చ‌ర్చ జ‌రుగుతుంది. తాజాగా ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎన్డీయే స‌ర్కారు పూర్తిగా చేతులెత్తేసిన నేప‌థ్యంలో మ‌రోసారి ప‌వ‌న్ వార్త‌ల్లోకి వ‌చ్చాడు. అత‌డి వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌వన్ మౌనాన్ని అంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు. ఐతే ప‌రిస్థితుల్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్న ప‌వ‌న్ ఆగ‌స్టు 5 త‌ర్వాత మౌనం వీడాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఆగష్టు 5వతేదీవరకూ ఎదురుచూస్తా ఆ తర్వాత తాడోపేడో తేల్చుకోవ‌డ‌మే అని జనసేన అధినేత తన సన్నిహితులతో అన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌త్యేక హోదా అంశం ప్ర‌స్తుతం పార్ల‌మెంటులో చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రాజ్యసభలో పెట్టిన ప్రైవేట్ బిల్లుపై వాడివేడి చర్చజర‌గ‌డం.. ముందు ప్రైవేటు వ్యక్తులు బిల్లు తేవడం కుదరదంటూ దాటవేసే ప్రయత్నం చేసిన ప్ర‌భుత్వం ఆగష్టు 5న దీనిపై ఓటింగ్ కు అంగీకరించ‌డం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఆగ‌స్టు 5వరకూ వేచి చూసి.. ఆ త‌ర్వాత గ‌ళం విప్పాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఆ రోజు ప‌రిణామాల్ని బ‌ట్టి ప‌వ‌న్ ప్రెస్ మీట్ పెట్టి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. మ‌రి ప‌వ‌న్ వైఖ‌రి ఎలా ఉండ‌బోతోందో చూడాలి.