Begin typing your search above and press return to search.

రాజధాని రచ్చ లోకి పవన్ .. 30న ఏం చేయబోతున్నారంటే ?

By:  Tupaki Desk   |   27 Dec 2019 7:24 AM GMT
రాజధాని రచ్చ లోకి పవన్ .. 30న  ఏం చేయబోతున్నారంటే ?
X
ప్రస్తుతం ఏపీ లో రాజధాని అంశం అగ్గి రాజేస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదన సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టిన నాటి నుండీ నేటివరకు అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నేటి ఆ నిరసనల కార్యక్రమం 9 రోజులకి చేరింది. మూడు రాజధానుల ప్రకటనపై ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత , ఆ ప్రకటన పై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రైతులు కొనసాగిస్తున్న ఆందోళనల లో కనిపించింది కానీ, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడ లేదు.

ఆయన తన కుటుంబం తో వెకేషన్‌ కు వెళ్ళారని ప్రచారం జరిగింది. తాజాగా ఆ వేకేషన్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన జనసేనాని, వచ్చి రాగానే రాజధాని అంశం పై జనసేన పార్టీ లోని ముఖ్యమైన విభాగాల నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని గురువారం పార్టీ సీనియర్ల భేటీ లో నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీన పవన్ కళ్యాణ్ అధ్యకతన సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరి లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ముఖ్య నేతలంతా రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ, ముఖ్య నేతలు హాజరు కావాలని ఆదేశించారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్‌ లో నెలకొన్న పరిస్థితులు, అమరావతి గ్రామాల ప్రజలు, రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత వంటి అంశాలను విస్తృత స్థాయి సమావేశానికి ఎజెండాగా ఖరారు చేశారు. ఈ సమావేశంలో పవన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తుంది.

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ జరుగుతున్న తరుణంలో ఏం నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై ఆసక్తి కొనసాగుతున్న నేపథ్యంలో , జనసేన అధినేత పవన్ ఈ నెల 30న పార్టీ కార్యాలయంలో కీలక భేటీ నిర్వహిస్తుండటంతో రాజధాని విషయంలో పవన్ ఎటువంటి వైఖరి తో ముందుకు పోబోతున్నారు అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఒకవైపు తమ్ముడు పవన్ ..మూడు రాజధానులు వద్దు అంటుంటే ..అన్న చిరంజీవి మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతించారు. ఏది ఏమైనా 30వ జరిగే సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.