Begin typing your search above and press return to search.

కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు వెళ్లిన ప‌వ‌న్‌.. మ‌ఠంలో బ‌స‌!

By:  Tupaki Desk   |   13 May 2018 5:14 AM GMT
కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు వెళ్లిన ప‌వ‌న్‌.. మ‌ఠంలో బ‌స‌!
X
మాట‌లు చెప్ప‌ట‌మే కాదు.. చేత‌ల్లో చేసి చూపించ‌టం కూడా అవ‌స‌రం. త‌న‌ను తాను సాదాసీదాగా చెప్పుకునే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. చేత‌ల్లోనూ అదే పంథాను అనుస‌రిస్తున్నారు. ఇందుకు ఆయ‌న తాజా తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను నిద‌ర్శ‌నంగా చూపిస్తున్నారు. ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న చేయ‌కుండానే తిరుమ‌ల టూర్ పెట్టుకున్న ప‌వ‌న్‌.. అనూహ్య నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు చెబుతున్నారు. అంతేకాదు.. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న విలాసాల‌కు అవకాశం ఇవ్వ‌కుండా సింఫుల్ గా ఉండాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

మిగిలిన ప్ర‌ముఖుల‌కు భిన్నంగా ఆయ‌న బ‌స‌.. శ్రీ‌వారి ద‌ర్శ‌నం ఉండ‌నున్న‌ట్లు చెబుతున్నారు. శ‌నివారం రాత్రి హైద‌రాబాద్ నుంచి తిరుప‌తికి విమానంలో వెళ్లిన ప‌వ‌న్‌.. తిరుప‌తి నుంచి తిరుమ‌ల‌కు న‌డ‌క మార్గాన్ని ఎంచుకున్నారు. అలిపిరి నుంచి కాలి న‌డ‌క‌న మొద‌లెట్టిన ప‌వ‌న్‌.. అర్థ‌రాత్రి స‌మ‌యానికి తిరుమ‌ల‌కు చేరుకున్నారు. ప‌వ‌న్ వెంట పెద్ద ఎత్తున అభిమానులు కొండ‌కు న‌డ‌వ‌టంతో కాలి మార్గ‌మంతా సంద‌డిగా మారింది.

అర్థ‌రాత్రి వేళ తిరుమ‌ల‌కు చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్ విలాసాల‌కు దూరంగా హంపీ మ‌ఠంలో బ‌స చేశారు. మూడు రోజుల పాటు ఆయ‌న అక్క‌డే ఉండ‌నున్నారు. తిరుమ‌ల నుంచి శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురం వెళ్లి త‌న రాష్ట్ర యాత్ర‌ను షురూ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

గ‌తంలో తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి.. మూడు రోజులు ఉండి అనూహ్యంగా తిరుప‌తి స‌భ‌ను నిర్వ‌హించ‌టం తెలిసిందే. తాజాగా తానుస్టార్ట్ చేసే రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు ముందు తిరుమ‌ల‌లో మూడు రోజులు బ‌స చేయటం ఆస‌క్తిక‌రంగా మారింది. తిరుమ‌ల‌లో తాను ఉండే మూడు రోజుల్లో తిరుమ‌ల‌లో భ‌క్తులు ఎదుర్కొనే స‌మ‌స్య‌లు.. వారికి ఎదుర‌య్యే ఇబ్బందుల గురించి తెలుసుకోవ‌టంతో పాటు.. తిరుమ‌ల చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్ని సంద‌ర్శిస్తార‌ని చెబుతున్నారు.

త‌న తిరుమ‌ల టూర్ కార‌ణంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప‌వ‌న్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని చెబుతున్నారు. వీఐపీ ద‌ర్శ‌నం కాకుండా సాధార‌ణ భ‌క్తుల మాదిరే సాదాసీదా ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఇటీవ‌ల తిరుమ‌ల‌కు వ‌చ్చిన అమిత్ షా కాన్వాయ్ పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో ప‌వ‌న్ కు భారీ బందోబ‌స్తు క‌ల్పించారు. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. తాజా తిరుమ‌ల టూర్ నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాల్ని ప‌వ‌న్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌న్న మాట పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.