Begin typing your search above and press return to search.

పవన్ బెజవాడ ట్రిప్పు షెడ్యూల్ ఇదే

By:  Tupaki Desk   |   12 Nov 2015 5:43 AM GMT
పవన్ బెజవాడ ట్రిప్పు షెడ్యూల్ ఇదే
X
ఊహించని విధంగా చేయటం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మొదటి నుంచి అలవాటే. పవన్ అన్న చిరు రాజకీయ పార్టీ పెట్టే విషయంలో విపరీతమైన హైప్ క్రియేట్ చేసి.. ఆ తర్వాత పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. కానీ.. పవన్ అందుకు పూర్తి భిన్నం. మూడో కంటికి తెలీకుండా రాజకీయ పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చేసేసి.. వ్యూహాత్మకంగా ఆ విషయాన్ని చాలా స్వల్ప వ్యవధిలో అందరికి తెలిసేలా చేశారు.

ఇక.. ఏదైనా సమస్య వస్తే.. తక్షణమే స్పందించే ఆయన.. మరికొన్ని విషయాల్లో ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుంటారు. పవన్ స్పీడ్ గురించి తెలిసిన వారంతా.. ఈ విషయం మీద ప్రశ్నించవేం.. ఈ విషయం మీద క్వశ్చన్ చేయవేం అంటూ అడగటం.. దానికి పవన్ మౌనంగా ఉండటం మామూలే. జనం ఎప్పుడైతే తన గురించి మాట్లాడుకుంటుంటారో అప్పుడు మౌనంగా ఉండటం.. తన గురించి పెద్దగా పట్టించుకోవటం లేదన్న భావన కలిగే సమయంలో ఒక్కసారి ఎంట్రీ ఇచ్చి సందడి చేయటం పవన్ కు అలవాటే. ఊరికే అన్నట్లుగా కాకుండా.. తాను గళం విప్పే ప్రతిసారి ఒక్క లెక్కగా ఆయన మాట్లాడటం కనిపిస్తుంది.

ఆయన ఏదైనా ఇష్యూను తెర మీదకు తెచ్చినప్పుడు.. ఆయన వాదనకు ధీటుగా సమాధానం చెప్పే పరిస్థితి కనిపించదు. పవన్ వ్యక్తిగతమైన మూడు పెళ్లిళ్ల విషయాన్ని పలువురు ప్రస్తావిస్తే.. ‘‘లోథావాలా రిసార్ట్స్’ లో చాలామంది ప్రముఖుల మాదిరి తాను చేయలేదంటూ చెప్పటమే కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేతలకు షాక్ ఇచ్చేలా మాట్లాడటం.. ప్రాంతీయ వాదనలు వినిపించే కేసీఆర్ లాంటి నేతను.. యాదాద్రి డిజైన్ ను ఆనంద్ సాయి అనే సీమాంధ్రుడి చేత చేయించుకోవటం శుభ పరిణామం అని చెప్పటం.. ఇలా ప్రతిసారి సరికొత్త విషయాన్ని తనదైన శైలిలో చెబుతూ.. ఎవరికి ఎలా అర్థం కావాలో అలా అర్థమయ్యేలా చెప్పే పవన్.. తాను ప్రస్తావించే అంశాలు వివాదాస్పదం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని ఉందంటూ దీపావళి రోజున ఆయనకోరటం.. దానికి ఏపీ సీఎం పేషీ నుంచి వెంటనే స్పందన రావటంతో ఆయన గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు చంద్రబాబుతో భేటీ కానున్నారు. రాజధాని శంకుస్థాపనకు ‘షూటింగ్’ కోసం గైర్హాజరు అయి.. తన ప్రత్యేకతను చాటిన పవన్.. తాజాగా మాత్రం తానే అడిగి మరీ చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇప్పించుకోవటం గమనార్హం.

పవన్ తో భేటీకి బాబు ఓకే అన్న నేపథ్యంలో హైదరబాద్ నుంచి ఉదయాన్నే బయలుదేరే ఆయన.. గన్నవరం విమానాశ్రయానికి ఉదయం 10.30 గంటలకు చేరుకోనున్నారు. అనంతరం ఆయన 11 గంటలకు రాజధాని రైతులతో ప్రత్యేకంగా భేటీ కావటం.. అనంతరం 12 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఎప్పుడూ ఏదో ఒక అంశంతో బయటకు వచ్చే పవన్ ఈసారి ఏ అంశం మీద చంద్రబాబును కలుస్తున్నారన్నది ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.