Begin typing your search above and press return to search.

ఉచితం వ‌ద్దంటూ...న‌గ‌దు బ‌దిలీ ఏంది ప‌వ‌న్?

By:  Tupaki Desk   |   13 Aug 2018 1:35 PM GMT
ఉచితం వ‌ద్దంటూ...న‌గ‌దు బ‌దిలీ ఏంది ప‌వ‌న్?
X
``పాటొచ్చి ప‌దేళ్ల‌యినా....ప‌వ‌ర్ త‌గ్గ‌లేదు....`` జ‌న‌సేన అధినేత‌ - సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ఓ సినిమాలో పాపుల‌ర్ డైలాగ్ ఇది. అదే త‌ర‌హాలో ``పార్టీ పెట్టి నాలుగున్న‌రేళ్ల‌యినా......రాజ‌కీయాలు - ప్ర‌జాస‌మ‌స్య‌లు వంట‌బ‌ట్ట‌లేదు``....ఇది ప్ర‌స్తుతం జ‌న‌సేనానికి సూట్ అయ్యే డైలాగ్. ఓ పార్టీ అధినేత‌కుండాల్సిన ప్రాథ‌మిక లక్ష‌ణాలు కూడా ప‌వ‌న్ కు లేవ‌ని - ఆయ‌నో పార్ట్ టైం పొలిటిషియ‌న్ అని ప్ర‌తిప‌క్షాలు గుప్పిస్తోన్న‌ విమ‌ర్శ‌లకు త‌గ్గ‌ట్లుగానే....ప‌వ‌న్ ప్ర‌వ‌ర్త‌న‌ - ప్ర‌సంగాలు ఉండ‌డం శోచ‌నీయం. ఇప్ప‌టికే త‌న రాజ‌కీయ అజ్ఞానాన్ని ప‌లుమార్లు చాటుకున్న ప‌వ‌న్....తాజాగా మ‌రోసారి త‌న అజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న‌తో వార్త‌ల్లో నిలిచారు. ఏపీలో ప్రతి మహిళకు నెలకు 2500 నుంచి 3500 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో వేస్తానంటూ....ప‌వ‌న్ తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌మ మేనిఫెస్టోలో ఆ అంశం ఉందంటూ ప‌వ‌న్ తణుకు సభలో ఇచ్చిన లీక్ హాట్ టాపిక్ గా మారింది.

ప‌వ‌న్ స్వ‌యంగా ప‌లుమార్లు ప్ర‌క‌టించిన‌ట్లుగానే ఆయ‌న‌కు రాజ‌కీయ అనుభవం లేదు. కానీ, తాజా ప్ర‌క‌ట‌నలు... ఆయ‌న‌కు ప్ర‌జా స‌మ‌స్య‌లు - సాధ‌కబాధ‌కాలపై కూడా ఏమాత్రం అవ‌గాహ‌న లేద‌ని తేటతెల్లం చేస్తోంది. రేషన్ బియ్యం తీసుకుంటున్న ఓ మహిళ వ్య‌క్తిగ‌త అనుభ‌వాన్ని ప‌రిగ‌ణలోకి తీసుకున్న ప‌వ‌న్....ఈ బృహ‌త్త‌ర న‌గ‌దుబదిలీ ప‌థ‌కానికి వ్యూహ ర‌చ‌న చేశాన‌ని స‌గ‌ర్వంగా చెప్పడం విశేషం. తాము ఆ బియ్యాన్ని తినలేక‌ తిరిగి ఆ షాపులో అమ్మి సొమ్ము చేసుకుంటున్నామని ఆ మ‌హిళ చెప్పిందట. దీంతో, ఆ బియ్యానికి బ‌దులు న‌గ‌దును నేరుగా బ్యాంకు ఖాతాలో జ‌మ చేస్తే వారికి న‌చ్చిన బియ్యం కొనుక్కుంటారన్న‌ది ప‌వ‌న్ స‌దుద్దేశ్యం. అయితే, ఇందులో అత్యంత కీల‌క‌మైన లాజిక్ ను ప‌వ‌న్ మిస్స‌య్యారు.

రాష్ట్రంలో దాదాపు 70శాతం దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి - మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు రేష‌న్ బియ్యాన్ని వండుకుంటారు. అధిక ధ‌ర వెచ్చించి బియ్యం కొనే ప‌రిస్థితులు వారికి ఉండ‌వు. ఒక‌వేళ ఎవ‌రన్నా....ఆ రేష‌న్ బియ్యం తిన‌లేము... అమ్ముకుంటున్నాము అంటే వారు తెల్ల కార్డుకు అర్హులు కాద‌న్న‌మాట‌. అటువంటి స‌మ‌యంలో ఆ విష‌యాన్ని పవన్ ...అంద‌రికీ వ‌ర్తింప‌జేయ‌డం స‌రికాదు. అదీగాక‌ - ప్రజలు ఉచితంగా ఏదీ ఆశించడం లేద‌ని - ఉపాధి చూపిస్తే చాల‌ని స్వ‌యంగా ప‌వ‌న్ అన్నారు. మ‌రి, న‌గ‌దు బ‌దిలీ చేసి....ఉచితాన్ని ప‌వ‌న్ ఎలా ఎంక‌రేజ్ చేస్తారు?దీనిని బ‌ట్టి ప‌వ‌న్ కు రాష్ట్ర బ‌డ్జెట్ - జ‌నాభా - దారిద్ర్య రేఖ‌కు దిగువ ఉన్న వారి సంఖ్య‌ - ప‌థ‌కాలు...వంటి విష‌యాల‌పై అవ‌గాహ‌న లేద‌ని స్ప‌ష్ట‌మవుతోంది. ఇక‌నైనా, ప‌వ‌న్ రెండు నాల్క‌ల ధోర‌ణి వ‌దిలేసి....రాజ‌కీయ‌ ప్ర‌పంచంలోకి వ‌చ్చి....ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో తెలుసుకొని ప్ర‌సంగాలు చేస్తే మంచిది.