Begin typing your search above and press return to search.

పవన్ ను ఎలా అర్థం చేసుకోలి ..?

By:  Tupaki Desk   |   27 Aug 2016 5:38 PM GMT
పవన్ ను ఎలా అర్థం చేసుకోలి ..?
X
పార్టీ పెట్టిన రెండున్నరేళ్ల తర్వాత ఆ పార్టీ అధినేత జనాల ముందుకు వచ్చి ఒక బహిరంగ సభ పెడితే ఎలా ఉంటుంది? బహిరంగ సభ ఏర్పాటు అంటే జనసమీకరణ మొదలు.. ఏర్పాట్ల వరకూ తక్కువలో తక్కువ పది రోజుల సమయం తీసుకోవాల్సింది. తోపుల్లాంటి లీడర్లకైనా ఆ మాత్రం సమయం తప్పదు. అలాంటిది కేవలం 20 గంటల వ్యవధిలో సభకు సంబంధించిన సమాచారం బయటకు వెల్లడించటం మొదలు.. సభ ఏర్పాట్లు అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేయటం ఏమిటి? అంత ఆదరగాబాదరగా పబ్లిక్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమిటి? సభ గురించి.. అందులో వెల్లడించే అంశాల గురించి మాట మాత్రం చెప్పకుండా సమావేశాన్ని ఏర్పాటు చేయటం ఏమిటి? అసలిలా ఎవరైనా చేస్తారా? అన్న సందేహాలు పలువురి మదిలో మెదులుతాయి. కానీ.. అలాంటివి తనకు మాత్రమే సాధ్యమని చేతల్లో చేసి చూపించారు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్లు చెప్పిన ఆయన.. ఆ తర్వాత కాలంలో ప్రశ్నించలేదు. అదేంటి ప్రశ్నించటం లేదు పవన్ కల్యాణ్ అంటే.. నోటి నుంచి వచ్చే మాటను ఆచితూచి మాట్లాడాలే కానీ హడావుడి పనికి రాదని చెబుతారు. నోట్లో నుంచి వచ్చే మాటను వెనక్కి తీసుకోలేం.. అందుకే నేను ఆచితూచి మాట్లాడుతుంటా? అని పదే పదే చెప్పే పవన్ కల్యాణ్.. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పినప్పుడు ఈ మాటలే చెప్పి ఉండొచ్చుగా..?

ప్రత్యేక హోదా మీద మూడు దశల్లో పోరాటం చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్.. అందులో మొదటి దశలోని మొదటి పార్ట్ కు ముహుర్తం కూడా వెల్లడించేశారు. సెప్టెంబరు 9న కాకినాడలో తాను సభ నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తిరుపతిలో సభను ఎందుకు పెట్టానో తెలుసా అంటూ కారణం చెప్పేసిన పవన్ కల్యాణ్.. ఇంత అకస్మాత్తుగా సభ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయానికి మాత్రం సమాధానం ఇవ్వకపోవటం కాస్తంత వెలితిగా ఉందనే చెప్పాలి.

అదొక్కటే కాదు.. మొన్నటికి మొన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన ఇంటికి వచ్చి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడానని.. ఆ సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు చూడాలని చెప్పానని.. తాను ఒక్కడిని ఏమీ చేయలేనన్న మాటకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?

ఏపీకి అన్యాయం చేసిన విషయంలో కాంగ్రెస్ కు.. బీజేపీకి మధ్య తేడా లేదన్నట్లుగా తేల్చేసిన పవన్ కల్యాణ్.. ఈ రెండు పార్టీలకు తప్ప వేరేది ఏమీ లేని నేపథ్యంలోనే తాను బీజేపీకి మద్దతు పలికిన విషయాన్ని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ప్రత్యామ్నాయం లేని జాతీయ పార్టీ మీద పోరాటానికి ఎందుకు దిగుతున్నట్లు..? ఏపీ అధికారపక్షంపై విమర్శలు చేసే సందర్భంగా ఒకటికి రెండుసార్లు సర్ది చెప్పినట్లుగా మాటలు చెప్పాల్సిన అవసరం ఏమిటన్నది ఎంతకూ అర్థం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కల్యాణ్ బహిరంగ సభకు సంబంధించి చాలానే మాటలు చెప్పాల్సి ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో మౌనంగా ఉండి అనేక ప్రశ్నలు మదిలో మెదిలేలా చేసిన పవన్.. ఇప్పుడు నోరు విప్పి అంతకుమించిన సందేహాలు కలిగేలా చేశారనటంలో ఎలాంటి సందేహం లేదు.